ఈ రోగాలకు మందుల్లేవా!? | Staff And Equipment Shortage In AP Government Hospitals | Sakshi
Sakshi News home page

ఈ రోగాలకు మందుల్లేవా!?

Published Tue, Apr 24 2018 9:00 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

Staff And Equipment Shortage In AP Government  Hospitals - Sakshi

శ్రీకాకుళం రిమ్స్‌ ఓపీ వద్ద బారులు తీరిన రోగులు

అనంతపురం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో మందుల కొరతతో పాటు వైద్యులు సమయపాలన పాటించడంలేదు. ఆస్పత్రుల్లో రోగులను సిబ్బంది దోపిడీ చేస్తున్నారు. ఆర్థో, సీఎస్‌ఎస్‌డీలోని రెండు ఆటోక్లేవ్‌ మిషన్లు మరమ్మతుకు నోచుకోలేదు. కొత్తగా రెండు మిషన్లు వచ్చినా ఇన్‌స్టాల్‌ చేయలేదు.  

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వ్యాధుల నిర్ధారణకు అధిక సమయాన్ని తీసుకుంటున్నారు. ఆర్థోపెడిక్‌ ఆపరేషన్లకు వారం, పదిరోజులు పడుతోంది. కొన్ని రకాల ఆపరేషన్లు చేసే పరిస్థితి లేదు. డబ్బులిస్తే కానీ వైద్యం అందే పరిస్థితిలేదు.   

కృష్ణా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా రోగులకు వైద్యం అరకొరగానే అందుతోంది. వైద్యుల కొరత వేధిస్తోంది. ఆపరేషన్లు చేయడంలేదు. విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది. సిబ్బంది, డాక్టర్లు సమయపాలన పాటించడంలేదు. మౌలిక వసతుల కొరత వేధిస్తోంది.    

విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి అత్యవసర విభాగంలో ఏసీలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వార్డుబాయ్‌లు సరిపడా లేరు. వ్యాధి నిర్ధారణ పూర్తిస్థాయిలో చేయడంలేదు. ఆసుపత్రిలో మందుబిళ్లల కొరత తీవ్రంగా ఉంది.

కర్నూలు జిల్లాలో కొన్నిచోట్ల వైద్యులు లేక ఆపరేషన్లు చేయడంలేదు. నంద్యాల ఆసుపత్రి స్థాయి పెంచినా దానికి తగ్గట్లుగా వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. ఇక్కడా మందుల కొరత తీవ్రంగా ఉంది. ఎంఆర్‌ఐ పరీక్షకు రెండు నెలలు ఆగాల్సి వస్తోంది. రిపోర్టులకు వేచి చూసే పరిస్థితి.

చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో సిఫారసు లేఖ తెచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని విభాగాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. తిరుపతి పాత ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి బాలింతలు, గర్భిణులను వేధిస్తోంది. ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉంటున్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిటీ స్కానింగ్‌ పరీక్షకు మూడు వారాల పాటు ఎదురు చూడాల్సిందే. ఎమ్మారై అందుబాటులోకి రాలేదు. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.  

నెల్లూరు జిల్లాలోనూ డాక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు సకాలంలో వైద్యం అందడంలేదు. వైద్యులు సమయానికి రాని పరిస్థితి. ఎంఆర్‌ఐ స్కాన్‌ లేదు. అలాగే ఎండో, 2డి ఎకో పరికరాలు మూలన పడి ఉన్నాయి.

ప్రకాశం జిల్లాలోని అన్ని చోట్లా వైద్యులు, సిబ్బంది, మందుల కొరత ఎక్కువగా ఉంది. స్కానింగ్‌ మిషన్, ఛెస్ట్‌ ఎక్స్‌రే ఆల్ట్రా సౌండ్‌ పరీక్షల సేవలు లభించడంలేదు. ఈ జిల్లాలోనూ వైద్యులు సమయపాలన పాటించడంలేదు. రోగులపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.    

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి.  కాకినాడ పెద్దాస్పత్రిలో పడకల సమస్య తీవ్రంగా ఉంది. అనేక విభాగాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులు ఉండాల్సిన పరిస్థితి. మందుల కొరత ఏర్పడుతోంది. రాజమహేంద్రవరంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. తుని ఆసుపత్రిలో కాన్పులకు చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు.  

శ్రీకాకుళం జిల్లాలో రిమ్స్‌లో క్షతగాత్రులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. ఎక్స్‌రే మిషన్లు నాలుగేళ్ల నుంచి మూలకు చేరాయి. ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో మూడంతస్తుల మెట్లు ఎక్కలేకపోతున్నారు. రోగులు, అటెండెంట్లు అవస్థలు పడుతున్నారు. డెంటల్‌ విభాగం రోగులకు ఫిల్లింగ్, క్లీనింగ్‌లకే పరిమితమైంది.

విశాఖ కేజీహెచ్‌లో వార్డు బాయ్‌లు రూ.50 నుంచి 100 వరకు పిండుతున్నారు. మందులు సరఫరా కావడంలేదు. విమ్స్‌లో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఈఎన్టీ ఆస్పత్రిలో ఎక్స్‌రేల కోసం అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇక్కడా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. పాడేరులో గైనకాలజీ, మత్తు వైద్యులు లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు.  

వైఎస్సార్‌ జిల్లా కడప రిమ్స్‌కు సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సేవలు అందడంలేదు. సీటీ స్కాన్‌ మిషన్‌ ఉన్నా పనిచేయడం లేదు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మిషన్‌ కూడా లేదు. ఐపీ విభాగంలో ఉన్న లిఫ్ట్‌లన్నీ పనిచేయడం లేదు. నాలుగు ఉచిత బస్సులు కూడా మూలన పడడంతో పట్టణానికి వెళ్లి వచ్చే రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో తగినంత మంది వైద్యులు లేరు. ఈసీజీ మిషన్‌ పనిచేయడంలేదు. రోగులకు మధ్యాహ్న భోజన వసతి కూడా లేదు.

కాన్పు అయితే కాసులివ్వాలి
నా మనవరాలు అరుణను రెండో కాన్పు కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం మధ్యాహ్నం ఆడపిల్లను ప్రసవించింది. సాధారణంగా ప్రసవించిన వెంటనే శిశువుపై ఉన్న మాయ తదితరాలను శుభ్రం చేసి కుటుంబ సభ్యుల చేతికిస్తారు. కానీ, ఈ బిడ్డను శుభ్రం చేయకుండానే ఇచ్చారు. ఇదేమంటే మీరే శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అలాగే, బిడ్డ పుట్టిన వెంటనే రూ.400 ఇవ్వాలని అడిగారు. నేను ఇవ్వలేదు. అందుకే ఇలా శుభ్రం చేయకుండా ఇచ్చారు. – రామక్క, రాజోలి, కర్నూలు జిల్లా

 

కాకినాడ జీజీహెచ్‌లో ఒకే మంచంపై బిడ్డలతో సహా పడుకున్న తల్లులు, కొబ్బరి నూనెతో శిశువును శుభ్రం చేస్తున్న అవ్వ రామక్క

పండంటి పాపను కోల్పోయాం
నాకు నెలలు నిండడంతో ఈ నెల 22న నన్ను వీరఘట్టం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్‌ లేదని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నొప్పులు వస్తున్నాయంటే సిబ్బంది చీదరింపులు.. కడుపులో ఇటు అటూ నొక్కేశారు. గత్యంతరం లేక సోమవారం పొద్దున్నే 108లో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి వచ్చాం. ఆస్పత్రి ప్రాంగణంలోకి రాగానే 108లోనే కాన్పు అయింది. బిడ్డ చనిపోయింది. పాలకొండ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంవల్ల తొలికాన్పులో నేను బిడ్డను కోల్పోయాను.– ఉత్తరావిల్లి జయలక్ష్మి, మద్దివలస, శ్రీకాకుళం జిల్లా

 వైద్యులు లేక ఆపరేషన్లు వాయిదా
ఇతని పేరు ఎన్‌.వెంకటేశ్వర్లు (35). ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో చేయి విరగడంతో రిమ్స్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసి చేతిలో రాడ్‌ అమర్చారు. మూడు నెలలుగా చేయి తీవ్రమైన నొప్పి వస్తుండటంతో పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్సచేసి రాడ్‌ తీసేయాలని చెప్పారు. అయితే వైద్యులు లేరని వాయిదాలు వేస్తున్నారు.   

అనంతపురం జిల్లా కదిరి మండలం కమ్మవారిపల్లికి చెందిన లక్ష్మి నిండు గర్భిణి. నొప్పులు రావడంతో సోమవారం భర్త పవన్‌కుమార్‌ కదిరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఉ.9 గంటలకు ఆసుపత్రికి చేరుకోగా ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలతో పాటు డ్యూటీ వైద్యులు కూడా అందుబాటులో లేకపోయారు. హౌస్‌సర్జన్లు మాత్రమే ఉండటంతో భార్యను స్ట్రెచ్చర్‌పై అతనే తోసుకుని వెళ్లాడు. గైనిక్‌ వైద్యులు స్పందించేలోగా కడుపులోనే బిడ్డ ప్రాణం పోయింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని టైటస్‌నగర్‌కు చెందిన వినుకొండ అబ్రహాంకు మరుగుతున్న నూనె ఒంటిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగురోజుల క్రితం అతను ఆసుపత్రిలో చేరాడు. కానీ, అక్కడ పనిచేస్తోన్న ఎంఎన్‌వో బాధితుడికి కనీస డ్రెస్సింగ్‌ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యులు సైతం పట్టించుకోలేదు. కాలిన గాయాలు పుండ్లుగా మారిపోయి. ఇన్ఫెక్షన్‌ పెరిగిపోయి తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.. పై రెండు సంఘటనలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. అవేవీ రోగుల అవసరాలను తీర్చలేకపోవడంతో వారు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వైద్యుల కొరత, డాక్టర్లు–సిబ్బంది సమయపాలన పాటించకపోవడం.. మౌలిక వసతుల లేమి తీవ్రస్థాయిలో వేధిస్తున్నాయి. రోగ నిర్ధారణ పరికరాలు, యంత్రాలు తగినన్ని లేకపోవడం.. ఉన్నా మొరాయిస్తుండడంతో పేదోడికి వైద్యం అందించడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనవిగా ఉన్న తిరుపతి రుయా ఆస్పత్రిలోగానీ, విశాఖ కేజీహెచ్‌లోగానీ, గుంటూరు కేజీహెచ్‌లోగానీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రిగానీ, అన్నింటా అసౌకర్యాలే. మరోవైపు రోగుల అవసరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నా ఆ స్థాయిలో ఎక్కడా సరైన సేవలు అందడంలేదు. రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రుల తీరూతెన్నూ ఇలా ఉన్నాయి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement