Doctors strike
-
పీహెచ్‌సీల్లో నిలిచిన సేవలు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించటానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) డాక్టర్లు వైద్య సేవలను శనివారం నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. జీవో నంబర్ 85 వెంటనే రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేపట్టారు. చర్చలకని పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్సీ వైద్యుల సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా మెరుగైన వైద్యం కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ కృష్ణబాబు పేరిట పీహెచ్‌సీలన్నింటిలో నోటీసులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యులు అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లసంఖ్యను ప్రభుత్వం పెంచదా? అని ప్రశ్నించారు. డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడంతో వైద్య సంఘం ప్రతినిధులకు సాయంత్రం ఫోన్ చేసిన కమిషనర్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. పీహెచ్సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ ప్రకటించారు. ఏపీ ఎన్జీవో, స్టాఫ్ నర్స్, సీహెచ్‌వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా నిలిచాయని వెల్లడించారు. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. పేదల వైద్య సేవలపై తీవ్ర ప్రభావంపీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ పేర్కొంది. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను తెచ్చినట్టు గుర్తు చేశారు. కోటాను గత సర్కారు క్లినికల్‌లో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతానికి పెంచగా, ఈ ప్రభుత్వం క్లినికల్‌లో 15, నాన్ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించటాన్ని నిరసిస్తున్నామన్నారు. స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోందని, అదే నిజమైతే 488 స్పెషలిస్ట్ పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. మరోసారి చర్చలకు పిలుస్తాం..వైద్యులతో చర్చల సందర్భంగా ఇన్ సర్వీస్ కోటా కుదించటానికి కారణాలను వివరించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల సారాంశాన్ని మంత్రికి తెలియచేశామన్నారు. త్వరలో మళ్లీ చర్చలకు పిలుస్తామని, విధులు కొనసాగించాలని కోరారు.రేపు చలో విజయవాడ..మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 24 గంటలు సమయం ఇస్తున్నట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూనిస్మీర్ ప్రకటించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామన్నారు. సెకండరీ హెల్త్, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్స్, వైద్య సిబ్బంది సంఘాలు ఇందులో పాల్గొంటాయన్నారు. సోమవారం సాయంత్రంలోగా చర్చలు జరిపి తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు. -
సుప్రీం డెడ్‌లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్ట్టర్లు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.నేటి విచారణకు హాజరు కండిబుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.సందీప్ ఘోష్ కస్టడీ పొడిగింపుఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ, సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే. -
సమ్మెలో డాక్టర్లు.. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలుజూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులువిశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..అనంతపురంలో వైద్యుల సమ్మె..కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్‌లో అవుట్‌పేషెంట్ సేవల నిలిపివేత. విజయవాడలో ఆగిన ఓపీ సేవలుకోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళనవిజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లునేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదలఅత్యవసర సేవలకు మినహాయింపుజూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్తిరుపతిలో డాక్టర్ల నిరసన రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసనబహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలుతిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసనసీబీఐ దర్యాప్తు ముమ్మరంఆర్జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. -
తెగని పంచాయితీ..
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న 370 మంది స్టాప్ నర్సులు శాలరీ పేరుతో తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం విధులను బహిష్కరించారు. రెండు రోజుల క్రితం నిమ్స్‌కు వచ్చిన మంత్రి ఈటలను కలిసిన వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారికి సూచించారు. దీంతో ఆమె నర్సులతో సమావేశమైనా వేతనాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పెంచుతున్న వేతనం ఎంతో చెప్పాలని నర్సులు పట్టుబట్టడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీనికితోడు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కూడా అర్దాతంగా ముగియడంతో సమస్య యధాతధంగా కొనసాగుతోంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో వైద్య సౌకర్యం కల్పించాలని, స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని, శాలరీగా మార్పు చేయాలని నర్సులు కోరుతున్నారు. ఎటూ తేల్చని యాజమాన్యం... కాంట్రాక్ట్ స్టాప్ నర్సులకు నిమ్స్ ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.25,000 వేలు, ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్నవారికి రూ.30,000 వరకు వేతనాలు పెంచుతూ నిమ్స్ నిర్ణయం తీసుకుంది. అయితే వేతనాన్ని స్టైఫండ్‌గా పేరుతో కాకుండా శాలరీగా పేరు మార్చి ఇవ్వాలని కాంట్రాక్ట్ నర్సులు కోరుతున్నారు. స్టైఫండ్ పేరుతో వేతనాలు ఇవ్వడంతో తమకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థులతో సేవలు.. నిమ్స్ ఆసుపత్రిలో అసలే నర్సింగ్ సిబ్బంది తక్కువ. పర్మనెంట్ సిబ్బందితో సమానంగా కాంట్రాక్ట్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు ఆందోళన బాట పట్టడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో యాజమాన్యం నర్సింగ్ విద్యార్థులను రంగంలోకి దించింది. విధుల్లో చేరకపోతే చర్యలు కాంట్రాక్ట్ నర్సులు తక్షణం విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని ఆసుపత్రి మెడికల్ సూరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ అన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం వారికి వేతనాలు పెంచామన్నారు. అయితే వారు కోరుకున్నట్లు శాలరీ పేరు పర్మనెంటు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు . స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని కన్సాలిడేటెడ్ పేరుతో ఇస్తామన్నారు. ఇప్పటికైనా విధుల్లో చేరకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. –సత్యనారాయణ, నిమ్స్ సూపరింటెండెంట్ శాలరీ పేరుతో ఇవ్వాలి ఎయిమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహించిన వారికి శాలరీ పేరుతో వేతనాలు ఇస్తున్నారు. ఇది సాధ్యపడే అంశమే. అయితే నిమ్స్ యాజమాన్యం కావాలనే దాట వేస్తోంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాకు రుణాలు ఇవ్వడం లేదు. శాలరీ పేరుతో బ్యాంకు అకౌంటులో వేస్తే మమ్ములను అన్ని విధాలుగా ఆదుకున్నవారవుతారు. –ప్రదీప్, నర్సుల ప్రతినిధి -
డాక్టర్జీ.. రోగులు ఎదురుచూస్తున్నారు
బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. బహుశా వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించి ఆలోచించాల్సి ఉండటమే కావచ్చు. కానీ ఒక డాక్టర్ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్ యాసిడ్ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, వేరొక డాక్టర్ చావుతప్పి లొట్టపోయినట్లు దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, వారి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. డాక్టర్లకు నిరసన తెలిపే, విలపించే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యతలో ఉన్నవారు కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో తొలి బలిపశువుల్లా మిగలాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా? కోల్‌కతాలోని నీల్ రతన్ సర్కార్ హాస్పిటల్లో గత వారం మృతుడి బంధువులు కొందరు తమ ఆగ్రహాన్ని అక్కడ పనిచేస్తున్న ఒక జూనియర్ డాక్టర్‌పై ప్రదర్శించారు. గుంపులో ఒకరు విసిరిన ఇటుక దెబ్బకు డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ్ తలకు తీవ్రగాయం తగిలింది. తనకు ఆపరేషన్ చేశారు కానీ, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని సహ డాక్టర్లు భీతిల్లుతున్నారు. వైద్యుడిపై అలాంటి దాడి జరగటం ఈ దేశంలో ఇది తొలి సారి మాత్రం కాదు. దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె జరిగిన సోమవారం నాడు ఎయిమ్స్‌లో మరొక డాక్టరుపై కూడా కొంతమంది రోగులు దాడి చేశారు. మహానగరాల్లో, పట్టణాల్లో రెసిడెంట్ డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు వివిధ కారణాలతో రోగులు, వారి బంధువుల ఆకస్మిక ఆగ్రహాలకు గురై గాయాలపాలైన ఘటనలెన్నో. (చదవండి : వైద్యుల సమ్మె సమాప్తం) నా కుమారుడు కూడా ప్రస్తుతం ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్. తెల్లకోటు, స్టెతస్కోప్‌ను ధరించి అతడు కూడా ఒంటరిగా హాస్పిటల్ రౌండ్స్‌కు వెళుతుంటాడు. డాక్టర్ల తల్లిదండ్రులందరూ వైద్య విద్య అధ్యయన సమయంలో తమ పిల్లలు చేస్తున్న అత్యంత కఠినతరమైన ప్రయాణాన్ని చవిచూసినవారే. తీవ్రాతి తీవ్రమైన పోటీతో కూడిన ఎంట్రన్స్ పరీక్షలు, కోర్సు క్రమంలో వైద్య విద్య మోపుతున్న పర్వతభారం, నిత్యం జరిగే పరీక్షలు, వీటన్నింటినీ దాటుకుని ఎంబీబీఎస్ డిగ్రీ సాధించడం, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం మళ్లీ పరీక్షలు, ఇంటర్న్‌షిప్‌కు సిద్ధమవటం.. తప్పదు. దీంతో మరోసారి నిద్రలేని రాత్రులు గడపడం(షవర్ వద్ద నిలబడి ఉన్నప్పుడు కూడా కనురెప్ప వాల్చడాన్ని నేర్చుకోవడం), ఆసుపత్రిలో పని ఒత్తిడి, అఖిల భారత పోటీ పరీక్షల కోసం మరో దఫా తీవ్రంగా సన్నద్ధమవడం, కోచింగ్ క్లాసులు, సంపుటాల కొద్దీ పుస్తకాలు చదవాల్సి రావడం, రోగుల పడక పక్కనే కూర్చుని, అదే సమయంలో రోగ వివరాలతో కూడిన ఫైళ్లను నింపడం, పని గంటల మధ్య అమూల్యంగా లభించే 15 నిమిషాలు మాత్రమే నిద్రపోవలసి రావడం.. ఇదీ వైద్య విద్యార్థుల దైనందిన జీవితం. జూనియర్ డాక్టరుగా ఉంటున్న 24 ఏళ్లున్న నా కుమారుడికి కూడా వారాంతపు సెలవులు లేవు. సెలవుదినాలు లేవు. కానీ మరొక మానవ ప్రాణిని కాపాడాల్సిన గొప్ప బాధ్యత మాత్రం ఉంటుంది. వ్యాధుల బారిన పడిన వారి నొప్పి తగ్గించడం, సంరక్షణ లేని ప్రపంచంలో కేర్ తీసుకోవడంతోపాటు ప్రతి వైద్యుడూ పాటించవలసిన ఆ మహోన్నతమైన హిప్పోక్రాట్స్ ప్రమాణం కూడా తోడుగా ఉంటుంది. అదేమిటంటే, మొట్టమొదటగా వైద్యుడు చేయవలసింది ‘రోగికి ఎలాంటి హానీ చేయకపోవడం’. వైద్యుల నిత్య జీవితాచరణ యముడినీ భయపెడుతుంది. డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ అంతవరకు తాను సంరక్షకుడిగా ఉన్న అదే ఆసుపత్రిలో పడుకుని ఉన్నారు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నాలాగే తన తల్లి కూడా అతడు పుస్తకాలతో కుస్తీపడటాన్ని చూసి ఉంటారు. పరీక్షా ఫలితాలలో తాను పొందిన నిమ్నోన్నతాలకు సాక్షిగా ఉండి ఉంటారు. రోగులతో అతడు కలిగివుండే భావోద్వేగ బంధాన్ని గమనించి ఉంటారు. మెడికోగా తన కుమారుడు పడుతున్న ఘర్షణను, ఒత్తిడిని మొత్తంగా ఆమె అనుభూతి చెంది ఉంటారు. అలాంటిది అదే ఆసుపత్రిలో అతడు బెడ్ మీద రోగిలా ఉండటం, తలకు బ్యాండేజ్ చుట్టి ఉండటం చూస్తూ ఆమె ఎంత ఆందోళన చెంది ఉంటారో! పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె తన ముద్దుల కుమారుడు నిస్త్రాణగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయి ఉండరూ! (చదవండి : జూడాల సమ్మెకు సోషల్ మీడియా ఆజ్యం!) బహుశా డాక్టర్లకు సమ్మె చేసే హక్కు ఉండకపోవచ్చు. వారి ప్రథమ కర్తవ్యం తమ గురించి కాకుండా తమ రోగుల గురించే ఆలోచించాల్సి ఉండటం కావచ్చు. కానీ ఒక డాక్టర్ తల బద్దలైనప్పుడు, మరొక డాక్టర్ యాసిడ్ దాడిలో కన్ను కోల్పోవలసి వచ్చినప్పుడు, మరొక డాక్టర్ చావును సమీపించిన స్థితిలో దారుణంగా దెబ్బలు తిన్నప్పుడు, అతడి తెల్లటి దుస్తులు రక్తం మరకలతో తడిసిపోయినప్పుడు.. వారికి నిరసన తెలిపే హక్కు లేదనడంలో ఏదైనా అర్థముందా? ‘నేను దేవుడిని కాదు, డాక్టర్ని మాత్రమే. నా శక్తిమేరకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు’ అనే హక్కు డాక్టర్‌కు లేదని అనగలమా? కుప్పకూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ముంగిట జూనియర్ డాక్టర్ గస్తీ తిరుగుతున్నారు. దేశంలో సరిపడినన్ని ఆసుపత్రులు లేవు. డాక్టర్లు లేరు. ఒకే ఒక్క డాక్టర్ వందమంది రోగులను పర్యవేక్షించాల్సి వస్తున్న దుర్భర స్థితిలోనూ రోగులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. ఆసుపత్రుల్లోని వైద్య సామగ్రి మరమ్మతుకు కూడా సాధ్యం కానంతగా పాడై ఉంటాయి. ఈ స్థితిలో శస్త్రచికిత్సలు చేయడం అంటే అదృష్టాన్ని నమ్ముకోవడమే. చీకటితో నిండి ఉండే ఆసుపత్రి వరండాల్లో, మృత్యువు తనదైన గర్వాతిశయంతో పచార్లు చేస్తుంటుంది. వైద్యులను అద్భుత ప్రావీణ్యతలు కలిగిన శ్రామికుడిగా మనం లెక్కించకూడదు. డాక్టర్లు శక్తినంతటినీ ధారపోసి రోగి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ రోగి ఆఖరి శ్వాసను వారు అడ్డుకోగలరా? నా కుమారుడి మెడ వెనుక భాగంలో పొడిపించుకున్న పచ్చబొట్టు ఏమిటో తెలుసా..! ‘సంరక్షించు, నయం చెయ్యి, నూతనంగా సృష్టించు’. రోగిని సంరక్షించడమే ఒక డాక్టర్ రెండో స్వభావం అయినప్పుడు, కాపాడటమే తన లోపరహిత వైఖరి అయినప్పుడు, అతడు లేక ఆమె రోగి త్వరగా చావాలని అనుకోగలరా? కానీ మన సమాజానికి బలిపశువులు అవసరం. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పగూలిపోయినందువల్ల, నిస్సహాయుడైన జూనియర్ డాక్టర్ ప్రజాగ్రహం ఫలితాలను మొత్తంగా తానే భరించవలసి వస్తోంది. ప్రస్తుతం డాక్టర్–పేషెంట్ నిష్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది ప్రజలకు ఒక్క వైద్యుడు ఉండాలి. కానీ భారతదేశంలో ఇది 1:2,000గా ఉంటోంది. అంటే దేశంలో 50 శాతం డాక్టర్ల కొరత ఉంటోందని దీనర్థం. భారత్ లోని 8,56,065 మంది అల్లోపతి వైద్యుల్లో 6 లక్షల మంది క్రియాశల ప్రాక్టీషనర్లుగా ఉంటున్నారు. వైద్యపరీక్షలకు సంబంధించి విస్తారమైన అనుభవం ఉన్న భారతీయ వైద్యులకు ఎనలేని నైపుణ్యాలు ఉంటున్నాయి. కానీ వీరి ప్రావీణ్యతలకు తగినంత మౌలిక వసతుల వ్యవస్థ మద్దతు లేకపోవడంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. 2009లో జస్టిస్ కట్జు, జస్టిస్ ఆర్ఎమ్. లోథా ఈ అంశంపై ముఖ్యమైన తీర్పు వెలువరించారు. ‘విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుల పట్ల ఈ న్యాయస్థానం ఎలాంటి సానుభూతి చూపదు. కానీ వైద్య వృత్తిని కూడా వినియోగదారు సంరక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావడం వల్ల మన దేశంలో వైద్యులపై ఎక్కడ చూసినా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి’. 2017 సెప్టెంబరులో డాక్టర్ కఫీల్ ఖాన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కారణం. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేక 30–40 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నదేమిటంటే, ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా విషయంలో డాక్టర్ ఖాన్ వ్యక్తిగత స్థాయిలో ధీరోదాత్తమైన ప్రయత్నం చేశారు. తన వ్యక్తిగత కార్యాచరణ ద్వారా ఆయన అనేకమంది పిల్లల ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలను కాపాడటానికి రక్తం ధారపోసిన నిజమైన హీరో డాక్టర్ కఫీల్ ఖాన్. కానీ ఆయనపై అన్యాయంగా ఆరోపించి, అరెస్టు చేసి మరీ విచారణ జరిపారు. గోరఖ్‌పూర్‌లోని ఎన్నారెస్ హాస్పిటల్లో జరిగిన ఘటనలపై రాజ కీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు బలం పుంజుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థి పక్షాలు దీంట్లోకి చొరబడి మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఘటనలో రాజకీయ కుట్రను చూశారు. ప్రతిపక్షం దీంట్లో ఎన్నికల ఎజెండాను చూసింది. అయితే ఇవేవీ నాకు ప్రాధాన్యం కాదు. నేను చూస్తున్నదల్లా, ఎలాంటి కళాకాంతులూ లేని వ్యక్తి తన రోగిముందు కూర్చుని అతడి నాడి పట్టి చూస్తూ, గుండె కొట్టుకొనే శబ్దాన్ని వింటూ, ఒక డాక్టరుకు, రోగికి మధ్య ఉండే అత్యంత సాన్నిహిత్య బంధాన్ని దేశం ముందు వ్యక్తీకరిస్తున్నారు. ఇది సమగ్రతకు సంబంధించిన బాంధవ్యం. మాటల్లో వర్ణించలేని సాన్నిహిత్యం. కుప్పగూలిపోతున్న భారతీయ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ.. ప్రతి భారతీయ డాక్టర్లో నిబిడీకృతమైన శిలాసదృశమైన, వజ్రకవచ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిలుస్తోంది. తనతో ఘర్షిస్తున్న ఈ బాధామయ పరిస్థితులకు వ్యతిరేకంగా భారతీయ డాక్టర్ తన వైద్యపరమైన తేజోవంతమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న ఈ పవిత్రకర్తవ్యం ప్రజాగ్రహానికి గురై ఇలా తన్నులు తినాల్సిందేనా? అతడు లేక ఆమె ఒక రక్తమోడుతున్న నౌకలాగా కుదించుకుపోవలసిందేనా? బహుశా, రక్తగాయాల బారినపడిన ఈ వైద్యమూర్తులు మళ్లీ తన విధులను చేపట్టవచ్చు. తమ గాయాలను పక్కనబెట్టి వారు విధుల్లోకి తిరిగిరావచ్చు. తమ వార్డుకు తిరిగిరావచ్చు. వైద్యులను సంరక్షించని పాలనాయంత్రాంగం, కుప్పగూలుతున్న మౌలిక వ్యవస్థకు వ్యతిరేకంగా తమ మానసిక శక్తి అనే ఏకైక కాంతిపుంజాన్ని వారు సమున్నతంగా ఎత్తిపట్టవచ్చు. అతిగొప్ప మహర్షులు, సైంటిస్టులు, చింతనాపరుల పుట్టినిల్లు అయిన భారతదేశం ఇప్పటికీ మహోన్నత వైద్యులను తయారు చేస్తూనే ఉంది. డాక్టర్ పరిబాహ ముఖోపాధ్యాయ్.. త్వరగా కోలుకోండి. మీ పేషెంట్లు మీకోసం వేచి చూస్తున్నారు. - సాగరికా ఘోష్, సీనియర్ పాత్రికేయురాలు -
వైద్యుల సమ్మె సమాప్తం
కోల్‌కతా: బెంగాల్లో గత ఏడు రోజులుగా వైద్యులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా తామంతా విధుల్లో చేరుతామని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగారు. సమావేశంపై ‘హైడ్రామా’.. సీఎం మమత, వైద్యుల మధ్య భేటీ విషయమై హైడ్రామా నడిచింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా లేకుండానే వైద్యులతో సమావేశం కావాలని మమత నిర్ణయించారు. అయితే ఇందుకు వైద్యులు, జూనియర్ డాక్టర్ల గవర్నింగ్ బాడీ నిరాకరించింది. మీడియా ఉంటే తప్ప చర్చలకు రాబోమని, ప్రభుత్వం చెబుతున్న వీడియో రికార్డింగ్ తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ భేటీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ సర్కారు రెండు ప్రాంతీయ వార్తాచానళ్లను అనుమతించింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో భద్రత, మౌలిక వసతులు సహా వైద్యులు లేవనెత్తిన అనేక సమస్యలను మమత సావధానంగా విన్నారు. ఆగిపోయిన వైద్య సేవలు బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో వైద్యులు నలుపురంగు బ్యాడ్జీలు ధరించి, మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలియజేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని 40,000 మందికిపైగా వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గోవాలో డాక్టర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో నల్లటి బ్యాడ్జీలు, హెల్మెట్లు ధరించిన వైద్యులు మానవహారాలుగా ఏర్పడి నిరసనను తెలియజేశారు. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో వైద్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ వైద్యుల సమ్మె గురించి తెలియని ప్రజలు ఆసుపత్రుల వద్ద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రికో నోడల్ అధికారి ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ఓ నోడల్ అధికారిని నియమించాలని సీఎం మమత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్లపై దాడులు జరిగితే సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పోలీస్ అధికారులపైనే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేసే నోడల్ అధికారులను ఎంపిక చేయాలన్నారు. వీరు స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళతారని మమత తెలిపారు. ఆసుపత్రిలో అందరికీ కనిపించేలా ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వైద్యులపై దాడి చేయకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు. -
మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌కతాలో ఆదివారం దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమైన వైద్యుల గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఆందోళన చేస్తున్న వైద్యులతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించామని పేర్కొన్నారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరని స్పష్టం చేశారు. నేడు దేశవ్యాప్త సమ్మె.. బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. శిక్షాస్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లను చితకబాదారు. ఈ దాడికి నిరసనగా బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగగా, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఆందోళన కారణంగా బెంగాల్లో అత్యవసర సేవలకూ ఇబ్బంది కలుగుతోంది. ఈ ఆందోళనల కారణంగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఏం ప్రభుత్వ ఆసుపత్రిలో శామ్యూల్ అనే వ్యక్తి గుండె ఆపరేషన్ ఆగిపోయింది. తామంతా చాలా దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చామనీ, ఇప్పుడు చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లలేమని రోగులు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బెంగాల్లో కొనసాగుతున్న జూడాల ఆందోళన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కల్పించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే చర్చావేదిక ఎక్కడనేది గవర్నింగ్ బాడీలో చర్చించి తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, దానికన్నా ముందు ఆందోళన జరుగుతున్న ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని వారు కోరుతున్నారు. నిన్న జరిగిన చర్చలు విఫలమైన అనంతరం మమత మాట్లాడుతూ డాక్టర్ల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వారు వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. అలాగే వారిమీద ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ, అలా చేసి వారి భవిష్యత్తును ఇబ్బందిలో పెట్టదల్చుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై బెంగాల్ గవర్నర్ కె.ఎన్.త్రిపాఠి వైద్యుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు డాక్టర్ల ఆందోళన విషయంలో ఆదేశాలు జారీచేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్యసిబ్బంది భద్రతపై దేశం నలుమూలల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖలు అందుతున్నాయి. వైద్యుల భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
సారీ చెప్పాల్సిందే..!
-
వికటించిన మమతాగ్రహం
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారీయెత్తున హింస చెలరేగిన పశ్చిమబెంగాల్ ఇప్పుడిప్పుడే దాన్నుంచి తేరుకుంటోంది. ఇంతలోనే మరో వివాదం ఆ రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. గత సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో వైద్యులపై రోగి బంధువులు, ఇతరులు దాడి చేసి పలువురిని గాయపర్చడం తాజా వివాదానికి కారణం. వైద్యులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి కారకులపై కఠిన చర్య తీసుకోవాలంటున్నారు. ఉన్న సమస్యను జటిలం చేసుకోవడంలో, అది మరింత తీవ్రరూపం దాల్చే పరిస్థితి తెచ్చుకోవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధహస్తులు. వైద్యుల సమ్మె విషయంలోనూ ఆమె వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా లేదు. పర్యవసానంగా వైద్యుల సమ్మె రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఉన్నతశ్రేణి ఆసుపత్రి ఎయిమ్స్ మొదలుకొని పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే లక్షలాదిమంది వైద్యులు బెంగాల్లో తమ సహచరులకు సంఘీభావంగా శుక్రవారం ప్రదర్శనలు నిర్వహించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనట్టయితే వచ్చే సోమవారం దేశవ్యాప్త సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిని సందర్శించి దాడుల్లో గాయపడిన వైద్యులను పరామర్శించారు. ఇంతా జరిగాక శనివారం తాను వైద్యులతో చర్చలు జరుపుతానని మమత ముందుకొచ్చారు. దేశంలో దాదాపు 90 శాతంమంది ప్రజానీకానికి సర్కారీ దవఖానాలే దిక్కు. రోగమొచ్చినా, అనుకోని ప్రమాదం వచ్చిపడినా ప్రైవేటు ఆసుపత్రులకు పోయే స్థోమత వారికుండదు. కనుక ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే నిరుపేదలు ఇబ్బంది పడతారు. అర్ధరాత్రీ అపరాత్రీ వైద్య సేవలందించేవారిపై దాడులు జరగడం ఆందోళనకరమే. పైగా కోల్‌కతా ఉదంతంలో అక్కడే ఉన్న పోలీస్ ఔట్‌పోస్టుకు సమాచారం ఇచ్చినా సరిగా స్పందన లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగి కన్నుమూశాక అతని బంధువులు ఇద్దరు మహిళా జూనియర్ డాక్టర్లపై చేయి చేసుకోవడం, అడ్డొచ్చినవారిపై కూడా దౌర్జన్యం చేయడం జరిగాక పోలీసులు సర్దిచెప్పి పంపేశారని, కానీ ఆ తర్వాత 200మంది ఆసుపత్రిలోకి ప్రవేశించి రాళ్లు, కర్రలతో దాడులు చేశారని, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారని వైద్యుల ఆరోపణ. సక్రమంగా వైద్యం చేయకపోవడమేకాక, నిలదీసినందుకు తమపై దాడి చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. సమ్మె మొదలయ్యాక మమతా బెనర్జీ వివిధ ఆసుపత్రులు సందర్శించి, రోగులతో మాట్లాడారు. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, విధులు నిర్వర్తించే వైద్యులకు తగిన భద్రత కల్పిస్తామని ఆమె చెప్పి ఉంటే అక్కడితో సమస్య సమసి పోయేది. కానీ రోగుల అవస్థలు ప్రత్యక్షంగా చూడటం వల్లనో, సరైన సమాచారం లేకనో ఆమె తీవ్రంగా స్పందించారు. జూనియర్ డాక్టర్లతో వాదులాటకు దిగారు. సమ్మెలో ‘బయటి శక్తులు’ ఉన్నాయని, నాలుగు గంటల్లో వైద్యులు విధులకు హాజరు కాకపోతే హాస్టళ్లనుంచి గెంటేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ప్రాణాపాయంలో ఉన్నవారెవరైనా చికిత్స అందక కన్నుమూస్తే వైద్యులనే బాధ్యుల్ని చేస్తామన్నారు. ఆమె ఒక ఆసుపత్రి దగ్గర ఇలా హెచ్చరించిన కొద్దిసేపటికే వివిధ ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు 43మంది రాజీనామాలు సమర్పించారు. మరికొందరు రాజీనామాలకు సిద్ధపడ్డారు. మన ఆసుపత్రుల్లో వైద్యులపై దాడులు జరగడం కొత్తగాదు. మారుమూల ఆసుపత్రి మొదలుకొని ఢిల్లీలో ఎయిమ్స్ వరకూ తరచు ఇలా జరుగుతున్నాయి. విధినిర్వహణలో ఉంటున్న వైద్యుల్లో 75 శాతంమంది ఏదో రకమైన హింసకు గురవుతున్నారని రెండేళ్లక్రితం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. చావుబతుకుల్లో ఉన్న రోగులను ఆసుపత్రులకు తీసుకొచ్చినప్పుడు వారి బంధువుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. జరగరానిది జరిగితే సరైన వైద్యం లభించలేదని ఆ భావోద్వేగ పరిస్థితుల్లో అనుకుంటారు కూడా. అటువంటప్పుడే పోలీసుల అవసరం పడుతుంది. దౌర్జన్యానికి దిగేవారిని సకాలంలో అదుపు చేయడం, సర్ది చెప్పడం వారు చేయాల్సిన పనులు. పేరుకు ఆస్పత్రుల్లో ఔట్ పోస్టులుంటున్నా వైద్యులపై తరచు దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారికి తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కోల్‌కతా ఉదంతంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఆ విషయంలో తమవైపుగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతామని, ఇకపై ఇటువంటివి జరగకుండా చూస్తామని మమతా బెనర్జీ చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ఆమె అందుకు భిన్నంగా ఆమె ఒకరకమైన నిస్సహాయతలోకి జారుకున్నారు. స్వరం పెంచి వైద్యులను బెది రించడం, ఆగ్రహావేశాలు ప్రదర్శించడం సమస్య పరిష్కారానికి ఏ మాత్రం ఉపకరించకపోగా అది మరింత ఉగ్రరూపం దాలుస్తుందని మమత గ్రహించలేకపోయారు. గవర్నర్ చొరవ తీసుకుని సమ్మె చేస్తున్న వైద్యులతో మాట్లాడటం, తాను ఈ సమస్య విషయమై ఫోన్ చేస్తే మమత అందుబాటులోకి రాలేదని చెప్పడం రాజకీయంగా ఆమెకు నష్టం చేకూర్చే పరిణామాలే. బహుశా ఇది గ్రహించబట్టే ఆమె వైద్యులతో శనివారం సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ పని ముందే చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అటు వైద్యులు కూడా తమ సమ్మె కారణంగా సమస్యతో అసలు సంబంధం లేని నిరుపేద రోగులు నానా అగచాట్లూ పడుతున్నారని గుర్తించాలి. ఏ నిరసన రూపం ఉద్దేశమైనా అంతిమంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడమే. అది నెరవేరినట్టే గనుక వైద్యులు ఆందోళన విరమించాలి. -
17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో వైద్యులపై దాడికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు ఐఎంఏ సంఘీభావంగా ఈనెల 17న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలను ప్రారంభించింది. ఈనెల 17న ఔట్‌పేషెంట్ విభాగాలతో పాటు అత్యవసర మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. మరోవైపు బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళనను విరమింపచేసేందుకు చొరవ చూపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్‌కతా హైకోర్టు కోరింది. వైద్యుల ఆందోళనతో నెలకొన్న ప్రతిష్టంభనేను తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో వారం రోజుల్లోగా వెల్లడించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్లో వైద్యులు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘వారంలోగా తేల్చండి’
కోల్‌కతా : ఆందోళన చేపట్టిన వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికను బేఖాతరు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యుల ఆందోళనతో ఆస్పత్రుల్లో చికిత్స లభించక వైద్యులు పడుతున్న ఇబ్బందులకు తెరదించాలని, వారంలోగా సమస్యను పరిష్కరించాలని కోల్‌కతా హైకోర్టు మమతా బెనర్జీ సర్కార్‌ను ఆదేశించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని పీపుల్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సంస్ధకు చెందిన కునల్ సహా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా వైద్యుల సమ్మెపై స్టే ఉత్తర్వులు జారీ చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏం చర్యలు చేపట్టారో వివరించాలని కోరింది. వివాదానికి కేంద్ర బిందువైన ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ 82 మంది వైద్యులతో పాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ రాజీనామా చేశారు. మరోవైపు దీదీ సమీప బంధువు, కోల్‌కతా మేయర్ కుమార్తె వైద్యుల ఆందోళనలో పాలుపంచుకోవడం మమతా సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. కాగా ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా బెంగాల్ అంతటా వైద్యుల నిరసన కొనసాగుతోంది. తమకు భద్రత కల్పించాలని కోరుతూ వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. -
వైద్యుల ఆందోళన : దీదీకి కేంద్ర మంత్రి క్లాస్
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో వైద్యులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. ఎయిమ్స్, సహా పలు ప్రముఖ ఆస్పత్రుల వైద్యులు శుక్రవారం మంత్రి హర్షవర్ధన్‌ను కలిశారు. వైద్యులు సురక్షిత వాతావరణంలో పనిచేసే పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని, వైద్యులకు తగిన భద్రతను ఏర్పాటు చేస్తామని తనను కలిసిన వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు. వైద్యుల ఆందోళన అంశంలో ప్రతిష్టకు పోరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తమపై దాడిచేసిన వారిపై చర్యలు చేపట్టాలని, తమకు భద్రత కల్పించాలని వైద్యులు కోరుతుండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవేమీ చేయకుండా వైద్యులనే విధుల్లో చేరాలని హెచ్చరికలు పంపడంతో వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని వివరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన తీరు మార్చుకుంటే దేశవ్యాప్తంగా రోగుల ఇబ్బందులు తొలగిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ అంశంపై తాను మమతా బెనర్జీకి లేఖ రాయడంతో పాటు ఆమెతో మాట్లాడతానని చెప్పారు. -
కాళ్లు మొక్కినా.. వైద్యమందక
నిరుపేదలకు ప్రాణం మీదకు వస్తే వెంటనే గుర్తొచ్చేది ప్రభుత్వ ఆస్పత్రి. అందుకే ఇక్కడి వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం మంVýæళవారం నుంచి సమ్మెబాట పట్టారు. అత్యవసర సేవలు మినహా చేయిపట్టేది లేదని తేల్చిచెప్పారు. దీంతో నిత్యం వేలాది మంది వచ్చే సర్వజనాస్పత్రిలో రోగులు నరకం చూశారు. సకాలంలో వైద్యం అందక ఏడుపులు..పెడబొబ్బలు పెట్టారు. కాస్త దయచూపండంటూ కనిపించిన వారందరినీ వేడుకున్నారు. ఈ క్రమంలోనే హౌస్ సర్జన్లకు సూచనలిచ్చేందుకు ఓ వైద్యురాలు రాగా.. నీకాళ్లు మొక్కుతా తల్లీ నాకు వైద్యం చేయమని ఓ వృద్ధురాలు ప్రాధేయపడిన తీరు రోగుల దీన స్థితికి అద్దం పట్టింది. ఈ వృద్ధురాలి పేరు ఈరమ్మ. మడకశిర మండలం హనుంతరాయపల్లి గ్రామం. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెండ్రోజులుగా ఆయాసంతో బాధపడుతూ మడకశిర ఆస్పత్రిలో చూపించుకుంది. ఎటువంటి ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చింది. ఓపీ నంబర్ 15కు ఎంతసేపటికీ వైద్యులు రాలేదు. ఇదేమిటని ఆరా తీస్తే వైద్యుల సమ్మె అని తెలిసింది. దీంతో ఆ వృద్ధురాలి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. రూ 250 ఖర్చు పెట్టుకుని ఇక్కడకు వస్తే వైద్యులు లేకపోతే ఎలాగని కన్నీటి పర్యంతమైంది. ఆయాసం వస్తోందయ్యా ఏంటి నా పరిస్థితితని బోరున విలపించింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యుల సమ్మెతో రోగులు ప్రత్యక్ష నరకం చూశారు. మంగళవారం సమ్మెలో భాగంగా ఆస్పత్రిలోని ఓపీ గదులను వైద్యులు మూసేసి ధర్నాలో పాల్గొన్నారు. వైద్యులు ఓపీ బ్లాక్ ముందే సేవలు లేవని రోగులకు తెగేసి చెప్పారు. నిత్యం కిటకిటలాడే ఓపీ విభాగాలు బోసిపోయాయి. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లను వాయిదా వేశారు. విద్యార్థులకూ బోధన తరగతులు తీసుకోలేదు. ఇంకా సమ్మె మూడ్రోజుల పాటు ఉండడంతో రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ వైద్యులపై చిత్తశుద్ధేదీ? ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల పట్ల సర్కార్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతుంటే రిమ్స్ వైద్యులను ప్రభుత్వ వైద్యులుగా గుర్తించడమేంటని నిలదీశారు. దీని ద్వారా సీనియర్ వైద్యులు నష్టపోవడమే కాక, ఒకే కేడర్‌లో ఉద్యోగ విరమణపొందుతారన్నారు. పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారమయ్యే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. 27న మహాధర్నా ఆస్పత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో వైద్యుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ డీఎంఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలని డీఎంఈ ఇస్తే కుదరదన్నారు. ఈ నెల 26న విధులను బహిష్కరిస్తామని, 27న జూనియర్ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కలుపుకుని మహాధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ భానుమూర్తి, వైద్యులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ షంఫాద్బేగం, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సుల్తానా, డాక్టర్ హేమలత, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్ పాల్గొన్నారు. -
ఏమీ సేతుర లింగా!
అది దేశంలోనే పిల్లల రెండో పెద్దాస్పత్రి.. కానీ అవసరమైనంత మంది వైద్యులు ఉండరు. ఉన్నవి 500 పడకలే.. వెయ్యి మంది శిశువులకు చికిత్స చేస్తుంటారు. ఐసీయూలోని రెండు బెడ్లకు ఒక నర్సు.. జనరల్ వార్డులో ప్రతి ఐదు పడకలకు ఒకరు ఉండాలి. ఇక్కడ మాత్రం సగటున 25 మంది రోగులకు ఒక్క నర్సే సేవలందిస్తున్నారు. సుమారు 200 మంది వైద్యులు అవసరమున్నచోట 88 మందితోనే సరిపెడుతున్నారు. అవసరమైన యంత్ర సామగ్రి, వైద్య పరికరాలు అసలే ఉండవు. ఇది నిలోఫర్ ఆస్పత్రి పనితీరుపై ఒక కోణం..ఇక బాలింతలు, శిశువుల మరణాలు.. అపహరణలు..ఆందోళనలు మరోకోణం. ఇవన్నీ నవజాత శిశువుల ఆరోగ్య వరప్రదాయినిగా పేరొందిన ‘నిలోఫర్’ ఆస్పత్రి ప్రతిష్టనుదిగజారుస్తున్నాయి. ఇక్కడి దుర్ఘటనలపై మానవ హక్కుల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆస్పత్రిలో11 నెలల శిశువు మరణంతో తొమ్మిది మంది వైద్యులు, సిబ్బందికి తాజాగా పోలీసులునోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం తగినంత మంది సిబ్బందినిఇవ్వకుండా.. సౌకర్యాలు కల్పించకుంటే తామేం చేస్తామని గురువారం ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువు ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రెండేళ్ల క్రితం ఒకేరోజు ఆరుగురు బాలింతలు చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతకు ముందు అనేక మంది శిశువులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక అపహరణ ఘటనలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితిపై హైకోర్టు సహా మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఓ పదకొండు మాసాల శిశువు మృతి వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. బాధితులు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సుల(తొమ్మిది మంది)కు బుధవారం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వ వైద్యవర్గాల్లో కలవరం మొదలైంది. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి జోక్యం చేసుకుని వైద్యులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అసలెందుకిలా జరుగుతుందంటే.. దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా నిలోఫర్ ఆస్పత్రికి గుర్తింపు ఉంది. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను వైద్యం కోసం తీసుకొస్తుంటారు. ప్రభుత్వ ఆస్ప త్రి కావడంతో అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మాత్ర వస్తున్న రోగులకు సరిపోయే వసతులు మాత్రం లేదు. పడకలతో పాటు ఇంకుబేటర్లు, వార్మర్లు, వెంటిలేటర్లు లేవు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 వెంటిలేటర్లు ఉండగా, మరో 50 అవసరం. 150 వార్మర్లు ఉండగా, మరో 150 అవసరముంది. 70 ఫొటోథెరపీ యూనిట్లు ఉండగా, మరో వంద వరకు అవసరం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదు ఆల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి. సత్వర వైద్యసేవలు అందాలంటే మరో ఐదు మిషన్లు అవసరముంది. ఒక్కో పడకపై ఇద్దరు ముగ్గురు శిశువులకు వైద్యం అందించాల్సి వస్తోంది. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఏటా 30 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం 88 మంది వైద్యులు ఉండగా, వెయ్యి మందికి చికిత్స అందించాలంటే మరో 100 మంది అత్యవసరం. ఇటీవల ప్రభుత్వం 560 పోస్టులను మంజూరు చేసింది కానీ ఇప్పటి వరకు ఒక్కటీ భర్తీ చేయలేదు. 1000 మంది శిశువులకు135 మంది నర్సులు.. వైద్యులు శిశువులకు సర్జరీ చేశాక వారి సంరక్షణ బాధ్యత స్టాఫ్ నర్సులదే. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ఐసీయూలోని ప్రతి రెండు పడకలకు ఒక స్టాఫ్ నర్సు, జనరల్ వార్డులోని ప్రతి ఐదు పడకలకు ఒక స్టాఫ్ నర్సు సేవలందించాలి. ప్రస్తుతం నిలోఫర్‌లో మాత్రం 135 మంది నర్సులే ఉన్నారు. వెయ్యి మంది శిశువులకు ఒక్కో షిప్ట్ చొప్పున 45 మందే అందుబాటులో ఉంటున్నారు. వీరిలో నిత్యం ఐదు నుంచి పది మంది నర్సులు సెలవుల్లో ఉంటారు. ఒక్కో నర్సు సగటున 25 మంది పిల్లల పరిరక్షణ చూడాల్సి రావడంతో రోగుల బంధువులే నర్సుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన నర్సులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందక శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల నిష్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇలాంటి వాతావరణంలో శిశువులకు వైద్యం అందించాలంటేనే భయంగా ఉందని ఓ సీనియర్ వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేసు ఎందుకు నమోదైందంటే.. జియాగూడకు చెందిన గౌతం ఉగ్డె కుమారుడు షాహిల్ ఉగ్డె(11 నెలలు) పుట్టుకతోనే మూత్రనాళం సమస్య ఉంది. నాళం సరిగా తెరుచోకక మూత్ర విసర్జన సమయంలో నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు శిశువును మార్చి చివరి వారంలో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించి ‘ఫైమోసిస్’తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో మార్చి 31న బాలుడి తుంటికి శస్త్రచికిత్స చేశారు. చికిత్సకు ముందు ఆరోగ్యంగా ఉన్న శిశువు సర్జరీ చేసి, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించిన తర్వాత మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు సహా బంధువులు ఆందోళనకు దిగారు. ఎన్నో క్లిష్టమైన చికిత్సలు చేసిన అనుభవం ఉన్న వైద్యుల చేతిలో సాధారణ చికిత్స ఎలా విఫలమవుతుందని ప్రశ్నించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, సదరు వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరుతూ గౌతం ఉగ్డె నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పీడియాట్రిక్ సర్జన్స్‌తో సహా అనెస్థీషియన్, స్టాఫ్‌నర్సులకు బుధవారం విచారణ నోటీసులు అందజేశారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఆందోళనకు గురయ్యారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులను సంరక్షించే నర్సింగ్ స్టాఫ్ మాత్రం తక్కువగా ఉంది. నిత్యం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందే నీలోఫర్‌లో కేవలం 135 మందే ఉన్నారు. ఇక్కడి శిశువులకు సత్వర వైద్యసేవలు అందాలంటే మరో 300 మంది నర్సులు అవసరం. ఈ అంశంపై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. సకాలంలో వైద్యసేవలు అందకపోవడానికి, శిశు మరణాలకు ఇదే ప్రధాన కారణం. ఒక్క నిలోఫర్‌లోనే కాదు ఉస్మానియాతో సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి.– తెలంగాణ వైద్యుల సంఘం, నిలోఫర్ యూనిట్ -
‘గాంధీ’ వైద్యులపై దాడి
► చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి.. ► వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జూడాలపై కుటుంబసభ్యుల దాడి ► జూడాల ధర్నాతో 2 గంటలు నిలిచిన వైద్యసేవలు.. హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులపై మళ్లీ దాడి జరిగింది. దీంతో ముగ్గురు జూనియర్ డాక్టర్ల(జూడా)కు గాయాలయ్యాయి. దాడులకు నిరసనగా జూడాలు విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. ముషీరాబాద్ పార్శిగుట్ట బాపూజీనగర్‌కు చెందిన మహ్మద్ చున్నుమియా(70)కి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికి వైద్యసేవలు వద్దంటూ రోగిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యానికి రూ.5 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో మళ్లీ అతడిని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈసీజీ కోసం తరలిస్తుండగా చున్నుమియా మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ చున్ను మియా కుమారులు గౌస్, అజ్జు, మరికొందరు కలసి జూడాలపై చెప్పులతో దాడి చేశారు. ఓ వైద్యుడి ముక్కు నుంచి రక్తం రాగా, మరో వైద్యు నికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆర్ఎంవో సాల్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూడాల ఆందోళన.. తమపై కొన్నేళ్లుగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు, ఆస్పత్రుల యాజమాన్యాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని 600 మంది జూడాలు ధర్నా చేశారు. రాష్ట్ర వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌కుమార్, గాంధీ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు సిద్దిపేట రమేశ్, భూమేశ్‌కుమార్ జూడాలకు మద్దతు ప్రకటించారు. పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. వైద్యుల తప్పిదం లేదని మృతుడి కుమార్తె షాహిన్‌బేగం లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అనంతరం చున్నుమియా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అర్ధంతరంగా ముగిసిన చర్చలు.. జూడాలు, టీజీజీడీఏ సంఘం నాయకులతో డీఎంఈ రమేశ్‌రెడ్డి సాగించిన చర్చలు అర్ధంతరం గా ముగిశాయి. డిమాండ్ల పరిష్కారానికి లిఖితపూర్వకంగా హామీ కావాలని జూడాలు పట్టుబట్టారు. బుధవారం సాయంత్రం 5 వరకు సాగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. గురువారం ఉదయం మరోమారు చర్చలు కొనసాగుతాయని, రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. జూడాలపై దాడి ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టు అయినవారిలో మృతుడి కుమారులు గౌస్, అజ్జు, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. -
ఎస్మా ప్రయోగించరా?
