అది దేశంలోనే పిల్లల రెండో పెద్దాస్పత్రి.. కానీ అవసరమైనంత మంది వైద్యులు ఉండరు. ఉన్నవి 500 పడకలే.. వెయ్యి మంది శిశువులకు చికిత్స చేస్తుంటారు. ఐసీయూలోని రెండు బెడ్లకు ఒక నర్సు.. జనరల్ వార్డులో ప్రతి ఐదు పడకలకు ఒకరు ఉండాలి. ఇక్కడ మాత్రం సగటున 25 మంది రోగులకు ఒక్క నర్సే సేవలందిస్తున్నారు. సుమారు 200 మంది వైద్యులు అవసరమున్నచోట 88 మందితోనే సరిపెడుతున్నారు. అవసరమైన యంత్ర సామగ్రి, వైద్య పరికరాలు అసలే ఉండవు. ఇది నిలోఫర్ ఆస్పత్రి పనితీరుపై ఒక కోణం..ఇక బాలింతలు, శిశువుల మరణాలు.. అపహరణలు..ఆందోళనలు మరోకోణం.
ఇవన్నీ నవజాత శిశువుల ఆరోగ్య వరప్రదాయినిగా పేరొందిన ‘నిలోఫర్’ ఆస్పత్రి ప్రతిష్టనుదిగజారుస్తున్నాయి. ఇక్కడి దుర్ఘటనలపై మానవ హక్కుల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆస్పత్రిలో11 నెలల శిశువు మరణంతో తొమ్మిది మంది వైద్యులు, సిబ్బందికి తాజాగా పోలీసులునోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం తగినంత మంది సిబ్బందినిఇవ్వకుండా.. సౌకర్యాలు కల్పించకుంటే తామేం చేస్తామని గురువారం ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది.
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువు ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రెండేళ్ల క్రితం ఒకేరోజు ఆరుగురు బాలింతలు చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతకు ముందు అనేక మంది శిశువులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక అపహరణ ఘటనలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితిపై హైకోర్టు సహా మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఓ పదకొండు మాసాల శిశువు మృతి వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సుల(తొమ్మిది మంది)కు బుధవారం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వ వైద్యవర్గాల్లో కలవరం మొదలైంది. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి జోక్యం చేసుకుని వైద్యులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
అసలెందుకిలా జరుగుతుందంటే..
దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా నిలోఫర్ ఆస్పత్రికి గుర్తింపు ఉంది. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను వైద్యం కోసం తీసుకొస్తుంటారు. ప్రభుత్వ ఆస్ప త్రి కావడంతో అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మాత్ర వస్తున్న రోగులకు సరిపోయే వసతులు మాత్రం లేదు. పడకలతో పాటు ఇంకుబేటర్లు, వార్మర్లు, వెంటిలేటర్లు లేవు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 వెంటిలేటర్లు ఉండగా, మరో 50 అవసరం. 150 వార్మర్లు ఉండగా, మరో 150 అవసరముంది. 70 ఫొటోథెరపీ యూనిట్లు ఉండగా, మరో వంద వరకు అవసరం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదు ఆల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి. సత్వర వైద్యసేవలు అందాలంటే మరో ఐదు మిషన్లు అవసరముంది. ఒక్కో పడకపై ఇద్దరు ముగ్గురు శిశువులకు వైద్యం అందించాల్సి వస్తోంది. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్ సోకడం వల్ల ఏటా 30 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం 88 మంది వైద్యులు ఉండగా, వెయ్యి మందికి చికిత్స అందించాలంటే మరో 100 మంది అత్యవసరం. ఇటీవల ప్రభుత్వం 560 పోస్టులను మంజూరు చేసింది కానీ ఇప్పటి వరకు ఒక్కటీ భర్తీ చేయలేదు.
1000 మంది శిశువులకు135 మంది నర్సులు..
వైద్యులు శిశువులకు సర్జరీ చేశాక వారి సంరక్షణ బాధ్యత స్టాఫ్ నర్సులదే. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ఐసీయూలోని ప్రతి రెండు పడకలకు ఒక స్టాఫ్ నర్సు, జనరల్ వార్డులోని ప్రతి ఐదు పడకలకు ఒక స్టాఫ్ నర్సు సేవలందించాలి. ప్రస్తుతం నిలోఫర్‌లో మాత్రం 135 మంది నర్సులే ఉన్నారు. వెయ్యి మంది శిశువులకు ఒక్కో షిప్ట్ చొప్పున 45 మందే అందుబాటులో ఉంటున్నారు. వీరిలో నిత్యం ఐదు నుంచి పది మంది నర్సులు సెలవుల్లో ఉంటారు. ఒక్కో నర్సు సగటున 25 మంది పిల్లల పరిరక్షణ చూడాల్సి రావడంతో రోగుల బంధువులే నర్సుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన నర్సులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందక శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల నిష్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇలాంటి వాతావరణంలో శిశువులకు వైద్యం అందించాలంటేనే భయంగా ఉందని ఓ సీనియర్ వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు.
కేసు ఎందుకు నమోదైందంటే..
జియాగూడకు చెందిన గౌతం ఉగ్డె కుమారుడు షాహిల్ ఉగ్డె(11 నెలలు) పుట్టుకతోనే మూత్రనాళం సమస్య ఉంది. నాళం సరిగా తెరుచోకక మూత్ర విసర్జన సమయంలో నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు శిశువును మార్చి చివరి వారంలో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించి ‘ఫైమోసిస్’తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో మార్చి 31న బాలుడి తుంటికి శస్త్రచికిత్స చేశారు. చికిత్సకు ముందు ఆరోగ్యంగా ఉన్న శిశువు సర్జరీ చేసి, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించిన తర్వాత మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు సహా బంధువులు ఆందోళనకు దిగారు.
ఎన్నో క్లిష్టమైన చికిత్సలు చేసిన అనుభవం ఉన్న వైద్యుల చేతిలో సాధారణ చికిత్స ఎలా విఫలమవుతుందని ప్రశ్నించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, సదరు వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరుతూ గౌతం ఉగ్డె నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పీడియాట్రిక్ సర్జన్స్‌తో సహా అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సులకు బుధవారం విచారణ నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఆందోళనకు గురయ్యారు.
పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులను సంరక్షించే నర్సింగ్ స్టాఫ్ మాత్రం తక్కువగా ఉంది. నిత్యం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందే నీలోఫర్‌లో కేవలం 135 మందే ఉన్నారు. ఇక్కడి శిశువులకు సత్వర వైద్యసేవలు అందాలంటే మరో 300 మంది నర్సులు అవసరం. ఈ అంశంపై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడానికి, శిశు మరణాలకు ఇదే ప్రధాన కారణం. ఒక్క నిలోఫర్‌లోనే కాదు ఉస్మానియాతో సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి.– తెలంగాణ వైద్యుల సంఘం, నిలోఫర్ యూనిట్
Comments
Please login to add a commentAdd a comment