
పాలకుల తీరుతో రిమ్స్‌లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఓపికుంటేనే ఓపీ అన్నట్లు పరిస్థితి తయారైంది. రోజు ఉదయాన్నే 12వందల నుంచి 15వందల మంది క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. రోగులకు వైద్యం పరీక్షలానే ఉంది. సీటీస్కాన్ టైం పూర్తయింది. ఎంఆర్‌ఐ ఇంతవరకు రాలేదు. వైద్యులు ఉన్నా చూసేదంతా ఎక్కువగా హౌస్ సర్జన్లు, మెడికోలే.. వైద్యుల ధ్యాసంతా బయటి క్లినిక్‌లపైనే ఉంటుందనే ఆరోపణలున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. సూపర్‌స్పెషాలిటీ అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ హోదా దక్కడం లేదు. దీంతో అత్యవసర కేసులు తిరుపతికి పంపాల్సి వస్తోంది.
కడప అర్బన్ : కడప నగర శివార్లలో పన్నెండేళ్ల కిందట వైద్యవరాన్ని రిమ్స్ రూపంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు అందించారు. ఆయన అప్పట్లో ఆస్పత్రి అభివృద్ధికోసం నిధులను వరదలా తీసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షాలు గోల చేస్తున్నప్పటికీ రిమ్స్ అభివృద్ధికి తమ వంతు శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రిమ్స్‌ను పూర్తిస్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేకంగా రిమ్స్‌లో ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల ‘గ్రౌండ్ రిపోర్ట్’.
♦ కడప రిమ్స్‌లో ప్రతిరోజు దాదాపు 9 విభాగాల్లో ఓపీ, ఐపీ సేవలను అందిస్తున్నారు. ఓపీకి 1,200 నుంచి 1,400 మంది వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. ఐపీలో 700 మంది నుంచి 730 వరకు ఇక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
♦ రోగులు ఇబ్బందిపడకుండా ఓపీ, ఐపీల్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు పనిచేయకపోవడం.. మరమ్మతులు చేయించడం, మరలా కొన్నిరోజులకు పనిచేయకపోవడం షరా మామూలైపోయింది. దాతలు ఇచ్చిన కుర్చీలను కూడా సక్రమంగా వాడడం లేకదు. సిబ్బంది సరిగా లేకపోవడంతో పేషెంట్ల బంధువులే వీల్‌చైర్లను తోసుకుపోవాల్సి వస్తోంది.
♦ కడప రిమ్స్‌లో ఓపీ, ఐపీ విభాగాల్లో దాదాపు 300కుపైగా బాత్‌రూంలు, లెట్రిన్ గదులు ఉన్నాయి. వీటికి డోర్‌లు, గడియలు, బేసిన్‌లు, ట్యాప్‌లు దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. అధ్వానంగా వున్న వీటి పరిస్థితి ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న క్యాజువాలిటీ, ఓపీ విభాగాల్లోనే ఉండటం దారుణం. వీటిల్లో దాదాపు 257లకు మరమ్మతులను చేయాల్సి వుంది.
♦ రిమ్స్ ప్రారంభంలో రూ.2కోట్ల విలు వ చేసే సిటీ స్కానింగ్ యంత్రాన్ని రేడియాలజీ విభాగంలో ఏర్పాటు చేశా రు. సాధారణంగా ఒక సిటీ స్కానింగ్ యం త్రం 20వేల స్కానింగ్‌లను మాత్రమే తీయగలదు. కానీ ఈ యంత్రం తో 50వేలకు పైగా స్కానింగ్‌లను తీశారు. త్వరలో కొత్త యంత్రం వస్తుందని అధికారులు గతేడాది నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేగాక ఈ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాల్సి ఉంది.
♦ సిటీ స్కానింగ్ యంత్రం మాట అటుంచితే... ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం అందనంత దూరంలో ఉందని రిమ్స్ వైద్యులే చెప్పుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వం ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాన్ని అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరు చేశారు. కానీ కడప రిమ్స్ పీజీ స్థాయికి చేరుకుని, పీజీ గుర్తింపును కూడా తెచ్చుకున్నప్పటికీ ఎంఆర్‌ఐని ప్రభుత్వం మంజూ రు చేసేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చిన ప్రతిసారీ ఈ అంశం గురించి రిమ్స్ అధికారులు ప్రస్తావిస్తూనే వచ్చారు.
♦ రిమ్స్‌లో వైద్యుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. 299మంది వైద్యులకు గాను కేవలం 145మంది మాత్రమే ఉన్నారు. కనీసం 105 మందినైనా ప్రభుత్వం నియమిస్తే పేషెంట్లకు సరైన సమయంలో వైద్య సేవలను అందించే అవకాశం ఉంది. అలాగే 182 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరిలో కొంతమంది డిప్యుటేషన్, బదిలీలపై వెళ్లారు. ఆరు నెలలుగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అలాగే ఇతర సిబ్బంది 750కాగా, 155 మంది కొరత ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఔట్ సోర్సింగ్ విభాగంలో 40మంది నియామకాలను చేపట్టేందుకు ఏడాది కాలంగా జిల్లా అధికారులు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. తద్వారా కొన్ని విభాగాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
♦ రోగులకు, వారి బంధువులకు రిమ్స్ ఆవరణంలో ప్రత్యేకంగా ఎలాంటి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులను పడాల్సి వస్తోంది. ఓపీ, ఐపీలకు ఎదురుగా ఉన్న డివైడర్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాత్రం ఐపీ–ఓపీ మధ్య భాగంలో, కారిడార్‌లో పార్కింగ్ చేసుకుంటున్నారు.
♦ రోగుల సహాయకులు ఉండేందుకు ఇటీవల దాతల సహాయంతో ఒక షెల్టర్ కట్టారు. దగ్గరగా లేదనే ఉద్దేశంతో దానిని వారు ఉపయోగించడం లేదు. తమ వారికి దగ్గరగా ఉండాలని కారిడార్లలోనే ఉంటున్నారు.
♦ రిమ్స్ ప్రారంభంలో దాతల సాయంతో పేషెంట్ల కోసం కడప పాత రిమ్స్ నుంచి కొత్త రిమ్స్‌కు నాలుగు బస్సులను ఉచితంగా నడిపించారు. కాలక్రమేణ నిర్వహణ చేయలేమనీ బస్సులను పూర్తిగా మూలన పెట్టారు.
♦ రిమ్స్‌కు సూపర్‌స్పెషాలిటీ హోదా ఊరిస్తూనే ఉంది. అన్ని రకాలైన అర్హత ఉన్నా ఎందులో ప్రభుత్వం రిమ్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా జిల్లావాసులు సూపర్‌స్పెషాలిటీ సేవలను కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో తిరుపతి, కర్నూల్‌కు పంపాల్సి వస్తోంది.
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
రిమ్స్‌లో పూర్తి స్థాయిలో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపిఎంఎస్‌ఐడీసీ ద్వారా మంజూరైన నిధులతో ఇప్పటికే పనులను ప్రారంభించామనీ సూపరింటెండెంట్ డాక్టర్ టి.గిరిధర్ వివరణ ఇచ్చారు. సిటీ స్కానింగ్ యంత్రం మంజూరైందనీ, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులపై ఎప్పటికపుడు నివేదికను పంపిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment