కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం
గాజువాక: పెదగంట్యాడ స్వతంత్రనగర్ (ఎస్టీ కాలనీ)లో విష రసాయన విలయ తాండవాని కి ఊరు మొత్తం వల్లకాడుగా మారుతోంది. పక్కనే ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో లభించిన రసాయనాన్ని సారాగా భావించి తాగడంతో బాధితులు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఆదివారం నాటికి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి మరో నలుగురు మృతి చెందడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసుల సమాచారం. ఈ సంఘటనతో కాలనీలో పలు కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు విష రసాయనాన్ని సేవించి విగత జీవులుగా మారుతుండటంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజాగా కాలనీకి చెంది న ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నోడు, వాడపల్లి అంకమ్మ మృతి చెందడంతో కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
అప్పలమ్మ మృతదేహం వెలికితీత
ఈ దుర్ఘటనలో మృతి చెందిన పెండ్ర అప్పలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాజువాక పోలీసులు సోమవారం వెలికితీశారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసిన విషయం తెలిసిందే. సంఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని తవ్వి తీయించారు. గాజువాక తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్ సహకారంతో పంచనామా జరిపించారు. సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, గాజువాక సీఐ కె.రామారావు, ఇంటెలిజెన్స్ సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ అప్పలరాజు తదితరులు కాలనీలో పర్యటించి వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. మరోవైపు ఇక్కడి లేబొరేటరీ సామర్థ్యం సరిపోవడంలేదని, అందువల్ల ఆ రసాయనాన్ని హైదరాబాద్‌లోని లేబొరేటరీకి పంపుతున్నామని గాజువాక ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సై జ్ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ నాయుడు, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ఎం.భా స్కరరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్, సీఐలు ఎల్.ఉపేంద్ర, ఆర్.జైభీమ్ తదితరులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు సేకరించారు. కాలనీవాసుల దినచర్య, వారి ఆహార అలవాట్లు, మద్యం అలవాట్లపై వివరాలను సేకరించారు.
బాధితులను ఆదుకోండి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): స్పిరిట్ తాగి ఏడుగురు మరణించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుల కు టుంబాలకు నష్టపరిహారంగా రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన స్థలం జీవీఎంసీ పరిధిలో ఉన్నా జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు బాధితులను పరామర్శించేందుకు రాకపోడం అన్యాయమన్నారు. కలెక్టర్ సాయం ప్రకటించలేదన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఈ సంఘటనతో తేటతెల్లం అవుతోందని తెలిపారు. గాజువాకలో జనావా సాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఊరికి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు భద్రత లేకుండా పోతోందన్నారు. బతుకుతెరువు కోసం డంపింగ్ యార్డ్‌లో కాగితాలు ఏరుకునే స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సరైన ఆర్థిక భద్రత లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటన చోటుచేసుకుందన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలని కోరారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తే సహించేది లేదన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వంతో పాటు జీవీఎంసీ కూడా బాధ్యత వహించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం
పరిస్థితి విషమంగా ఉన్న బాధితుల నలుగురినీ ఒకే మంచం మీద కూర్చోబెట్టి ఫ్లూయిడ్స్‌ను ఎక్కించిన నర్సులు... బాధితుడు ఆసనాల ఎర్రోడి చేతి నుంచి రక్తం కారిపోతున్నా పట్టించుకోని సిబ్బంది... సకాలంలో సరైన వైద్యం అందించాలని కోరితే ఈసడింపులు.కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టే సంఘటనలివి..
అది మిథనాలేనా?
బాధితులు తాగిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కాహాల్) అని ఎక్సైజ్ ల్యాబ్‌లో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో తేలినట్టు కేజీహెచ్‌కు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఇది ప్రమాదకరమైనదని, కానీ మద్యంలో ఇథైల్ ఆల్కాహాల్ ఉంటుందని, అది ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది ఏ రసాయనమన్నది నిగ్గు తేల్చేందుకు ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సోమవారం రాత్రి పంపారు. అలాగే పోలీసులు కూడా రసాయన శాంపిల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపనున్నారు.
అంధత్వం వచ్చే ప్రమాదం
మిథనాల్ రసాయనాన్ని సేవించిన వారికి ప్రాణాపాయమే కాదు.. భవిష్యత్తులో పూర్తిగా అంధత్వం సంభవించే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హైడ్రోజన్ కంటెంట్ బాగా పెరిగి గుండెపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా రక్తపోటు స్థాయి పడిపోయి షాక్‌కు గురై చనిపోతారని కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ ఎసిరోసిస్ అంటారన్నారు. డయాలసిస్ ద్వారా శరీరంలోని మిథాల్ రసాయన తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment