Staff shortage
-
సిబ్బందిలేక.. ఇబ్బంది !
సాక్షి, యాదాద్రి : కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం కరోనా బాధితులకు స్థానికంగా ఐసోలేషన్‌వార్డుల్లో వైద్యం అందించాలని నిర్ణయించింది. అయితే ఆయా ఆస్పత్రులు డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కరోనా చికిత్సకోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భువనగిరి, రామన్నపేట ఏరియా ఆస్పత్రి, చౌటుప్పల్, ఆలేరు కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఉన్నప్పటికీ వైద్యం అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది మాత్రం సరిపడా అందుబాటులో లేరు. దీంతో కరోనా వైద్య సేవలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 50 బెడ్లు.. మూడు షిప్టుల్లో విధులుజిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సకోసం వైద్యశాలల్లో మొత్తం 50 బెడ్లు ఏర్పాటు చేశారు. భువనగిరిలో 20ఆలేరులో 10, రామన్నపేటలో 10, చౌటుప్పల్‌లో 10 బెడ్లతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి ప్రతి ఆస్పత్రిలో మూడు షిప్టుల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్పత్రిలో నాలుగు టీమ్‌లను తయారు చేస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఇలా షిప్టులుగా విభజించారు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు వార్డు బాయ్‌లు, ఇద్దరు స్వీపర్లు ఉండాలి. అయితే రాత్రి షిప్టుకు కేటాయించిన వారు రోజువిడిచి రోజు విధులు నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది ఇలా.. భువగనరి.. భువనగిరిలో 26 మంది డాక్టర్లకు గాను 14 మంది ఉన్నారు. 25 మంది స్టా‹ఫ్ నర్స్‌లకు గాను 16 మంది ఉన్నారు. వార్డు బాయ్‌లు, ఏఎన్ఎంల కొరత కూడా ఉంది. ఆస్పత్రికి 1000 పీపీ కిట్లు, 1000 ఎన్–95 మాస్క్‌లు, 10 ఆక్సిజన్ సిలెండర్లు, 10 బెడ్స్, 1 వెంటిలేటర్ వచ్చాయి. ఇంకా పల్స్ ఆక్స్, బెడ్స్, వెంటిలేటర్లు రావాల్సి ఉంది. రామన్నపేట.. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిచేందుకు పది బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్‌వార్డును ఏర్పాటుచేశారు. అస్పత్రిలో సివిల్‌సర్జన్ 3, అసిస్టెంట్ సివిల్‌సర్జన్ 12, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు 6 మొత్తం 21 మందికి గాను 8 మంది డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. స్టా‹ఫ్‌నర్సులు 14, హెడ్‌నర్సులు 2, ఏఎన్ఎం 3 పోస్టులకుగాను ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు వార్డ్‌బాయ్స్‌గాను ముగ్గురు ఉన్నారు. వీరుగాక 11మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చౌటుప్పల్.. చౌట్పుపల్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో మొత్తం పోస్టులు 49కి గాను 15 మంది మాత్రమే ఉండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలో మొత్తం 17 మంది వైద్యులకుగాను 9 మంది ఉన్నారు. స్టాఫ్, హెడ్‌నర్సులు 12మందికి ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆలేరు.. ఆలేరులో 10 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. వీటీతోపాటు బీబీనగర్ ఎయిమ్స్‌లో ఐసోలేషన్ వార్డు కొనసాగుతోంది. -
సర్జరీ.. కిరికిరి!
మెదక్ జిల్లాకు చెందిన శ్రీదేవి (పేరు మార్చాం) ముక్కు లోపల కురుపు ఏర్పడడంతో కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రికి వచ్చింది. వ్యాధి తీవ్రతను బట్టి ఆమెకు సర్జరీ తప్పదని వైద్యులు తెలిపారు. కానీ...ఈఎన్టీలో ఆపరేషన్ థియేటర్లు, మౌలిక వసతులు, వైద్యుల కొరత కారణంగా ఆమెకు సర్జరీ చేయడానికి నాలుగు నెలల తర్వాత తేదీ ఇచ్చారు. అప్పటి వరకు వేచి ఉండలేక శ్రీదేవి బంధువులు ప్రత్యామ్నాయం గురించి ఈఎన్టీ వైద్యులను అడగ్గా..వారు ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు మూడు రోజుల్లోనే సర్జరీ పూర్తి చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితిలో వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నారు...ఇది ఒక్క శ్రీదేవి సమస్యే కాదు...నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీ సంబంధిత వ్యాధులతో వస్తున్న రోగులందరిదీ. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులకు జబ్బు చేసింది. వీటికి సర్జరీ చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఏటా ఆయా ఆస్పత్రుల్లో సర్జరీల సంఖ్య తగ్గు ముఖం పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా అన్ని బోధనా సుపత్రులకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించింది. 60 శాతం నిధులను వైద్యపరికరాల కొనుగోలుకేకేటాయించింది. వైద్యులకు పదోన్నతులు కల్పించి ఖాళీలను కూడా చాలా వరకు భర్తీ చేసింది. అయినా ఆయా ఆస్పత్రుల్లో ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగడం లేదు. ఔట్ పేషంట్ల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ..సర్జరీల సంఖ్య కూడాతగ్గింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో హృద్రోగులకు ఈసీ జీ, 2–డి ఎకో, యాంజియోగ్రామ్ వంటి సాధారణ చికిత్సలు మినహా క్లిష్టమైన ఓపెన్‌హార్ట్,గుండె, వాల్వŠస్ మార్పిడి, మూసుకుపోయిన రక్తనాళాలను తెరిపించడం వంటి చికిత్సలు అందడం లేదు. 37 ఏళ్ల క్రితమే కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఉస్మానియా సహా గాంధీ మూత్రపిండాల చికిత్సల విభాగాలు ప్రస్తుతం సాధారణ డయాలసిస్ సర్వీసులకే పరిమితమవడం కొసమెరుపు. ఉస్మానియాతో పోలిస్తే గాంధీ ఆస్పత్రి కొంత భిన్నమైంది. కొత్త భవనంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడే ఉన్నాయి. 1012 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికి గతంతో పోలిస్తే ఓపీ బాగా పెరిగింది. ఇక్కడికి రోజుకు సగటున 3500 మంది వరకు వస్తుంటారు. ఆస్పత్రిలో 30కి పైగా ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ప్రభుత్వం తాజాగా మరో 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఆస్పత్రిలో గుండె, కిడ్నీ బాధితులకు కనీస చికిత్సలు అందడం లేదు. వీరంతా సమీపంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలి పోతున్నారు. అనస్థీషియన్ల కొరతకు తోడు వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాల వల్ల తరచూ సర్జరీలు నిలిచిపోతున్నాయి. ఇక్కడికి వస్తున్న ఆరోగ్యశ్రీ రోగులను..కొంత మంది వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా బినామీ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స చేయాలంటే కనీసం నెల రోజులపైనే పడుతుందని, అదే తమకు తెలిసిన నర్సింగ్ హోమ్‌లో చేరితే రెండు మూడు రోజుల్లో చికిత్స చేసి పంపుతారని చెబుతుండడం బహిరంగ రహస్యమే. ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగక పోవడానికి ఇదేకారణమని అంటున్నారు. నిలోఫర్‌లో ఇదీ సీన్ 1953లో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక రాజీవ్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పడకల సంఖ్యను సైతం 500 నుంచి 1000కి పెంచారు. ఇక్కడికి నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడిన చిన్నారులు, వివిధ అవయవాల లోపంతో బాధపడుతూ జన్మించిన శిశువులను ఎక్కువగా తీసుకొస్తుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు ఉన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ 2016లో 11305 సర్జరీలు చేస్తే..2018లో వీటి సంఖ్య 2668కి పడిపోయింది. ఆస్పత్రి వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలకు తోడు ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్ తక్కువగా ఉండటం వల్ల చాలా మంది వైద్యులు చికిత్సలు చేసేందుకు ఆసక్తిచూపడం లేదు. శిశువులకు చికిత్స చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేమి వల్ల వారంతా సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. వాళ్లకు వినిపించదు..వీళ్లకుకన్పించదు 125 పడకల సామర్థ్యం ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1500 మంది వస్తుంటారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారితో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులు వస్తుంటారు. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో సర్జరీ కోసం నాలుగు నుంచి ఆరు మాసాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల రోగులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది వైద్యులు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. అంతో ఇంతో ఆర్థికస్తోమత ఉన్న మధ్య తరగతి రోగులను సొంత క్లినిక్స్‌కు తరలించుకుని చికిత్సలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015తో పోలిస్తే 2018లో చికిత్స సంఖ్య భారీగా తగ్గడానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉష్...మానియా ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేసిన గుర్తింపుతో పాటు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఘనత సాధించిన ఉస్మానియా ఆస్పత్రిలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు దేశంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ చికిత్సలూ కరువయ్యాయి. ప్రస్తుతం అధికారికంగా 1,168 పడకలు ఉండగా, అనధికారికంగా 1,385 పడకలు ఉన్నాయి. నిత్యం 1,400 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు 250 మంది వస్తుండగా, వీరిలో అత్యధికులు ప్రమాదాల్లో గాయపడినవారు, పాయిజన్, పాముకాటు బాధితులు, న్యూరో సంబంధిత బాధితులే. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు ఏడాది క్రితం వరకు అనేక అరుదైన చికిత్సలు చేసి ఆస్పత్రి చరిత్రను తిరగ రాశారు. కానీ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలు ఉన్నా లేనట్లుగానే తయారయ్యాయి. నిపుణుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి ఫలితంగా కనీస వైద్యసేవలు అందడం లేదు. గతంతో పోలిస్తే ఇక్కడ సర్జరీలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ చికిత్సలకు ముందుకు రాని వైద్యులు ప్రస్తుతం నిమ్స్ జీవన్‌దాన్‌లో 6732 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 3579 మంది కిడ్నీ బాధితులు కాగా, 3020 మంది కాలేయ ఫెయిల్యూర్ బాధితులు ఉన్నారు. సాధారణ చికిత్సలతో పోలిస్తే అవయవ మార్పిడి చికిత్సలు చాలా ఖరీదుతో కూడినవి. గుండె, కాలేయం, మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడంతో మృత్యువాతపడుతున్న రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఖరీదైన చికిత్సలను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చింది. సర్జరీ చేసిన వైద్యులకు ప్రోత్సాహకాలను కూడా భారీ గానే ఇస్తుంది. కానీ ఆస్పత్రిలోని ఆయా విభాగాధిపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం, ఒకరికొకరు సహకరించుకోక పోవడం, తగిన గుర్తింపు రాక సర్జరీలు చేయాలనే ఆసక్తి ఉన్న వైద్యులు కూడా ముందుకు రావడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో సర్జరీలు సంఖ్య తగ్గుదలకు ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. -
సిబ్బంది లేక ఇబ్బంది
ఇక్కడ పంచకర్మ విధానంలో అందించే వైద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఆర్థితవాతం (ఏదైనా ఒక భాగానికి వచ్చే పక్షవాతం), సెరిబ్రెల్ అటాక్సియా (బుద్ధిమాంధ్యం గల వారికి), ఒబెసిటీ (ఊబకాయం), ఆమవాతం (కీళ్లనొప్పులు), శిరోధార, శిరోవస్థి (వివిధ రకాల తలనొప్పులు),అభ్యంగ నాడీశ్వేదం(శరీరంలోని అనేక/వివిధ భాగాలకు వచ్చే పక్షవాతం) ఇలాంటివి ఎన్నోరకాల రోగాలకు ఇక్కడ మసాజ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అల్లోపతి ద్వారా నయంకాని, లేదా నయం అయినట్టు అనిపించి మళ్లీ వచ్చే రోగాలను కొద్ది రోజుల్లోనే ఇక్కడ శాస్వతంగానయం చేస్తున్నారు. వెంగళరావునగర్: అల్లోపతికి లొంగని మొండి రోగాలు సైతం ఆ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యానికి నయమైపోతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయంకాని పక్షవాత రోగులు కూడా ఇక్కడి సేవలకు చిరునవ్వుతో తిరిగి వెళుతున్నారు. ఇక లాభంలేదు.. ఈ రోగంతో ప్రాణాలు పోవడం ఖాయమని జీవితంపై ఆశలు వదులుకున్న వారు సైతం ఇక్కడి అద్భుతమైన వైద్య సేవలకు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వెళుతున్నారు. అదే వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల. ఇక్కడ అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. వైద్యులు సైతం రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రోగంపై పూర్తి పరిశోధన చేసి మరీ వైద్యం చేస్తున్నారు. ఎటొచ్చీ సరిపడినంత మంది కింది స్థాయి సిబ్బంది లేక రోగులకు సమయానికి సేవలు అందించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడి ‘పంచకర్మ విభాగం’లో సరిపడినంత మంది మసాజిస్టులు లేక ప్రతి రోజూ కొందరు రోగులు వైద్యం పొందకుండానే వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ‘పంచకర్మ’కు రోగుల తాకిడి ఆయుర్వేద ఆస్పత్రిలోని పంచకర్మ వైద్యానికి ఎంతో పేరుంది. ఎలాంటి దీర్ఘకాలిక, మొండి రోగాలనైనా అద్భుతంగా నయం చేస్తున్నారు. పక్షవాతం, కీళ్ల నొప్పులు, పూట్టుకతో వచ్చిన సెరిబ్రెల్ ఫాల్సీ వంటి రోగులకు మసాజ్ చేయాలి. పూర్తిస్థాయిలో పనిముట్లు ఉన్నా ఇక్కడ సిబ్బంది లేక రోగుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యశాల మసాజ్ సెంటర్లోని పురుషుల వార్డులో కేవలం ఒక్క మసాజిస్టు మాత్రమే సేవలందిస్తున్నాడు. ముగ్గురు చేయాల్సిన పని ఆ ఒక్కడిపైనే పడుతోంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సెంటర్ తెరిచే ఉంటుంది. దాదాపు 35 మంది వరకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులకు మసాజ్ చేస్తుంటారు. ఇదంతా ఒకే ఒక్క మసాజిస్టు చేస్తున్నాడు. అయినప్పటికీ మరో 10 నుంచి 20 మంది సేవలు పొందకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పదేళ్లుగా వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. చివరకు మసాజిస్టులను సైతం నియమించడంలేదు. ప్రభుత్వం నియామకాలు చేపట్టని కారణంగా రోగులకు సేవలు అందక.. ఎంతో గొప్ప పేరున్న ఆస్పత్రి ప్రతిష్ట మసరబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తేడా స్పష్టంగా తెలుస్తోంది మా బాబుకు నెలరోజుల నుంచి ఇక్కడనే వైద్యం చేయిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మసాజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాలేదు. ఇక్కడకు వచ్చాక మా బాబుకు స్పష్టంగా తేడా కనిపిస్తుంది. పూర్తిగా నడవలేని పరిస్థితి నుంచి ఆసరాగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పూర్తిగా నయం అవుతుందని నమ్మకం వచ్చింది. – భీమార్జున, భీమవరం (ఆంధ్రప్రదేశ్) సిబ్బంది సరిపోవడం లేదు మా అన్నయ్యకు పక్షవాతం వచ్చింది. ఖమ్మం, విజయవాడల్లో ఎన్నో ఆస్పత్రులు తిప్పాం. ఏడాది అయినా ఎలాంటి లాభం లేదు. ఇక్కడకు తీసుకొచ్చాను, ఒకవైపు మసాజ్, రెండోవైపు సైకిల్ తొక్కడం, ట్రెడ్మిల్ ద్వారా నడిపించడం తదితర ఫిజియోథెరపీలు చేయించారు. నెలన్నరలో స్వయంగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇంత సేవలు అందించే మసాజ్ సెంటర్లో చాలినంతమంది సిబ్బంది లేరు.– లక్ష్మి, ఖమ్మం -
పేరుకు పెద్దాస్పత్రి!
తూప్రాన్: అది పేరుకు పెద్దాస్పత్రి.. అందుతున్న సేవలు మాత్రం అంతంతే. అరకొర సిబ్బంది, అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే రోగులు, వారి సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో తూప్రాన్ డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రతి డివిజన్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 50 పడకల ఆస్పత్రులను మంజూరు చేశారు. జిల్లాలో తూప్రాన్, నర్సాపూర్‌లో ఈ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే 2018 జనవరి 17న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. ఆస్పత్రిలో తగిన వైద్య పరికరాలు లేక, మౌలిక సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్య గతంలో తూప్రాన్‌లో పీహెచ్సీ కొనసాగిన సందర్భంలో నిత్యం రోగుల సంఖ్య 100లోపు మాత్రమే ఉండేది. 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిత్యం 350 మంది వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. నెలకు సుమారు 11 వేల మంది ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం సరైన వైద్యులు లేక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యుల వివరాలు ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న వైద్యులు, వివిధ విభాగాలకు సిబ్బంది మొత్తం కలిపి 52 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే నియమితులవడం గమనార్హం. ఆస్పత్రిలో దంతవైద్యుడు ఉన్నప్పటికీ చికిత్స కోసం ఉపయోగించాల్సిన సామగ్రి లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల వైద్యురాలు ఉద్యోగంలో చేరిన వారం రోజులకే ప్రసూతి సెలవుపై వెళ్లింది. ఆస్పత్రి ప్రారంభించిన ఏడాదిన్నర తర్వాత నెల రోజుల క్రితం ఆస్పత్రి ఆవరణలో సరైన మౌలిక వసతులు లేకుండానే మార్చూరీ గదిని ప్రారంభించారు. రాత్రివేళ కరెంటు పోతే.. సెల్‌ఫోన్ లైటే గతి రాత్రివేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడితే ఇక అంతే సంగతులు. రోగులు, చిన్నపిల్లలు, బాలింతలు అంతా అంధకారంలో మగ్గాల్సిందే. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రికి వచ్చిన వారికి సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లే దిక్కవుతున్నాయి. అసలే మండుతున్న ఎండలకు తోడు కరెంటు పోతే ఉబ్బరంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు ఆపరేషన్లు చేయాల్సి ఉండగా రాత్రి 9 గంటలకు వైద్యులు అంతా సిద్ధం చేసుకున్నారు. 8.30 గంటలకు గాలిదుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆపరేషన్లను మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సిబ్బంది కొరత వాస్తవమే.. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉంది వాస్తవమే. నియామకం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు జరగలేదు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించలేకపోతున్నాం. ఆస్పత్రిలో జనరేటర్ లేని కారణంగా కరెంటు సరఫరాలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం– డాక్టర్ అమర్‌సింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఖాళీ అయిన పోస్టులను గత ప్రభుత్వం భర్తీ చేయకుండా నాన్చడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పడుతోంది. బిల్డింగ్ ప్లాన్ల మంజూరు, ఆక్రమణల తొలగింపు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్ల తయారీ వంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఈ సమస్యపై ఆ విభాగం ఉన్నతాధికారులు మున్సిపల్ శాఖకు అనేకసార్లు నివేదికలు పంపినా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా పెరిగాయి. రియల్టర్ల అక్రమాలతో స్థలాలను కొనుగోలు చేసిన ప్రజలు మోసపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండిపడింది. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ల మంజూరు విధానం అమలులోకి వచ్చినా, ఆ ప్లాన్లను క్షేత్ర స్ధాయిలో పరిశీలన చేయడానికి సిబ్బంది లేరు. రహదారుల ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది లేకపోవడంతో నగరాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. రహదారులు, అంతర్గత రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్ల తయారీ కూడా ముందుకు సాగడం లేదు. ప్రతిపాదనలు దాటని పోస్టింగ్‌లు రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 13 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. పెరిగిన జనాభా, ఆదాయం కారణంగా వీటిలో కొన్నిటిని అప్‌గ్రేడ్ చేయడానికీ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బందిని నియమించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చేతులు దులిపేసుకుంది. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో మొత్తం 1,851 మంది అధికారులు, సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 479 మందినే నియమించింది. మిగిలిన 1,372 పోస్టులను భర్తీ చేయడంలో మున్సిపల్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 408 మంది ఉండాలి. అయితే కేవలం 11 మంది మాత్రమే పని చేస్తుండగా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే మిగిలిపోవడంతో రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. దాదాపు 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్థలాలను అమ్మేసి, కొనుగోలుదారులను మోసగించారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో అనధికార లే అవుట్లలోని స్థలాల అమ్మకాలు అధికంగా జరిగాయి. వీటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలు గుర్తించాయి. వీటిని క్రమ బద్ధీకరిస్తే రూ.250 నుంచి రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండుసార్లు గడువు పొడిగించినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగడం లేదు. మాస్టర్‌ప్లాన్ తయారీ కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఒక్క రాయలసీమ రీజియన్ మినహా ఇతర రీజియన్లలో మాస్టర్ ప్లాన్ల తయారీ పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వం మున్సిపల్‌శాఖలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వివిధ వర్గాలు కోరుతున్నాయి. కాగా సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రాముడు ‘సాక్షి’కి తెలిపారు. -
ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలు
ఈ చిత్రంలో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ)లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన వాస్తవానికి ఎలక్ట్రీషియన్ ఈసీజీ తీసేందుకు ఎలాంటి అర్హత లేకయినా ఆస్పత్రి యాజమాన్యం ఆయనకే బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. ఈ చిత్రాన్ని చూడండి.ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని డార్క్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఈయన కూడా ఎలక్ట్రీషియనే. కానీ కొన్ని నెలల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈయన విధులను మార్చారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలక పోస్టులో ఉన్న ఆయన కొందరి సిబ్బంది విధులు మార్చడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలందించే పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రీషియన్లు పూర్తీ స్థాయి పని చేయకపోవడంతో రోగులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఆస్పత్రిలో కరెంటు కష్టాలు.. సర్వజనాస్పత్రిలో ఔట్సోర్సింగ్ కింద ఇద్దరు ఎలక్ట్రీషియన్లు 19 ఏళ్లుగా పని చేసేవారు. వీరిద్దరినీ ఆ విధుల నుంచి తప్పించి ఇతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు దిన కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వారు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండటం లేదు. అందులోనూ ఆస్పత్రిపై పూర్తీ స్థాయిలో అవగాహన లేదు. చెడిపోయిన ఫ్యాన్లు, లైట్లను ఎప్పటికప్పుడు రిపేరీ చేయాల్సిన ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో గైనిక్, లేబర్, పోస్టునేటర్, సర్జరీ, మేల్, ఫీమేల్ హౌస్‌సర్జన్ హాస్టళ్లలో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారం రోజుల క్రితం కరెంటు పోతే సకాలంలో స్పందించి జనరేటర్ కూడా వేయలేని స్థితిలో ఎలక్ట్రీషియన్లున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిద్రమత్తులో జిల్లా అధికార యంత్రాంగం ఆస్పత్రిలో రోజుకో అడ్డగోలు బాగోతం బయటపడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన స్తంభించి తాము ప్రత్యక్ష నరకం చూస్తున్నా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమస్యగా ఉంటే మార్చా సుధాకర్‌కు ఎలక్ట్రీషియన్ పని చేతకాదు. ఉద్యోగంలో చేరే సమయంలో ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపర్చాడో అర్థం కావడం లేదు. ఈసీజీ ట్రైనింగ్ ఇచ్చి పని చేయిస్తున్నా. ఇక సురేష్ ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో మానవతా దృక్పథంతో మార్చా. అందుబాటులో ఉన్న వారితో పని చేయిస్తున్నాం.– డాక్టర్ జగన్నాథ్(ఆస్పత్రి సూపరింటెండెంట్) -
మహా’ సిబ్బంది కొరత
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు సిబ్బంది కొరత వేధిస్తోంది. అయితే హెచ్ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరైన 600 పోస్టులకు గాను ప్రస్తుతం పనిచేస్తోంది 306 మంది మాత్రమే. దీంతో సిబ్బందిపై పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, ప్లానింగ్ విభాగం, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అర్బన్ ఫారెస్ట్, ఎన్ఫోర్స్మెంట్ సెల్ కలిపి 294 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఏటికేడు సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నారే కానీ కొత్త నియమాకాలు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. అయితే వివిధ సంస్థల నుంచి పదోన్నతిపై వచ్చి పనిచేసేవారు 40 మంది ఉండటంతో నెట్టుకొస్తున్నారు. ప్లానింగ్ విభాగంపై పనిభారం.. నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పుంతలు తొక్కించే లేఅవుట్లు, బిల్డింగ్ పర్మీషన్లకు అనుమతిలిచ్చే ఈ అధికారుల సంఖ్య నెలలు తిరక్కుండానే తగ్గుతుండటంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. తాజాగా నగర శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలంటూ హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ నిర్ణయం తీసుకోవడంతో పనిభారం రెండింతలు కానుంది. అయితే హెచ్ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరైన 110 పోస్టులకు ప్రస్తుతం పని చేస్తోంది 57 మంది మాత్రమే. చివరిసారిగా 2009లో 11 మంది జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ల నియామకం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు. సిబ్బంది తక్కువ.. పని ఎక్కువ లే అవుట్, బిల్డింగ్ పర్మీషన్ల కోసం డెవలప్మెంట్ పర్మీషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)కు ఆన్లైన్ అనుమతుల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జేపీవో, ఏపీవో స్థాయి అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోజుకు మూడు సైట్ ఇన్స్పెక్షన్లు అది కూడా వారి ప్రాంతానికి సంబంధించి కాక వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇన్‌స్పెక్షన్‌తోనే సమయం గడిచిపోతోంది. ఆ తర్వాత సైట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్, టెక్నికల్ స్క్రూటినీ, అవసరమైతే పైస్థాయి అధికారుల ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. బిల్డింగ్ పర్మీషన్, లేఅవుట్ విత్ హౌసింగ్, మల్టీస్టోర్ బిల్డింగ్, లేఅవుట్, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్, పెట్రోల్ పంప్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పనులన్నీ ప్లానింగ్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో ఆయా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. క్వారీ ఎన్వోసీలు కూడా వీరే జారీ చేస్తున్నారు. ఇలా ఉంటే కొంతమంది సిబ్బందే అన్నీ పనులు పర్యవేక్షిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. అయితే హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరైన ప్లానింగ్ విభాగంలో సిబ్బంది పెంచాలంటూ ఇప్పటికే హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్లానింగ్ విభాగంతో పాటు ఇతర విభాగాల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఆదాయం మరింత రెట్టింపయ్యే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. -
అగ్నికి ఆజ్యం
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్నికి టీడీపీ సర్కారు నిర్లక్ష్యపు ఆజ్యం పోసింది. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఉన్నా.. గత ఐదేళ్లుగా భర్తీకి చర్యలు తీసుకోలేదు. ఫైర్స్టేషన్ల ఏర్పాటునూ ప్రతిపాదనలకే పరిమితం చేసింది. ఫలితంగా జిల్లాలో ఏడాదిగా అగ్నిప్రమాదాల్లో రూ.14.13 కోట్ల ఆస్తినష్టం సంభవించగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. మొత్తుం 1,179 ప్రమాదాలు జరిగాయి. పశ్చిమగోదావరి, కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సర్కారు చొరవ చూపడం లేదు. కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటునూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాలు చాలడం లేదు. కొన్ని కేంద్రాల పరిధి విస్తృతంగా ఉండడంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి శకటాలు చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఫలితంగా శకటాలు వెళ్లేలోగానే తీవ్ర నష్టం జరిగిపోతోంది. దీంతో కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈనెల 14 నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ దైన్యంపై కథనం.. ఇతర విపత్తుల నివారణలోనూ అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శాఖ అంటే ఒకప్పుడు కేవలం అగ్నిప్రమాదాల నివారణకే పరిమితం అయ్యేది. ఇప్పుడు అవసరాలు మారిపోయాయి. వరదలు, గోదావరి, కాలువలు, వాగుల్లో చిక్కుకున్నవారిని, మునిగిన వారిని కాపాడడంలోనూ అగ్నిమాపక శాఖ కీలకభూమిక పోషిస్తోంది. ప్రముఖ ఉత్సవాలు, జాతరలు వంటి వాటిల్లోనూ ఈ శాఖ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఫలితంగా ఈ శాఖకుప్రాధాన్యం నెలకొంది. ఇంతటి కీలక శాఖలో సిబ్బంది కొరతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. ఐదేళ్లుగా నిర్లక్ష్యం అగ్నిమాపక శాఖను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా నిర్లక్ష్యం చేసింది. అగ్ని మాపక కేంద్రాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి. ఉన్న సిబ్బందిపై పనిభారం ఎక్కువైంది. ఫలితంగా ప్రమాదాలను సకాలంలో నిలువరించలేక సిబ్బంది సతమతమవుతున్నారు. జిల్లాలో ఏడాదిగా అగ్నిప్రమాదాలు, వరదలు, వాగులు పొంగిన దుర్ఘటనల్లో 69 మృత్యువాత పడ్డారు. వీరిలో అగ్నిప్రమాదాల బారిన పడి ఆరుగురు చనిపోయారు. 79 పోస్టులు ఖాళీ జిల్లా వ్యాప్తంగా 13 అగ్ని మాపక కేంద్రాలున్నాయి. కుక్కునూరులో తాత్కాలిక కేంద్రం ఉంది. అత్తిలి, తణుకు కేంద్రాల్లో అగ్ని మాపకాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు 49 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 35 మందే ఉన్నారు. 14 పోస్టుల భర్తీ లేదు. ఫైర్‌మెన్స్ 175 మందికి గానూ కేవలం 112 మందే ఉన్నారు. 63 పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 15 మేజర్ ప్రమాదాలు జిల్లాలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 15 పెద్ద ప్రమాదాలు సంభవించగా.. 74 మధ్యస్థ , 980 చిన్న ప్రమాదాలు జరిగాయి. రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నష్టం జరిగితే పెద్ద ప్రమాదాలగానూ, రూ.10 లక్షల లోపు నష్టం జరిగితే మధ్యస్త, రూ.2 లక్షల లోపు నష్టం వాటిల్లితే చిన్న ప్రమాదాలగానూ అధికారులు పరిగణిస్తారు. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో మొత్తం రూ.14.13 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రతిపాదనలతో సరి: జిల్లాలో దెందులూరు, గోపాలపురం, ఉంగుటూరు, పోలవరం, ఆచంట తదితర నియోజకవర్గ కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చ లేదు. విలీన మండలమైన కుక్కునూరుతోపాటు నల్లజర్ల మండలంలోనూ అగ్నిమాపక కేంద్ర ఏర్పాటు కలగానే ఉంది.కుక్కునూరులో తాత్కాలిక కేంద్రం ఉన్నా ఫలితం శూన్యం. పొగాకు బ్యారన్లకు నష్టం ప్రధానంగా మెట్ట ప్రాంతమైన గోపాలపురం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంతంలో వర్జినియా పొగాకు క్యూరింగ్ సమయంలో బ్యారెన్లు అగ్ని ప్రమాదాల బారిన పడితే రైతులు భారీగా నష్టపోతున్నారు. పైగా కొవ్వూరు నుంచి అగ్నిమాపక శకటం ఆప్రాంతానికి వెళ్లేసరికే తీవ్ర నష్టం జరిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రమాదాలకూ కొవ్వూరు నుంచే అగ్నిమాపక శకటం వెళ్లాల్సి వస్తోంది. పోలవరం మండలంలో మారుమూల గ్రామాలు సుమారు యాభై కిలోమీటర్లకుపైగా దూరం ఉండడం వల్ల కొవ్వూరు నుంచి శకటం వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరంలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చలేదు. మూడు చోట్ల తాత్కాక భవనాలే తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు అగ్నిమాపక కేంద్రాలు తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నూతన భవనాల నిర్మాణం కొలిక్కి రాలేదు. నిడదవోలులో రూ.1.10కోట్లతో, తణుకు, తాడేపల్లిగూడెంలో రూ.70లక్షలతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. కుక్కునూరు, నల్లజర్లలో కేంద్రాల నిర్మాణానికి స్థలం సేకరించారు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. సిబ్బంది కొరత ఉంది ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాం. జిల్లాలో ఏడు చోట్ల కొత్త కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో ఉన్న 11 రెçస్క్యూ బోట్లలో కేవలం ఆరు పనిచేస్తున్నాయి. ఇరుకైన ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు వినియోగించేందుకు ఏలూరు, భీమవరం, పాలకొల్లులో మిస్ట్ బుల్లెట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిది మంది ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్ఫోర్సు బృందాన్ని ఏలూరులో అందుబాటులో ఉంచాం. మరో 16 మందితో రెస్క్యూ టీమ్‌ను అందుబాటులో పెట్టాం. – ఏవీ శంకర్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి -
పంచాయతీలు 920 కార్యదర్శులు 502 మంది..
విజయనగరం రూరల్: పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకం.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండాల్సింది పంచాయతీ కార్యదర్శులే.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కీలకమైన పనులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే ప్రధానపాత్ర. అయితే పంచాయతీల్లో కార్యదర్శల కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారు. సగం మంది కూడా లేరు.. జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలుంటే 502 గ్రామ పంచాయతీలకే గ్రామ కార్యదర్శులు ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించడంతో కార్యదర్శులపై పనిభారం పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రతీ పనినీ ఆన్లైన్ చేయడం, మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాలతో వీరిపై మరింత పనిభారం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండేసి గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఒక్కోసారి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశమే ఉండడం లేదు. పనిభారంతో కనీసం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. ఒకపక్క పనిభారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువస్తుండడంతో పంచాయతీకార్యదర్శలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారు కావడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పడకేస్తున్న పారిశుద్ధ్యం పంచాయతీల్లో ఈ పాలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా కేటాయించారు. అయితే నెట్ సౌకర్యం లేకపోవడంతో కార్యదర్శులు ప్రతి పనికీ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండకపోవడంతో పారిశుద్ధ్య అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొరత వాస్తవమే.. జిల్లాలో 920 పంచాయతీలకు 502 మంది కార్యదర్శులే ఉన్నారు. వాస్తవంగా జిల్లాలో 489 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ ప్రకారంగా పంచాయతీ కార్యదర్శుల కొరత లేనట్టే. దీంతోపాటు పంచాయతీలకు 357 మంది ప్రత్యేకాధికారులున్నారు. పంచాయతీ కార్యదర్శులకు పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణతో పాటు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పలు ధ్రువపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో భాగంగా బీఎల్ఓల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయినా రెండు రోజులకోసారైనా పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శిస్తున్నారు. పారిశుద్ద్య నిర్వహణపై ఫిర్యాదులు ఉంటే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. – బలివాడ సత్యనారాయణ, డీపీఓ, విజయనగరం -
మరో‘సారి’ మొండిచేయి
పశ్చిమగోదావరి , భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ప్రభుత్వాసుపత్రి.. జిల్లాలోని డెల్టా ప్రాంతంతో పాటు సరిహద్దు కృష్ణా జిల్లా నుంచి వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఆస్పత్రిలో వైద్యుల కొరత, సౌకర్యాల లేమితో అవస్థలు తప్పడం లేదు. 100 పడకలకు మించిన స్థాయి ఇవ్వాల్సిన ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసే విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అయినా ఆస్పత్రిపై వివక్ష ఆగడం లేదు. ఇటీవల జిల్లాలోని ఆస్పత్రులకు ప్రభుత్వం 15 మంది వైద్యులను నియమించింది. ఈ విషయంలోనూ భీమవరం ఆస్పత్రిపై వివక్ష కొనసాగింది. ఒక్క డాక్టర్‌ను కూడా భీమవరం ఆస్పత్రికి కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఆస్పత్రి స్థాయిని 50 నుంచి 100 పడకలకు పెంచాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నా పట్టించుకోవడం లేదు. వైద్యులు లేరు భీమవరం ప్రభుత్వాస్పత్రికి రోజూ పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. గర్భిణులతో పాటు ఎముకులు, కంటి, చెవి, ముక్కు సమస్యలతో వస్తున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. కనీసం ఎముకలు, నేత్ర, చెవి, ముక్కు వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఆయా సమస్యలతో వస్తున్న వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిం చాల్సి వస్తోంది. ప్రధానంగా కీళ్లు, కంటి సమస్యలతో వస్తున్న వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో జనరల్ వైద్యులు వీరికి సేవలందించాల్సి వస్తోంది. రెండేళ్లుగా మూలనపడిన యంత్రాలు ఆస్పత్రిలో కంటి వైద్యులు, టెక్నీషియన్లు లేకపోవడంతో రెండేళ్లుగా కంటి ఆపరేషన్ చేసే ఆపరేటింగ్ మైక్రోస్కోప్ మెషీన్ మూలన పడి ఉంది. కంటి ఆపరేషన్లు అవసరమైన రోగులను ఏలూరు రిఫర్ చేస్తున్నారు. యంత్రాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో సేవలు అందడం లేదు. ఒకరే గైనకాలజిస్ట్ భీమవరం ఆసుపత్రిలో నెలకు సుమారు 100 వరకు ప్రసూతి ఆపరేషన్లు జరుగుతున్నాయి. రోజుకు 70 మంది వరకు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఒకరే గైనకాలజిస్ట్ ఉండటంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. మరో గైనకాలజిస్ట్ అవసరం ఉన్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో అత్యవసర సమయాల్లో గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 100 పడకలు అయితే తప్ప.. భీమవరం ప్రభుత్వాసుపత్రి స్థాయి 50 పడకలు. దీనిని 100 పడకలు చేస్తే తప్ప వైద్యులను పూర్తిస్థాయిలో కేటాయించరని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నా 100 పడకలు అయిన తర్వాత మాత్రమే వైద్యులు పూర్తిస్థాయిలో నియమిస్తారని అనడం విమర్శలకు తావిస్తోంది. 100 పడకలు చేయడానికి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రయత్నించినా ఫలితం లేదు. కనీసం వైద్యులు కొరత తీర్చేందుకైనా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. 100 పడకలకు ప్రయత్నిస్తున్నాం భీమవరం ఆసుపత్రిని 50 నుంచి 100 పడకల స్థాయికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తే పూర్తిస్థాయిలో వైద్యులు వస్తారు.– డాక్టర్ శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
అమ్మకు తప్పని ప్రసవవేదన
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవవేదన తప్పడం లేదు. నెలలు నిండిన గర్భిణులకు ప్రసవాలు చేసేందుకు అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, మౌలిక సదుపాయాలు, అల్ట్రాసౌండ్ మిషన్లు, థైరాయిడ్, హెచ్ఐవీ టెస్టులకు సంబంధించిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి చేరుకుంటున్న నిరుపేద గర్భిణులకు ఇక్కడ చేదు అనుభవమే ఎదురవుతోంది. మహబూబ్‌నగర్ అచ్చంపేట్ మండలం అమ్రాబాద్‌కు చెందిన చెంచు మణెమ్మ (33) నెలలు నిండటంతో ప్రసవం కోసం ఇటీవల సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చి ంది. ఆమె వద్ద నెలవారీ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు లేకపోవడంతో చేర్చుకునేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. తిరుగు ప్రయాణంలో ఆమెకు నొప్పులు రావడంతో ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కిట్‌తో 40 శాతం పెరిగిన రద్దీ కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకం కింద రూ.11.50 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో పది లక్షలకు పైగా గర్భిణులు ఉండగా, 1.42 లక్షల మంది తల్లులున్నారు. ఇప్పటి వరకు 6.70 లక్షల ప్రసవాలు నమోదయ్యాయి. 3.37 లక్షల కిట్లను పంపిణీ చేశారు. ఇనిస్టిట్యూషనల్ డెలివరీలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు అందజేస్తుండటంతో ఆయా ఆస్పత్రుల్లో అవుట్ పేషంట్లతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య గతంతో పోలిస్తే 40 శాతం పెరిగింది. అయితే ఈ రోగుల నిష్పత్తికి తగినట్టు పడకల సంఖ్యను పెంచలేదు. ఖాళీలను భర్తీ చేయక పోవడం వల్లే.. గ్రేటర్ పరిధిలో సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, గాంధీ, నిలోఫర్ బోధనాసుపత్రులతో పాటు కింగ్ కోఠి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతున్నాయి. గ్రేటర్లో రోజుకు సగటున 700 నుంచి 750 ప్రసవాలు జరుగుతుండగా, వీటిలో అత్యధికం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినట్లుగా ఎప్పటికప్పుడు ఆయా ఆస్పత్రుల్లో పడకల సంఖ్యతో పాటు ఆల్ట్రా సౌండ్ మిషన్లు, లేబర్‌రూంలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతే కాదు ఖాళీగా ఉన్న పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కొత్త నియామకాలు ఇప్పటి వరకు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారి నుంచి అప్పటికప్పుడు నమూనాలు సేకరించి, రిపోర్టులు జారీ చేయడం కష్టంగా మారుతోంది. ప్రసవానికి ముందు కనీస రిపోర్టులు లేకపోవడంతో వైద్యులు కూడా చికిత్స అందించేందుకు నిరాకరించాల్సి వస్తోంది. -
సిబ్బంది కావలెను!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు భారీ ఆదాయం సమకూర్చే ప్లానింగ్ విభాగంలో కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పుంతలు తొక్కించే లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లకు అనుమతిలిచ్చే ఈ అధికారుల సంఖ్య నెలలుతిరక్కుండానే తగ్గుతుండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. హెచ్ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరు ఉన్న 124 పోస్టులకు ప్రస్తుతం పనిచేస్తుంది 35 మంది మాత్రమే ఉండటం వల్ల పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఆ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ 35 మందిలో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి పదోన్నతిపై వచ్చినవారు 11 మంది ఉండగా, హెచ్ఎండీఏకు చెందినవారు 24 మంది ప్లానింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్లానింగ్ ఆఫీసర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ హోదాల్లో కొనసాగుతున్నారు. వీరిలో హెచ్ంఎడీఏకు చెందిన మరో ఏడుగురు ఉద్యోగులు మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనుండటంతో ప్లానింగ్‌లో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇలా అనుభవమున్న అధికారుల రిటైర్మెంట్తో ప్లానింగ్ విభాగ పనులు మరింత నత్తనడకన సాగే అవకాశముందనే చర్చ హెచ్ఎండీఏ వర్గాల్లో వినిపిస్తోంది. చివరిసారిగా 2009లో 11 మంది జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్లను నియమించారు..అప్పటినుంచి ఇప్పటివరకు నియామకం లేదనే వాదన వినబడుతోంది. సిబ్బంది తక్కువ...పని ఎక్కువ లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ల కోసం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(డీపీఎంఎస్)కు ఆన్లైన్ అనుమతుల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జేపీవో, ఏపీవో స్థాయి అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్యం వరకు రోజుకు మూడు సైట్ ఇన్స్పెక్షన్లు అది కూడా వారి ప్రాంతానికి సంబంధించి కాక వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇన్‌స్పెక్షన్‌తోనే సమయం గడిచిపోతోంది. ఆ తర్వాత సైట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు, టెక్నికల్ స్క్రూటిని, అవసరమైతే పైస్థాయి అధికారుల ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ విత్ హౌసింగ్, మల్టీస్టోర్ బిల్డింగ్, లేఅవుట్లు, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్, పెట్రోల్ పంప్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పనులన్నీ ప్లానింగ్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. దీనికితోడు లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను కూడా డీపీఎంఎస్ పనుల మాదిరిగానే కసరత్తు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో ఆయా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. క్వారీ ఎన్వోసీలు కూడా వీరే జారీ చేస్తున్నారు. ఇలా ఉన్నా కొంతమంది సిబ్బందే అన్నీ పనులు పర్యవేక్షిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. 2003లో ప్రభుత్వం మంజూరు చేసిన 124 పోస్టులకు ఖాళీగా ఉన్నా దాదాపు 80కిపైగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం కనబడుతోంది. ఈ మేరకు హెచ్‌ంఎడీఏ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులు పలుమార్లు ప్లానింగ్ విభాగ సిబ్బంది భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఉన్నా సిబ్బందిపైనే అదనపు భారం పడుతోందని హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఆదాయం పెరుగుతున్నా... భవన నిర్మాణాలు, లేఅవుట్ పర్మిషన్ల ద్వారా హైదరాబాద్ మహానగర అభివద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతుల కోసం దరఖాస్తులు వందలసంఖ్యలో వస్తున్నాయి. డెవలప్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో పాటు ఆఫ్‌లైన్ ద్వారా బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లకు ప్రతి నెలా రూ.36 నుంచి 38 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇలా నెలనెలకు ఆదాయం పెరుగుతున్నా సిబ్బంది సంఖ్య పెంచితే ఈ ఆదాయం మరింత రెట్టింపు కావొచ్చని హెచ్ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు పనుల్లో కూడా నాణ్యత పెరిగి సంస్థకు మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. -
పేరుకే కమిషనరేట్!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ..! సరిగ్గా ఇదే పరిస్థితిని రాజధాని బెజవాడ పోలీసు కమిషనరేట్ ఎదుర్కొంటోంది. పాలనా కేంద్రంగా మారినా అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అటు సీపీ నుంచి ఇటు హోంగార్డు దాకా షిప్టులను వదిలేసి పనివెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది లేమితో అల్లాడుతోంది. నలువైపుల నుంచి ఎదురవుతున్న పని ఒత్తిళ్లతో పోలీసు కమిషనర్ పాలనాంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. హైదరాబాద్ స్థాయిని మించి విజయవాడ పోలీసులను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో పోలీసింగ్ ప్రమాణాలపై ఎవరెంత ఊదరగొడుతున్నా వాస్తవంలోకి వస్తే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయనేది అందరూ అంగీరించాల్సిన విషయం. పెను భారంగా మారిన సిబ్బంది కొరత.. కమిషనరేట్ పరిధిలో 5 జోన్లు ఉండగా.. మొత్తం 22 పోలీసు స్టేషన్లు, 4 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. 1,200 మంది ఏఆర్ సిబ్బందితో కలుపుకొని సుమారు 3 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో విజయవాడ భాగమవడం.. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడే ఉండటంతో కమిషనరేట్ పరిధిలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రముఖుల బందోబస్తు పనులతో సిబ్బందికి తీరిక లేకుండా పోతోంది. ప్రధానంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వీఐపీల భద్రత కమిషనరేట్‌పై బాధ్యత చాలా ఎక్కువగా ఉంటోంది. ఇక సివిల్ పోలీసులకు సంబంధించి చూస్తే.. కొన్ని స్టేషన్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై పని భారం పడుతోంది. మాటలతో సరిపెట్టిన సర్కారు.. ఎన్నో సవాళ్లు, సమస్యల మధ్య అదనపు డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారికి విజయవాడ కమిషనరేట్ పగ్గాలు అప్పగించింది ప్రభుత్వం. 2015 మే నెల నుంచి సీఆర్డీఏ (రాజధాని) పోలీసు కమిషనరేట్ ఆవిర్భవిస్తుందని అందరూ అనుకున్నారు. కృష్ణా, గుంటూరు, విజయవాడలతో కలిపి 8,603.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, సుమారు వంద పోలీసు స్టేషన్లతో రాజధాని కమిషనరేట్‌ను విస్తరిస్తారన్న ప్రకటన నాలుగున్నరేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటిదాకా విజయవాడ కమిషనరేట్ పరిధి అనూహ్యంగా విస్తరిస్తుంది. అదేస్థాయిలో శాంతిభద్రతలు, పరిపాలన సమన్వయం సీపీకి పెను సవాలుగా మారింది. రాజధానికి తగిన స్థాయిలో పోలీసు దళాలను సిద్ధం చేయడం, పరిపాలనను సమన్వయం చేయడం కత్తిమీద సాముగా మారింది. మరో 1,800 మంది సిబ్బంది అవసరం.. బెజవాడ పోలీసు కమిషనరేట్‌లో కలవరపరిచే నేరాలు, మరోవైపు కళ్లు తిరిగే ట్రాఫిక్ రద్దీ పోలీసు బాస్‌కు పెను సవాలుగా మారింది. అమరావతి రాజధాని ప్రకటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయవాడలో జనాభా పెరిగింది. ముఖ్యమంత్రి, కేబినెట్, ఐఏఎస్ గణం బెజవాడలో మకాం వేసింది. జాతీయ, అంతర్జాతీయ గోష్ఠులు, ప్రముఖులు రాకపోకలతో నిత్యం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రోజూ 1,100 మంది పోలీసులు రాజధాని ప్రాంతంలో పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్ విజయవాడ కానుండటంతో విజయవాడ కమిషనరేట్ స్థాయిలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని నగర సీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మరో 1,800 మంది పోలీసు సిబ్బందిని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. -
వైద్యులు ఇద్దరు.. సేవలు అరకొరే!
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: వైద్యులు ఇద్దరు.. సేవలు పూజ్యం అన్నట్టుంది తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని జనరల్ సర్జరీ విభాగ వైద్యసేవలు. గతంలో తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి రాష్ట్ర ఉత్తమ ఆస్పత్రిగా ఐదుసార్లు అవార్డు దక్కించుకోవడంలో జనరల్ సర్జరీ విభాగం కీలకపాత్ర పోషించింది. ఐతే ఇటీవల కొన్ని శస్త్రచికిత్సలకే ఈ జనరల్ సర్జరీ విభాగం పరిమితమైందని రోగులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రికి ధీటుగా, జిల్లాలో మిగిలిన ఆస్పత్రులకన్నా మెరుగైన సేవలందించే 100 పడకల తణుకు ఆస్పత్రికి నిత్యం 70కి పైగా జనరల్ సర్జన్ విభాగ ఓపీకి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరికి శస్త్రచికిత్సలు అవసరం ఉండే పరిస్థితి ఉంది. వీరు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ రెండేళ్లు జనరల్ సర్జరీ విభాగంలో 50 శాతం వైద్యసేవలు కుంటుపడ్డాయని తెలుస్తోంది. ఓపీకే పరిమితం జనరల్ సర్జరీ విభాగంలో రెండేళ్ల నుంచి సీనియర్ వైద్యుడు అందుబాటులో ఉండగా, రెండు నెలల క్రితం మరో జనరల్ సర్జన్ కాంట్రాక్ట్ బేసిక్‌పై అందుబాటులోకి వచ్చారు. ఆయనకు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించే అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జనరల్ సర్జన్ విభాగంలో కూర్చోనివ్వకుండా ఆర్ధోపెడిక్ వైద్యుడి ఓపీ విభాగంలో సదరు వైద్యుడిని కూర్చోబెట్టి మందులు రాసిపంపే విధులకే పరిమితం చేశారు. అధికారం ఉన్నా వైద్యాధికారి అలసత్వం కారణంగా జనరల్ సర్జన్ సేవలు వినియోగంలోకి రావడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర వారాల్లో మాత్రమే అవుట్ పేషెంట్స్ చూస్తుండగా మిగిలిన రోజులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అదనపు వైద్యుడు ఉన్నప్పటికీ పాతపద్ధతే కొనసాగుతోంది.కొత్త వైద్యుడిని సీనియర్ వైద్యుడు తన విభాగంలో కూర్చునేందుకు కూడా ససేమిరా అన్నారని తెలుస్తోంది. సీనియర్ వైద్యుడి వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయని, ఒక మోస్తరు కేసులు తప్ప పెద్ద కేసులు జాయిన్ చేయరని వైద్యవర్గాలు, రోగులు చెబుతున్నారు. శస్త్రచికిత్సలివి శస్త్ర చికిత్సల విభాగంలో పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్, 24 గంటల నొప్పి (అపెండిసైటీస్) హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, కణితులు వంటి శస్త్ర చికిత్సలు గతంలో పెద్ద ఎత్తున జరిగేవి. ప్రస్తుతం పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్ కేసుల్లో శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోగా అపెండిసైటీస్ అడపాదడపా మాత్రమే చేస్తున్న దుస్థితి. ప్రస్తుతం ఈ శస్త్ర చికిత్సలకు రోగులను కాకినాడ, ఏలూరు రిఫరల్ చేస్తుండగా, కొన్ని కేసుల్లో బీపీ, తదితర కారణాలు చూపించి శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తుండడంతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలో చేసే శస్త్ర చికిత్సల్లో వైద్యుడు, సిబ్బందితోపాటు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి కూడా నిధులు జమవుతాయి. ఇటీవల శస్త్రచికిత్సల కేసులు తగ్గడంతో ఆస్పత్రికి ఆదాయం కూడా తగ్గిన దుస్థితి నెలకొంది. ఆ వైద్యుడు చేయరు.. వేరొకరిని చేయనివ్వరు థైరాయిడ్‌తో గొంతువాపు వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. ఆరు నెలల క్రితం తణుకు ఆస్పత్రిలో చూపిస్తే కాకినాడ వెళ్లమన్నారు. మా అబ్బాయి హనుమంతు తణుకులోని ఓ ప్రైవేటు వైద్యుడిని బతిమలాడితే ప్రభుత్వ ఆస్పత్రిలో జాయినయితే నేను అక్కడకు వచ్చి ఉచితంగానే ఆపరేషన్ చేస్తానని దేవుడిలా వరమిచ్చారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడు నన్ను జాయిన్ చేసుకునేందుకు ఒప్పకోలేదు. దీంతో నేను ఇప్పటికీ ఆపరేషన్ చేయించుకోలేకపోయాను. ప్రైవేటు వైద్యుడు చేసేది ఈ డాక్టరు ఎందుకు చేయలేరు.– పల్లి పాప, సిద్ధాంతం -
పోస్టులన్నీ ఖాళీయే..
మధిర (ఖమ్మం): మధిర మున్సిపాలిటీని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మున్సిపాలిటీ అయ్యాక ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో యంత్రాంగం కొద్దిపాటి ఉద్యోగులతో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతోంది. సకాలంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.. గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుస్థితి.. ఫలితంగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మధిర పరిధిలోకి ఇల్లెందులపాడు, మడుపల్లి, అంబారుపేట గ్రామాలను చేర్చుతూ 2013, మార్చి 27న నగర పంచాయతీగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. అదనంగా ఒక్క ఉద్యోగిని కూడా ఇక్కడ నియమించలేదు. పంచాయతీరాజ్‌లో పనిచేసిన ఉద్యోగులతోనే కాలం వెళ్లదీశారు. ఐదేళ్లపాటు అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో సకాలంలో సౌకర్యాలు అందక, ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక, పారిశుద్ధ్య పనులు జరగక.. తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో 2018, మార్చి 23న నగర పంచాయతీ పరిధిలో అదనంగా జిలుగుమాడు గ్రామాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 69 ప్రకారం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయగా.. వాటిలో మధిర కూడా ఉంది. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన నాటి నుంచి నేటివరకు కమిషనర్ పోస్టుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా భర్తీకి నోచుకోలేదు. దీంతో పరిపాలనా పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కమిషనర్‌తోపాటు బిల్ కలెక్టర్ తదితర పోస్టులన్నీ ఇన్చార్జ్ పాలనలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 2018, ఆగస్టు 21న ఏసీబీ దాడిలో ఆర్ఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుతోపాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. దీంతో ఆ రెండు పోస్టులు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రజల అవస్థలు.. మున్సిపాలిటీ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణం చేపట్టాలన్నా, జనన, మరణ, ఎల్ఆర్ఎస్, పేర్ల మార్పిడి, ఇంటి పన్ను, నీటి పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు కాక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఉన్న సమస్యలకు పరిష్కారం లభించకపోగా.. మరోవైపు కొత్త సమస్యలు వచ్చిపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏసీబీకి ఆర్ఐ పట్టుబడిన నాటి నుంచి ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఆర్ఐ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంలో అతడి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ సెల్ ఫోన్లోనే డిజిటల్ కీకి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటాయి. ఆ డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆ కీ అందుబాటులో లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టల్లా పేరుకుపోతున్న దుస్థితి నెలకొంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా చేతిలో ఏమీ లేదు.. డిజిటల్ కీ లేకుండా మేము ఏమీ చేయలేం. డిజిటల్ కీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ఐ జైలు నుంచి వచ్చాక సెల్‌ఫోన్‌ను చూసి డిజిటల్ కీకి సంబంధించిన సమాచారం ఇస్తానన్నారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయంలో చాలా మంది అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. – దేవేందర్, మధిర మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ -
ఖర్మాస్పత్రులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మీదేవి. తలుపుల మండలంలోని భూపతివారిపల్లి స్వగ్రామం. జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం 11 గంటలకు తలుపులలోని పీహెచ్‌సీకి రాగా.. పరీక్షించిన వైద్యుడు సెలైన్ ఎక్కించాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో మంచాలు లేకపోవడంతో ఇదిగో ఇలా వరండాలోని అరుగుపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించారు. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణమని సిబ్బందే చెబుతున్నారు. 24 గంటలు పనిచేసే ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యురాలు మెటర్నిటీ లీవ్‌లో వెళ్లిపోగా.. మరో పీహెచ్సీలో పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీరాంను ఇక్కడ నియమించారు. ఆయన వారం రెండురోజులు మాత్రమే సేవలందిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే 24 కి.మీ., దూరంలోని కదిరికి పరుగులు తీయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. – తలుపుల అనంతపురం న్యూసిటీ: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆస్పత్రులు మాత్రం ఆ మేరకు సేవలందించలేకపోతున్నాయి. మందులు లేక..ఉన్నా వాటిని ఇచ్చే వారు లేక..మౌలిక సదుపాయాల కొరతతో రోగులకు నరకం చూపుతున్నాయి. సిరంజీలు మొదలుకుని కుక్కకాటు వ్యాధులకు కూడా మందుల లేకపోవడంతో రోగులు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. బయోమెట్రిక్ అమలులో ఉన్నా... కొన్ని పీహెచ్‌సీల్లో(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలందడం లేదు. ఇక జిల్లాలోని స్టేట్ కేడర్లలో 281 పోస్టులు మంజూరైతే అం దులో 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జోనల్ కేడర్‌కు సంబంధించి 825 పోస్టులకు గానూ 139 ఖాళీలున్నాయి. జిల్లా కేడర్‌కు సంబంధించి 2105 పోస్టులకుగానూ 682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే వైద్యం దైవాదీనంగా మారింది. మందుల్లేవ్ అసలే సీజనల్ వ్యాధుల కాలం. డెంగీ, మలేరియా కేసులు అధిమకమయ్యాయి. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో 164 మలేరియా, 66 డెంగీ కేసులునమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా.. పీహెచ్‌సీలే పెద్ద దిక్కు. అక్కడి వైద్యులిచ్చే నాలుగు గుళికలే ప్రాణం పోకుండా చూస్తాయి. అటువంటిది ఆ మాత్రలు కూడా పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని దుస్థితి. జ్వరానికిచ్చే పారాసీటమాల్ మాత్రలు కూడా చాలా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. వృద్ధులు, మహిళలు, గాయాలపాలైన వారికి ఇచ్చే డైక్లోఫినాక్ మాత్రలు కూడా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యాంటిబయాటిక్స్ మందులైన అమాక్సలిన్, అమాక్సిలిన్ క్వావినేట్ 625 ఎంజీ, సిఫ్రోప్లాక్సిన్‌ల గురించి చెప్పుకోకపోతేనే మేలు. పెంటా సోడియం, జెంటామైసిన్, బీ 12 ఇంజెక్షన్లు సరఫరా ఆగిపోయినా అడిగే వారు లేరు. ఇక కుక్కకరిస్తే వేయాల్సిన ఇమినోగ్లోబిలిన్ మందు చాలా పీహెచ్‌సీల్లో అందుబాటులో లేదు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలోని 87 పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా పీహెచ్సీ వైద్యులు పూర్తిస్థాయిలో లేరు. 173 మెడికల్ ఆఫీసర్లలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని కొట్టాలపల్లి, ముద్దినాయినపల్లి, విడపనకల్లు, బి.కౌకుంట్ల, ఎన్ఎస్ గేట్, కుందుర్పి, కృష్ణాపురంలో పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు. దీంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇతర పీహెచ్‌సీల్లోని వైద్యులను సర్దుబాటు చేస్తున్నారు. 13 మంది సీనియర్ వైద్యులు పీజీ సీట్లు రావడంతో వెళ్లిపోయారు. ఇక 219 స్టాఫ్‌నర్సు పోస్టులకుగానూ 185 మంది మాత్రమే ఉన్నారు. స్టాఫ్‌నర్సుల అవస్థలు మెడికల్ ఆఫీసర్ తర్వాత పీహెచ్‌సీలకు స్టాఫ్‌నర్సే పెద్దదిక్కు. అంతటి కీలకమైన స్టాఫ్ నర్సు పోస్టులు జిల్లాలోని 34 ఖాళీ ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులకు ముగ్గురు స్టాఫ్‌నర్సులుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసే పీహెచ్‌సీల్లో ఒక స్టాఫ్‌నర్సు మాత్రమే ఉంటారు. దీంతో వీరికి సెలవు పెద్ద సమస్యగా మారింది. కార్మిక చట్టం ప్రకారం 40 గంటలు పని చేసి తర్వాత కచ్చితంగా సెలవు ఇవ్వాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అందుకే హెల్త్ అసిస్టెంట్లను బతిమాలుకుని సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మెరుగైన సేవలందిస్తాం రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందిస్తాం. పీహెచ్‌సీల్లో వైద్యుల సమస్య లేకుండా సర్దుబాటు చేశాం. త్వరలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఉన్నతాధికారుల అనుమతితో భర్తీ చేస్తాం. కొందరు పీజీ చదివేందుకు వెళ్లారు. జిల్లాలో ఎక్కడా మందుల కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటా. వైద్యులు సమయపాలన పాటించాల్సిందే. సిబ్బంది కొరత సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. – కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్,జిల్లా వైద్యాధికారి -
బోధించే నాథుడేడీ..?
గుంటూరు మెడికల్: ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత కలిగిన గుంటూరు వైద్య కళాశాలను నేడు బోధనా సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు లేక వైద్యసేవల్లో జాప్యం ఏర్పడి అవస్థలు పడుతున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో 1946లో తొలి బ్యాచ్‌లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్ధులు ఉండగా 1960 నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్యకళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం ఏడాదికి 200 మంది వైద్య విద్యార్థులు ఉంటున్నారు. 2018–19 వ సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. నీట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా, ఏడాదికి వంద మందికి పైగా పారామెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 47 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 195 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉండడంతో బోధన అంతంత మాత్రంగానే జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రొఫెసర్స్ ఏడు పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ 6, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 30 పోస్టులు మొత్తం 43 వైద్యుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 200 సీట్లకు సరిపడా వైద్యులు లేరు భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది లేరు. అయినప్పటికీ ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్టుగా రికార్డుల్లో చూపిస్తూ ఇతర వైద్య కళాశాలల నుంచి బోధనా సిబ్బందిని గుంటూరుకు తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీనివల్ల వైద్య కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులు నాణ్యమైన బోధన లభించక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 43 సీట్లను భర్తీ చేయటంతో పాటుగా తక్షణమే పెరిగిన వైద్య సీట్లుకు అనుగుణంగా 50 బోధనా సిబ్బంది పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది ఉండడంతో కొంతమంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తోంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో బ్లాక్‌బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మంచినీటి సౌకర్యాలు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. రోగులకూ తప్పని ఇక్కట్లు... గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఓపీలో వైద్యసేవలకు ప్రతిరోజూ ఏడు జిల్లాల నుంచి నాలుగువేల మంది రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా వైద్యులు లేక రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్లను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. యూనిట్స్ పెంపుదల రెండేళ్లుగా కాగితాలపైనే ఉండడంతో రోగులకు వైద్యసేవల్లో జాప్యం వాటిల్లి ప్రాణాలు పోయి ఆందోళనలు చేసిన సంఘటనలు సైతం జీజీహెచ్‌లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు వైద్య కళాశాల ఉండటంతో ఈ కళాశాలలో పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది నియామకాలతో పాటు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. -
లారీ.. సవారీ..
రాయవరం (మండపేట): వస్తు, సామగ్రి రవాణాలో లారీలదే ప్రథమ స్థానం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లారీ పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తోంది. ఇంతటి కీలకమైన లారీ పరిశ్రమ, దానిని నమ్ముకున్న కార్మికులు, యజమానులు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నారు. లారీ నడపడానికి డ్రైవర్లు లభించక, పెరిగిన డీజిల్, పన్నులు చెల్లించలేక యజమానులు లారీలను అమ్ముకుంటున్నారు. జిల్లాలో 32వేల లారీలు.. లారీ పరిశ్రమలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఒకప్పుడు ద్వితీయ స్థానంలో ఉండగా, విజయవాడ ప్రథమస్థానంలో ఉండేది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, అనపర్తి, అమలాపురం తదితర ప్రాంతాల్లో లారీలు అధికంగా ఉన్నాయి. 30 లారీ యూనియన్ అసోసియేషన్లు ఉన్నాయి. జిల్లా నుంచి కలకత్తా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, చత్తీస్ఘడ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వీటిపై ఆధారపడి సుమారు రెండు లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారు. ఒక లారీపై 13 రకాల వృత్తులు చేసే కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. యువత అనాసక్తి.. రవాణా రంగంలో కీలకమైన లారీ రంగంలోకి డ్రైవర్లుగా ప్రవేశించడానికి యువత ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లు క్లీనరుగా పనిచేస్తే డ్రైవరుగా పదోన్నతి లభించేది. గతంలో కేవలం లారీ నడపడం వస్తే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేవారు. ప్రస్తుతం లైసెన్స్ మంజూరుకు ఉన్న నిబంధనలు కఠినతరమయ్యాయి. పదో తరగతి చదివిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ పొందడానికి మామూళ్లు ముట్టజెప్పనిదే లైసెన్స్ చేతికి రావడం లేదన్న విమర్శలున్నాయి. హెవీ లైసెన్స్ కావాలంటే ఆర్టీవో కార్యాలయంలో రూ.16 నుంచి 20వేల వరకు ఖర్చవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు వేలాది రూపాయలు వెచ్చించి లైసెన్స్ పొందడానికి ముందుకు రావడం లేదు. లారీలు సుదూర ప్రాంతాలకు వెళితే నెలల తరబడి ఇంటికి రావడం కుదరక పోవడం, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుతుండడం, లారీలు నడిపే సమయంలో దారిదోపిడీలతో ప్రాణభయం ఉండడంతో పలువురు ఇష్టం చూపడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో డ్రైవర్లపై ప్రజలు భౌతిక దాడికి పాల్పడడం, సంఘటన స్థలంలోనే నష్టపరిహారం కోరడం తదితర కారణాలు, తమ ప్రమేయం లేకుండా ప్రమాదాలు జరిగితే తమ లైసెన్సులు రద్దవుతాయని మరికొంతమంది లారీలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ల కొరతతో 30శాతం లారీలు ఆఫీసుల వద్దే నిలిచి పోతున్నాయి. నిర్వహణ భారమే.. లారీ నిర్వహణ ఖర్చులు యజమానికి భారంగా మారుతున్నాయి. మూడు నెలలకు ఒకసారి రూ.20వేలుగా ఉన్న ఇన్సూరెన్స్ రూ.50వేలకు చేరింది. లారీ పర్మిట్‌కు రూ.20వేలు, రాష్ట్రాల సరిహద్దుల్లో పాసింగ్కు రూ.రెండు వేలు ఉంటుంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో డీజిట్ ధర నాలుగు శాతం అధికంగా ఉంది. డీజిల్ రూపంలో నెలకు రూ.18వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వలన టైర్లు, విడిభాగాల ధరలు అధికమయ్యాయి. రూ.30వేలు ఉన్న జత టైర్ల ధర జీఎస్టీ ప్రభావంతో 45వేలు, రూ.ఐదు వేలు ఉన్న 20కేజీల గ్రీజు డబ్బా ధర రూ.ఏడు వేలకు చేరింది. విడి భాగాలపై 12శాతం, లారీల నిర్వహణపై 28శాతం జీఎస్టీ పన్నులు విధించారు. ఒక లారీకి 36 రకాల పన్నులు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశా, కలకత్తా మార్గంలో రవాణాశాఖ అధికారులు నిబంధనల పేరుతో చేస్తున్న దాడులు ఇబ్బందికరంగా ఉన్నట్టు లారీ యజమానులు వాపోతున్నారు. మరోవైపు రహదారులు అధ్వానంగా ఉండడం కూడా లారీ డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. -
‘సర్వే’జన కష్టమే
జిల్లా అధికార యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు అనుబంధంగా ఉన్న భూరికార్డుల సర్వే విభాగాన్ని సర్వేయర్ల కొరత తీవ్రంగా పీడిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో భూముల సమస్యలు పరిష్కారంకాక పెండింగ్‌లో పడిపోయాయి. మదనపల్లె రూరల్: జిల్లా రెవెన్యూ శాఖలో సర్వేయర్లు తక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 66 మండలాలు 8 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. వీట న్నింటిలో 130 మంది దాకా సర్వేయర్లు ఉండాలి. కానీ 66మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో మున్సిపాలిటీలో ఇద్దరు, కార్పొరేషన్‌లోముగ్గురు, నలుగురు సర్వేయర్లు ఉండాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో సర్వేయర్లకు దిక్కులేరు. డెప్యూటీ సర్వేయర్లు ద్వారా పనులు చేపడుతున్నారు. భూముల హద్దుల గుర్తింపు కష్టతరంగా మారింది. పెండింగ్‌లో అర్జీలు జిల్లా వ్యాప్తంగా (ఎఫ్‌లైన్ ) అర్జీలు దాదాపు 1300 వరకూ ఉన్నట్లు సమాచారం. ఇక పట్టా సబ్ డివిజన్ అర్జీలు వందల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. ఎవరైనా భూముల సర్వేకు సంబంధించి రూ. 250 చలానా కట్టాలి. 30 రోజుల గడువులోగా సర్వే చేయాల్సి ఉంటుంది. కానీ సర్వేయర్ల కొరత వల్ల దాదాపు రెండు నెలలైనా పరిష్కారంకాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఖాళీలివీ జిల్లాలో మొత్తం 66 మండలాలు ఉండగా, వీటిలో అనేక మండలాల్లో సర్వేయర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. తిరుపతి డివిజన్లో 12, చిత్తూరు డివిజన్లో 9, మదనపల్లె డివిజన్లో 8 మొత్తం 29 వరకూ సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. మున్సిపాలిటీల్లో అసలు లేనేలేరు జిల్లాలో 8 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా సర్వేయర్లు ఉన్న దాఖాలు లేవు. మున్సిపాలిటీల్లో భూముల హద్దుల సమస్యలు ఎన్నో ఏళ్లేగా పెండింగ్‌లోనే ఉన్నాయి. అధికంగా చైన్మన్ల కొరత.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12–15 మంది చైన్మన్లు ఉండాలి. కానీ జిల్లాలోని 66 మండలాల్లో కలిపి ఐదుగురు మాత్రమే ఉన్నారు. భూముల హద్దుల వ్వవహారంలో చైన్మెన్ల పాత్ర కీలకంగా ఉంటుంది. చాలా మండలాల్లో సర్వేయర్లు ప్రైవేటుగా చైన్మెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒత్తిళ్లు తప్పడం లేదు సర్వేయర్ల కొరతతో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. ఫస్ట్‌గ్రేడ్ మున్సిపాలిటీలో 35 వార్డులు, మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్వేయర్లు తక్కువగా ఉండటం వల్ల ప్రైవేటు సర్వేయర్ల సహాయం తీసుకోవాల్సి ఉంది. డివిజన్ కేంద్రమైన మదనపల్లెలో ఒకే సర్వేయర్ ఉండటంతో పనిభారం ఎక్కువగా ఉంటోంది.––రంగస్వామి, తహసీల్దార్, మదనపల్లె -
గైనిక్‌కు పురిటి నొప్పులు
మాతా శిశు మరణాల నివారణకు కృషి చేస్తామంటూ పాలకులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. లక్ష్యాలను అధిగమించడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. సర్వజనాస్పత్రిలో నెలకు 900 ప్రసవాలు జరిగే విభాగానికి పట్టుమని పది మంది మెటర్నిటీ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదు. అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్ సేవలు మృగ్యంగా మారాయి. గైనిక్ విభాగానికి కొన్నేళ్లుగా మెటర్నిటీ అసిస్టెంట్ల (ఏఎన్ఎం) కొరత పట్టిపీడిస్తోంది. దీంతో గర్భిణులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసిస్టెంట్ల పని సైతం తామే చేయాల్సి వస్తోందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కలెక్టర్ వీరపాండియన్ అధ్యక్షతన ఆస్పత్రిలో జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో మెటర్నిటీ అసిస్టెంట్లను ఆరోగ్యశాఖ నుంచి డెప్యూట్ చేసుకోవాలని మినిట్స్‌లో పొందుపర్చారు. కానీ ఇంత వరకు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. ముగ్గురే మిగిలారు.. కాన్పుల (లేబర్) వార్డులో ముగ్గురు మెటర్నిటీ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరంలో 11 మంది మెటర్నిటీ అసిస్టెంట్లను తీసుకున్నారు. అందులో ముగ్గురు మినహా మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ఇంత వరకు మెటర్నిటీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయలేదు. లేబర్‌వార్డులో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 7 సిజేరియన్లు, 20 నుంచి 23 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలు జరిగే సమయంలో మెటర్నిటీ అసిస్టెంట్లు తప్పనిసరి. వైద్యులకు సహాయకులుగా వారుండాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో పతి ఒత్తిడితో పాటు మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత పెద్ద సమస్యగా మారింది. వందల సంఖ్యలో ఏఎన్ఎం పోస్టుల ఖాళీ వైద్య ఆరోగ్యశాఖలో 828 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. 498 మంది రెగ్యులర్ పోస్టులుండగా అందులో 140 ఖాళీలున్నాయి. అలాగే 586 కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలలో 110 మంది ఖాళీలున్నాయి. పీహెచ్సీ, మదర్ పీహెచ్‌సీల్లో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అక్కడి మెటర్నిటీ అసిస్టెంట్లను మూడు నెలలకోసారి డెప్యూట్ చేస్తే బాగుంటుందని గైనిక్ వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ మాత్రం సిబ్బంది కొరతను చూపి పట్టించుకోవడం లేదు. అందరి సమన్వయంతోనే మాతాశిశు మరణాల నియంత్రణ సాధ్యపడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. డెప్యూట్ చేసే ప్రసక్తే లేదు పీహెచ్‌సీల్లో 240 ఏఎన్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకుని ఆస్పత్రికి ఏవిధంగా డెప్యూట్ చేయాలి. కలెక్టర్ నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేవు. హెచ్‌డీఎస్‌లో మినిట్స్‌లో మెటర్నిటీ అసిస్టెంట్లు కావాలని నమోదు చేశారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డీఎంహెచ్ఓ -
ఈ రోగాలకు మందుల్లేవా!?
అనంతపురం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో మందుల కొరతతో పాటు వైద్యులు సమయపాలన పాటించడంలేదు. ఆస్పత్రుల్లో రోగులను సిబ్బంది దోపిడీ చేస్తున్నారు. ఆర్థో, సీఎస్ఎస్డీలోని రెండు ఆటోక్లేవ్ మిషన్లు మరమ్మతుకు నోచుకోలేదు. కొత్తగా రెండు మిషన్లు వచ్చినా ఇన్స్టాల్ చేయలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వ్యాధుల నిర్ధారణకు అధిక సమయాన్ని తీసుకుంటున్నారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్లకు వారం, పదిరోజులు పడుతోంది. కొన్ని రకాల ఆపరేషన్లు చేసే పరిస్థితి లేదు. డబ్బులిస్తే కానీ వైద్యం అందే పరిస్థితిలేదు. కృష్ణా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా రోగులకు వైద్యం అరకొరగానే అందుతోంది. వైద్యుల కొరత వేధిస్తోంది. ఆపరేషన్లు చేయడంలేదు. విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది. సిబ్బంది, డాక్టర్లు సమయపాలన పాటించడంలేదు. మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి అత్యవసర విభాగంలో ఏసీలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వార్డుబాయ్‌లు సరిపడా లేరు. వ్యాధి నిర్ధారణ పూర్తిస్థాయిలో చేయడంలేదు. ఆసుపత్రిలో మందుబిళ్లల కొరత తీవ్రంగా ఉంది. కర్నూలు జిల్లాలో కొన్నిచోట్ల వైద్యులు లేక ఆపరేషన్లు చేయడంలేదు. నంద్యాల ఆసుపత్రి స్థాయి పెంచినా దానికి తగ్గట్లుగా వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. ఇక్కడా మందుల కొరత తీవ్రంగా ఉంది. ఎంఆర్ఐ పరీక్షకు రెండు నెలలు ఆగాల్సి వస్తోంది. రిపోర్టులకు వేచి చూసే పరిస్థితి. చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో సిఫారసు లేఖ తెచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని విభాగాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. తిరుపతి పాత ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి బాలింతలు, గర్భిణులను వేధిస్తోంది. ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉంటున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిటీ స్కానింగ్ పరీక్షకు మూడు వారాల పాటు ఎదురు చూడాల్సిందే. ఎమ్మారై అందుబాటులోకి రాలేదు. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నెల్లూరు జిల్లాలోనూ డాక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సకాలంలో వైద్యం అందడంలేదు. వైద్యులు సమయానికి రాని పరిస్థితి. ఎంఆర్ఐ స్కాన్ లేదు. అలాగే ఎండో, 2డి ఎకో పరికరాలు మూలన పడి ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని అన్ని చోట్లా వైద్యులు, సిబ్బంది, మందుల కొరత ఎక్కువగా ఉంది. స్కానింగ్ మిషన్, ఛెస్ట్ ఎక్స్‌రే ఆల్ట్రా సౌండ్ పరీక్షల సేవలు లభించడంలేదు. ఈ జిల్లాలోనూ వైద్యులు సమయపాలన పాటించడంలేదు. రోగులపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి. కాకినాడ పెద్దాస్పత్రిలో పడకల సమస్య తీవ్రంగా ఉంది. అనేక విభాగాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులు ఉండాల్సిన పరిస్థితి. మందుల కొరత ఏర్పడుతోంది. రాజమహేంద్రవరంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. తుని ఆసుపత్రిలో కాన్పులకు చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో రిమ్స్‌లో క్షతగాత్రులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. ఎక్స్‌రే మిషన్లు నాలుగేళ్ల నుంచి మూలకు చేరాయి. ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో మూడంతస్తుల మెట్లు ఎక్కలేకపోతున్నారు. రోగులు, అటెండెంట్లు అవస్థలు పడుతున్నారు. డెంటల్ విభాగం రోగులకు ఫిల్లింగ్, క్లీనింగ్లకే పరిమితమైంది. విశాఖ కేజీహెచ్‌లో వార్డు బాయ్‌లు రూ.50 నుంచి 100 వరకు పిండుతున్నారు. మందులు సరఫరా కావడంలేదు. విమ్స్‌లో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఈఎన్టీ ఆస్పత్రిలో ఎక్స్‌రేల కోసం అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇక్కడా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. పాడేరులో గైనకాలజీ, మత్తు వైద్యులు లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కడప రిమ్స్‌కు సూపర్ స్పెషాలిటీ స్థాయి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సేవలు అందడంలేదు. సీటీ స్కాన్ మిషన్ ఉన్నా పనిచేయడం లేదు. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదు. ఐపీ విభాగంలో ఉన్న లిఫ్ట్‌లన్నీ పనిచేయడం లేదు. నాలుగు ఉచిత బస్సులు కూడా మూలన పడడంతో పట్టణానికి వెళ్లి వచ్చే రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో తగినంత మంది వైద్యులు లేరు. ఈసీజీ మిషన్ పనిచేయడంలేదు. రోగులకు మధ్యాహ్న భోజన వసతి కూడా లేదు. కాన్పు అయితే కాసులివ్వాలి నా మనవరాలు అరుణను రెండో కాన్పు కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం మధ్యాహ్నం ఆడపిల్లను ప్రసవించింది. సాధారణంగా ప్రసవించిన వెంటనే శిశువుపై ఉన్న మాయ తదితరాలను శుభ్రం చేసి కుటుంబ సభ్యుల చేతికిస్తారు. కానీ, ఈ బిడ్డను శుభ్రం చేయకుండానే ఇచ్చారు. ఇదేమంటే మీరే శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అలాగే, బిడ్డ పుట్టిన వెంటనే రూ.400 ఇవ్వాలని అడిగారు. నేను ఇవ్వలేదు. అందుకే ఇలా శుభ్రం చేయకుండా ఇచ్చారు. – రామక్క, రాజోలి, కర్నూలు జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో ఒకే మంచంపై బిడ్డలతో సహా పడుకున్న తల్లులు, కొబ్బరి నూనెతో శిశువును శుభ్రం చేస్తున్న అవ్వ రామక్క పండంటి పాపను కోల్పోయాం నాకు నెలలు నిండడంతో ఈ నెల 22న నన్ను వీరఘట్టం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్ లేదని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నొప్పులు వస్తున్నాయంటే సిబ్బంది చీదరింపులు.. కడుపులో ఇటు అటూ నొక్కేశారు. గత్యంతరం లేక సోమవారం పొద్దున్నే 108లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి వచ్చాం. ఆస్పత్రి ప్రాంగణంలోకి రాగానే 108లోనే కాన్పు అయింది. బిడ్డ చనిపోయింది. పాలకొండ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంవల్ల తొలికాన్పులో నేను బిడ్డను కోల్పోయాను.– ఉత్తరావిల్లి జయలక్ష్మి, మద్దివలస, శ్రీకాకుళం జిల్లా వైద్యులు లేక ఆపరేషన్లు వాయిదా ఇతని పేరు ఎన్.వెంకటేశ్వర్లు (35). ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం యాక్సిడెంట్లో చేయి విరగడంతో రిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి చేతిలో రాడ్ అమర్చారు. మూడు నెలలుగా చేయి తీవ్రమైన నొప్పి వస్తుండటంతో పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్సచేసి రాడ్ తీసేయాలని చెప్పారు. అయితే వైద్యులు లేరని వాయిదాలు వేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కమ్మవారిపల్లికి చెందిన లక్ష్మి నిండు గర్భిణి. నొప్పులు రావడంతో సోమవారం భర్త పవన్‌కుమార్ కదిరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఉ.9 గంటలకు ఆసుపత్రికి చేరుకోగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్‌ఓలతో పాటు డ్యూటీ వైద్యులు కూడా అందుబాటులో లేకపోయారు. హౌస్సర్జన్లు మాత్రమే ఉండటంతో భార్యను స్ట్రెచ్చర్‌పై అతనే తోసుకుని వెళ్లాడు. గైనిక్ వైద్యులు స్పందించేలోగా కడుపులోనే బిడ్డ ప్రాణం పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని టైటస్నగర్కు చెందిన వినుకొండ అబ్రహాంకు మరుగుతున్న నూనె ఒంటిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగురోజుల క్రితం అతను ఆసుపత్రిలో చేరాడు. కానీ, అక్కడ పనిచేస్తోన్న ఎంఎన్‌వో బాధితుడికి కనీస డ్రెస్సింగ్ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యులు సైతం పట్టించుకోలేదు. కాలిన గాయాలు పుండ్లుగా మారిపోయి. ఇన్ఫెక్షన్ పెరిగిపోయి తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .. పై రెండు సంఘటనలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. అవేవీ రోగుల అవసరాలను తీర్చలేకపోవడంతో వారు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వైద్యుల కొరత, డాక్టర్లు–సిబ్బంది సమయపాలన పాటించకపోవడం.. మౌలిక వసతుల లేమి తీవ్రస్థాయిలో వేధిస్తున్నాయి. రోగ నిర్ధారణ పరికరాలు, యంత్రాలు తగినన్ని లేకపోవడం.. ఉన్నా మొరాయిస్తుండడంతో పేదోడికి వైద్యం అందించడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనవిగా ఉన్న తిరుపతి రుయా ఆస్పత్రిలోగానీ, విశాఖ కేజీహెచ్‌లోగానీ, గుంటూరు కేజీహెచ్‌లోగానీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రిగానీ, అన్నింటా అసౌకర్యాలే. మరోవైపు రోగుల అవసరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నా ఆ స్థాయిలో ఎక్కడా సరైన సేవలు అందడంలేదు. రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రుల తీరూతెన్నూ ఇలా ఉన్నాయి.. -
లాఠీ ఝుళిపించేదెలా ?
అమరావతి రాజధాని కేంద్రం. నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలతో నిత్యం వీవీఐపీలు, వీఐపీల తాకిడి. ఇక్కడే సీఎం నివాసం..పోలీసు శాఖకు చేతినిండా పని.. క్షణం తీరిక లేకుండా డ్యూటీలు. ఎప్పుడు ఎవరు వస్తారో.. ఎవరు వెళతారో తెలియదు. అప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఇలా టెన్షన్ టెన్షన్. జిల్లాలో సిబ్బందిని చూస్తే అంతంతమాత్రం. ఇంకేముంది.. దొంగలు, నేరగాళ్లకు ఇదే అదను. అందుకే రెచ్చిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సిబ్బందిని పెంచండి మహాప్రభో అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. సాక్షి, గుంటూరు: రాజధాని నేపథ్యంలో గత మూడున్నరేళ్లుగా గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో పోలీసులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజధాని నేపథ్యంలో ట్రాఫిక్ పెరిగిపోవడం, వరుసగా వీవీఐపీల పర్యటనలు, జిల్లా కేంద్రంగా నిత్యం కొనసాగుతున్న ఆందోళనలతో గందరగోళంగా మారింది. అయితే అందుకు తగినట్లుగా సిబ్బంది పెరగకపోవడం, ఉన్న సిబ్బంది బందోబస్తులకు భద్రతలకే సరిపోతుండటంతో నేరాల నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోవడం.. రౌడీషీటర్లు రెచ్చిపోతున్నా వారిపై నిరంతర నిఘా పెట్టే వెసులుబాటు లేక నేరాలను సైతం నియంత్రించలేని పరిస్థితి తలెత్తుతుంది. రాజధాని ప్రకటన తరువాత గుంటూరు అర్బన్ జిల్లాను ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపించినప్పటికీ మూడున్నరేళ్లు దాటుతున్నా ఆ దిశగా ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయని పరిస్థితి. అటకెక్కిన పోలీసు ప్రతిపాదనలు గుంటూరు అర్బన్ జిల్లాతోపాటు రూరల్ జిల్లా పరిధిలోని అమరావతి, తుళ్లూరు పోలీసు స్టేషన్లను కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అప్పటి అర్బన్‌ఎస్పీ రాజేష్‌కుమార్ ప్రభుత్వానికి పంపినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుత అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయరావు సైతం గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు, అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను ఏగ్రేడ్గా అప్‌గ్రేడ్ చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందికి తోడు, రెట్టింపు సిబ్బంది వస్తారనేది ఎస్పీ ఆలోచన. అయితే ఈ ప్రతిపాదనలన్ని అటకెక్కాయే తప్ప ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోకపోవడంతో సిబ్బంది కొరతతో పోలీసు ఉన్నతాధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు సెక్టార్లుగా విభజన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో వరుస బందోబస్తులు, వీవీఐపీల భధ్రత, నిత్యం జరుగుతున్న ఆందోళనలు వంటివి పోలీసులకు సవాల్‌గా మారాయి. అవినీతి పోలీసు అధికారులపై నిఘా కూడా కొరవడింది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు, పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లన్నింటిని మూడు సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు ఓ ఎస్సైకు బాధ్యతలు అప్పగించి నేర పరిశోధన, బందోబస్తులు, ఆందోళనలు, ఎదుర్కొనే బాధ్యతలను విభజించారు. ఉన్న సిబ్బందిని ముగ్గురు ఎస్సైలకు సమానంగా ఇచ్చి వారికి కేటాయించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకే గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో రాజధాని నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందిపై పనిభారం పెరిగిన మాట వాస్తవమే. దీంతో కొత్తపోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, అన్ని పోలీసు స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని డీజీపీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వీలైనంత త్వరగా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించాలని కోరాం. అప్పటి వరకు సిబ్బంది కొరత అధిగమించేందుకు ఒక్కో పోలీసు స్టేషన్‌ను మూడు సెక్టార్లుగా విభజించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్య, బందోబస్తులు, ఆందోళనలు వంటివాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. – అర్బన్ ఎస్పీ విజయరావు -
ఏమీ సేతుర లింగా!
అది దేశంలోనే పిల్లల రెండో పెద్దాస్పత్రి.. కానీ అవసరమైనంత మంది వైద్యులు ఉండరు. ఉన్నవి 500 పడకలే.. వెయ్యి మంది శిశువులకు చికిత్స చేస్తుంటారు. ఐసీయూలోని రెండు బెడ్లకు ఒక నర్సు.. జనరల్ వార్డులో ప్రతి ఐదు పడకలకు ఒకరు ఉండాలి. ఇక్కడ మాత్రం సగటున 25 మంది రోగులకు ఒక్క నర్సే సేవలందిస్తున్నారు. సుమారు 200 మంది వైద్యులు అవసరమున్నచోట 88 మందితోనే సరిపెడుతున్నారు. అవసరమైన యంత్ర సామగ్రి, వైద్య పరికరాలు అసలే ఉండవు. ఇది నిలోఫర్ ఆస్పత్రి పనితీరుపై ఒక కోణం..ఇక బాలింతలు, శిశువుల మరణాలు.. అపహరణలు..ఆందోళనలు మరోకోణం. ఇవన్నీ నవజాత శిశువుల ఆరోగ్య వరప్రదాయినిగా పేరొందిన ‘నిలోఫర్’ ఆస్పత్రి ప్రతిష్టనుదిగజారుస్తున్నాయి. ఇక్కడి దుర్ఘటనలపై మానవ హక్కుల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆస్పత్రిలో11 నెలల శిశువు మరణంతో తొమ్మిది మంది వైద్యులు, సిబ్బందికి తాజాగా పోలీసులునోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం తగినంత మంది సిబ్బందినిఇవ్వకుండా.. సౌకర్యాలు కల్పించకుంటే తామేం చేస్తామని గురువారం ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువు ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రెండేళ్ల క్రితం ఒకేరోజు ఆరుగురు బాలింతలు చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతకు ముందు అనేక మంది శిశువులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక అపహరణ ఘటనలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితిపై హైకోర్టు సహా మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఓ పదకొండు మాసాల శిశువు మృతి వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సుల(తొమ్మిది మంది)కు బుధవారం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వ వైద్యవర్గాల్లో కలవరం మొదలైంది. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి జోక్యం చేసుకుని వైద్యులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అసలెందుకిలా జరుగుతుందంటే.. దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా నిలోఫర్ ఆస్పత్రికి గుర్తింపు ఉంది. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను వైద్యం కోసం తీసుకొస్తుంటారు. ప్రభుత్వ ఆస్ప త్రి కావడంతో అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మాత్ర వస్తున్న రోగులకు సరిపోయే వసతులు మాత్రం లేదు. పడకలతో పాటు ఇంకుబేటర్లు, వార్మర్లు, వెంటిలేటర్లు లేవు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 వెంటిలేటర్లు ఉండగా, మరో 50 అవసరం. 150 వార్మర్లు ఉండగా, మరో 150 అవసరముంది. 70 ఫొటోథెరపీ యూనిట్లు ఉండగా, మరో వంద వరకు అవసరం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదు ఆల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి. సత్వర వైద్యసేవలు అందాలంటే మరో ఐదు మిషన్లు అవసరముంది. ఒక్కో పడకపై ఇద్దరు ముగ్గురు శిశువులకు వైద్యం అందించాల్సి వస్తోంది. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఏటా 30 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం 88 మంది వైద్యులు ఉండగా, వెయ్యి మందికి చికిత్స అందించాలంటే మరో 100 మంది అత్యవసరం. ఇటీవల ప్రభుత్వం 560 పోస్టులను మంజూరు చేసింది కానీ ఇప్పటి వరకు ఒక్కటీ భర్తీ చేయలేదు. 1000 మంది శిశువులకు135 మంది నర్సులు.. వైద్యులు శిశువులకు సర్జరీ చేశాక వారి సంరక్షణ బాధ్యత స్టాఫ్ నర్సులదే. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ఐసీయూలోని ప్రతి రెండు పడకలకు ఒక స్టాఫ్ నర్సు, జనరల్ వార్డులోని ప్రతి ఐదు పడకలకు ఒక స్టాఫ్ నర్సు సేవలందించాలి. ప్రస్తుతం నిలోఫర్‌లో మాత్రం 135 మంది నర్సులే ఉన్నారు. వెయ్యి మంది శిశువులకు ఒక్కో షిప్ట్ చొప్పున 45 మందే అందుబాటులో ఉంటున్నారు. వీరిలో నిత్యం ఐదు నుంచి పది మంది నర్సులు సెలవుల్లో ఉంటారు. ఒక్కో నర్సు సగటున 25 మంది పిల్లల పరిరక్షణ చూడాల్సి రావడంతో రోగుల బంధువులే నర్సుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన నర్సులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందక శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల నిష్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇలాంటి వాతావరణంలో శిశువులకు వైద్యం అందించాలంటేనే భయంగా ఉందని ఓ సీనియర్ వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేసు ఎందుకు నమోదైందంటే.. జియాగూడకు చెందిన గౌతం ఉగ్డె కుమారుడు షాహిల్ ఉగ్డె(11 నెలలు) పుట్టుకతోనే మూత్రనాళం సమస్య ఉంది. నాళం సరిగా తెరుచోకక మూత్ర విసర్జన సమయంలో నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు శిశువును మార్చి చివరి వారంలో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించి ‘ఫైమోసిస్’తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో మార్చి 31న బాలుడి తుంటికి శస్త్రచికిత్స చేశారు. చికిత్సకు ముందు ఆరోగ్యంగా ఉన్న శిశువు సర్జరీ చేసి, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించిన తర్వాత మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు సహా బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్నో క్లిష్టమైన చికిత్సలు చేసిన అనుభవం ఉన్న వైద్యుల చేతిలో సాధారణ చికిత్స ఎలా విఫలమవుతుందని ప్రశ్నించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, సదరు వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరుతూ గౌతం ఉగ్డె నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పీడియాట్రిక్ సర్జన్స్‌తో సహా అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సులకు బుధవారం విచారణ నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఆందోళనకు గురయ్యారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులను సంరక్షించే నర్సింగ్ స్టాఫ్ మాత్రం తక్కువగా ఉంది. నిత్యం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందే నీలోఫర్‌లో కేవలం 135 మందే ఉన్నారు. ఇక్కడి శిశువులకు సత్వర వైద్యసేవలు అందాలంటే మరో 300 మంది నర్సులు అవసరం. ఈ అంశంపై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడానికి, శిశు మరణాలకు ఇదే ప్రధాన కారణం. ఒక్క నిలోఫర్‌లోనే కాదు ఉస్మానియాతో సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి.– తెలంగాణ వైద్యుల సంఘం, నిలోఫర్ యూనిట్ -
సీహెచ్‌సీలకు వైద్యులు కావలెను..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత నెలకొంది. మాత, శిశువులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 12 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. 12 సీహెచ్‌సీలకు ఐదు సీహెచ్‌సీల్లో వైద్యులు కొరత వెంటాడుతోంది. ఇదీ పరిస్థితి... జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురపల్లి, భోగాపురం, బాడంగి, సాలురు, భద్రగిరి, కురుపాం, చినమేరంగి, ఘోష ఆస్పత్రి, గజపతినగరం, బొబ్బిలిలో సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో మాత శిశువులకు వైద్యసేవలు అందించేకు ప్రభుత్వం ఎంసీహెచ్ (మదర్ చైల్డ్ హెల్త్) టీమ్‌లను నియమించింది. ఇందులో ఒక మత్తు వైద్యుడు, ఒక గైనకాలజిస్టు, ఒక పిల్లలు వైద్యుడు ఉండాలి. మాతా శిశువులకు పూర్తి స్థాయిలో ప్రసవాలు, సిజేరియన్లు, శిశువులకు చికిత్స అందించడం కోసం ఎంసీహెచ్ బృందాలను నియమించారు. వీటితో మాత, శిశు మరణాలు తగ్గించాలన్నది వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం. అయితే, ఎంసీహెచ్ బృందాల్లో వైద్యులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందడం లేదు. ఫలితం.. సీహెచ్‌సీలకు వచ్చేవారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఐదు సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత.. భద్రగిరి సీహెచ్‌సీలో మత్తువైద్యుడు, గైనకాలజిస్టు, పిల్లల వైద్యుడు ఉండాల్సి ఉండగా ఏ ఒక్కరు లేరు. చినమేరంగిలో పిల్లల వైద్యుడు, మత్తు వైద్యుడు లేరు. సాలురు, బోగాపురంలో మత్తు వైద్యులు లేరు. బాడంగిలో మత్తు వైద్యుడు లేరు. పిల్లల వైద్యుడు కూడా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు లేకపోవడంతో గర్భిణులను ఘోష ఆస్పత్రికి, కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి భర్తీ చేయని ప్రభుత్వం.. సీహెచ్‌సీల్లో మత్తువైద్యుడు, గైనికాల జిస్టు, పిల్లల వైద్యుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా... మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. వైద్యుల కొరత ఉంది... సీహెచ్‌సీల్లో మత్తు, గైనిక్, పిల్లల వైద్యుల పోస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం స్పెషలిస్టు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తుంది. ఈ పక్రియ పూర్తయితే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.– జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి -
ఆపదలో అపర సంజీవిని..
ఆపదలో ఉన్నవారిని ఆదుకొని పునర్జన్మ ప్రసాదించే ‘108’ (అంబులెన్స్) వాహనాలు, అందులో పనిచేసే సిబ్బంది సమస్యల కారణంగా ఆపదలో పడ్డారు.కష్టాలు గట్టెక్కుతాయని వారు ఇన్నాళ్లుగా ఎదురు చూశారు. చాలీ చాలని వేతనాలతో పనిచేశారు.ఇక చేసేది లేక వారు సమ్మె దిశగా అడుగలు వేస్తున్నారు. 108 వాహనం రావడం కాస్త ఆలస్యమైతేనే అమ్మో..అని అంటాం. ఒకవేళ అవి పూర్తిగా నిలబడిపోతే పరిస్ధితి ఏమిటి...? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. కడప రూరల్:రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా 108 వాహనాలు ప్రమాదంలో పడ్డాయి. ఎంతలా అంటే ప్రభుత్వం ఎప్పడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలి యని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 31 వాహనాలు ఉన్నాయి. సంస్థ మారినా వెంటాడుతున్న సమస్యలు.. గడిచిన 2017 డిసెంబర్ 13వ తేదీన 108 వ్యవస్ధ జీవీకే నుంచి యూకేఎస్‌ఏఎస్ మరియు బీవీజీ సంయుక్త ఆధ్వర్యంలోకి వచ్చింది. అంతకుముందు అరకొరగా ఉన్న సమస్యలు సంస్థ మార్పుతో మరింత ఎక్కువయ్యాయి. వాహనాలు తిరగాలంటే కండీషన్లో ఉండాలి. ప్రధానంగా డీజిల్ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు వీటిని పట్టి పీడిస్తున్నాయి. ఒక వాహనానికి నెలకు డీజల్; మరమ్మతులు, సిబ్బంది వేతనాలకు రూ 1.10 లక్షలు రావాలి. అయితే నిధులు సక్రమంగా అందడంలేదు. దీంతో చాలా వాహనాలకు కొత్త టైర్లను మార్చలేని పరిస్ధితి నెలకొంది. అలాగే వాహనాలు కండీషన్లో లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. డీజల్ బకాయిలు లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి. ఇబ్బందుల్లో సిబ్బంది.. రెండు వాహనాలకు సగటున ఐదుగురు టెక్నీషియన్స్, ఐదుగురు పైలెట్లు ( డ్రైవర్లు) షిప్టుల ప్రకారం విధులు చేపడతారు. ఆ ప్రకారం ఒక వాహనానికి ఒక రోజుకు (24 గంటల్లో) దాదాపు 15 కేసులు వస్తాయి. రాత్రి పూట వచ్చే కేసులు అధికంగా ఉంటాయి. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. పైలెట్లు, టెక్నీషియన్స్ మొత్తం 136 మంది ఉండాలి. అయితే 122 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరంతా 12 గంటల పాటు వి«ధులు చేపడుతున్నారు. సాధారణంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అలా అయితే సిబ్బంది సంఖ్యను అందుకు అనుగుణంగా పెంచాలి. యాజ మాన్యాల ఆ దిశగా ఆలోచించడంలేదు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వేతనాలు సక్రమంగా అందడంలేదు. గడిచిన నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఇంతవరకు రాలేదు. పొరుగున ఉన్న తెలం గాణా ప్రభుత్వం అక్కడి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఒకరికి రూ.4 వేలకు పైగా వేతనాలను పెంచింది. 2007లో వైఎస్ తెచ్చిన ‘108’... నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పలు ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అందులో భాగంగా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి నడుం బిగించారు. 2007లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. వీటి రాకతో నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్ధ విజయవంతం కావడంతో 108 వాహనాలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పడు ఇవి కష్టాల నుడుమ ప్రయాణం సాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌కు వినతి.. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ బాబూరావునాయుడుకు 108 ఈఎంటీ అసోíసియేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీరమల్ల సాంబశివయ్య, నాయకులు ఎరుకలయ్య, ఏ గురుస్వామి, రాజేంద్ర, పణితి మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వాహనాలను కండీషన్లో ఉంచాలని తెలి పారు. అత్యవసర మందులకు కొరత ఉందన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సమçస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అసోషియేషన్ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాలో జల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఒక వారం రోజులలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.