► వైద్యశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం ► వైద్యులతో మంత్రి చర్చలు విఫలం ► 17వ రోజుకు చేరిన సమ్మె సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యుల సమ్మెతో చికిత్స అందక రోగులు అల్లాడుతున్నారు, వైద్యులపై ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహించింది. కోర్టుకు రప్పించి మరీ పలు ప్రశ్నలతో నిలదీసింది. పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయరాదనే కోర్కెపై వైద్యులు గత నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుపుతున్నారు. శుక్రవారం నాటికి ఈ సమ్మె 17వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ వైద్యులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్దులు సైతం సమ్మెకు దిగి వివిధ రీతుల్లో తమ నిరసనలు ప్రకటిస్తున్నారు. వైద్య మంత్రి విజయభాస్కర్ సమ్మె ప్రారంభంలో జరిపిన చర్చలు విఫలమైనాయి. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం సేవలు స్థంభించిపోయాయి. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సైనికుడు సుబ్రమణి చికిత్స అందక గురువారం ప్రాణాలు విడవడం మరి విషాదంగా మారింది. కాగా రోగులు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో కడలూరుకు చెందిన న్యాయవాది ఏకే వేలన్ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. వైద్యుల సమ్మె వల్ల ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సేవలపైనే ఆధారపడి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సైతం పడకేయడంతో గ్రామీణుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితి ప్రజలకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి వైద్యులు సమ్మెను విరమించుకునేలా వెంటనే ఆదేశించాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, పార్దిబన్లతో కూడిన బెంచ్‌కు శుక్రవారం విచారణకు వచ్చింది. వైద్యల సమ్మె వల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే, రోగులు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన చికిత కోసం ప్రభుత్వం ఏమీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, వైద్యుల చేత సమ్మెను విరమింపజేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో సవివరమైన నివేదికతో శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టుకు హాజరుకావాలని డాక్టర్ రాధాకృష్ణన్‌ను న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్ హడావిడిగా వైద్యుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కార్యదర్శి రాధాకృష్ణన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ, వైద్యుల సమ్మెను ముగించేందుకు ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించారు. అత్యవసర సేవల ఉండేవారు విధులను బహిష్కరించిన పక్షంలో ఎస్మా చట్టం కింద అరెస్ట్ చేసి ఆరు నెలలపాటూ జైలుకు పంపవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి వైద్యులను రెచ్చగొట్టే ధైర్యం చేయలేక పోయింది. కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైద్యుల సమ్మె వల్ల రోగులు ఇబ్బంది పడకుండా తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించానని చెప్పారు. చర్చల ద్వారా వైద్యుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని న్యాయమూర్తులు సూచించినట్లు తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వానికి వైద్యుల నుండి రెండువారాల గడువును కోరనున్నట్లు ఆయన చెప్పారు. -
నేటి నుంచి వైద్యుల సమ్మె
- ఈ నెల 30 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన - మే 16 నుంచి ఓపీ సేవల బహిష్కరణ - జూన్ రెండు నుంచి అన్ని సేవలు నిలుపుదల - అయినా చర్చలకు పిలవని వైద్య, ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయల కల్పన, వైద్యులకు భద్రత తదితర అనేక డిమాండ్లను ఆమోదించాలని సోమవారం(నేడు) నుంచి తెలంగాణ ప్రభుత్వ వైద్యులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు గత నెల 23న తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేశ్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి.నరహరి తదితరులు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోటీసు ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఉపాధ్యక్షుడు డాక్టర్ నరహరి ‘సాక్షి’కి తెలిపారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించామని, కానీ ప్రభుత్వం సమ్మెను చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. మే ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజుకో గంట నిరసన, అదే నెల 16 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఔట్‌పేషెంట్ సేవ(ఓపీ)ల బహిష్కరణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నుంచి అన్ని రకాల వైద్య సేవల బహిష్కరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆస్పత్రులు, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు సహా బోధన, బోధనేతర ఆస్పత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని నరహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికిపైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లు ఇవే... ► డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి ► గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు, జిల్లా తదితర ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి ► యూనివర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి. నిర్ణీత సమయంలోగా వైద్యులకు పదోన్నతులు కల్పించాలి ► ట్రెజరీ ద్వారానే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. వారందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి ► అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి ► తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కి పంపాలి. తప్పుడు ధ్రువీకరణపత్రాలు, డాక్యుమెంట్లు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి ► ఆర్టీవో, ఏసీపీలతో సమానంగా మెడికల్ ఆఫీసర్లకు రవాణా వసతి కల్పించాలి. ప్రొటోకాల్‌ను అమలు చేయాలి ► పదో పీఆర్సీని అమలు చేయాలి. ఎరియర్స్ ఇవ్వాలి ► వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి. -
వెంటనే విధుల్లో చేరండి.. లేకుంటే చర్యలు తప్పవు
ముంబై: మహారాష్ట్ర లో సమ్మె చేస్తున్న వైద్యులపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వైద్యులు విధులు బహిష్కరించి వరుసగా రెండో రోజూ సమ్మె కొనసాగించడంపై రోగులు ఇబ్బంది పడుతున్నారు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేలమంది వైద్యులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. వైద్యులు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రోగుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేశారు. -
4 వేలమంది డాక్టర్ల సమ్మె.. రోగులకు ఇక్కట్లు
ముంబై: మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేలమంది వైద్యులు.. ఇటీవల తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా సమ్మెకు దిగారు. తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. వైద్యులు మెరుపు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోమవారం ఉదయం ముంబైలోని సియోన్ ఆస్పత్రి ముందు సిబ్బంది భారీ సంఖ్యలో గుమికూడి నిరసన తెలిపారు. ముంబైలోని కేఈఎమ్ ఆస్పత్రి రోగుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేసింది. రోగులకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ సుపె చెప్పారు. ఇటీవల దూలేలో ఆలస్యంగా వైద్యం చేశారనే కారణంతో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. అంతకుముందు మరో వైద్యుడిపై దాడి చేసినప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి గిరీష్ మహాజన్ స్పందిస్తూ.. వైద్యులపై దాడి జరగడం దురదృష్టకరమని, నిందితులపై చర్యలు తీసుకుంటామని, వైద్యులకు మరింత భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
విధుల్లోకి జూడాలు
ప్రభుత్వంతో చర్చలు సఫలం గాంధీ, ఉస్మానియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఆస్పత్రుల భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిప్యూటీ సీఎం రాజయ్య, హోం మంత్రి నాయిని వెల్లడి హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో జూడాలు సమ్మె విరమించారు. వైద్యుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచి విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న ఓ జూనియర్ డాక్టర్‌పై రోగి తరఫు బంధువులు దాడి చేయడంతో జూడాలు విధులు బహిష్కరించారు. అత్యవసర సర్వీసులు కూడా నిలిపివేయడంతో రోగులు విలవిల్లాడారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జూడాలను చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం సచివాలయంలో జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరపున హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య పాల్గొనగా, జూడాల తరపున హౌస్ సర్జన్ల సంఘం, తెలంగాణ వైద్యుల సంఘం, జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. జూడాల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించారు. పూర్తి రక్షణ కల్పిస్తాం : గాంధీ ఆస్పత్రి దగ్గర భద్రత మరింత పెంచుతామని డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రిలో యాభై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా దాడులకు పాల్పడిన వారిని గుర్తించి మెడికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆస్పత్రుల భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)తో రక్షణ కల్పించాలనే డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడంతో పాటు ఖాళీలను భర్తీ చేసి, సేవలను మెరుగు పరుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి వరకు వైద్యుల సమ్మె కొనసాగడంతో రోగులు ఆందోళనకు దిగారు.ముగ్గురి అరెస్ట్: వైద్యునిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనకు కారణమైన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన జే.మల్లేష్ (30), టి.మధుకర్ (36), సీహెచ్ పాండు (30)లను బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి దగ్గర అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు శ్రీనివాస్, సునీల్‌లు పరారీలో ఉన్నారు. -
రోగుల విలవిల
‘గాంధీ’లో కొనసాగుతున్నజూడాల సమ్మె వెద్యం అందక 32 మంది మృతి నిలిచిపోయిన 400 శస్త్ర చికిత్సలు చికిత్స అందించాలని రోగుల ధర్నా హైదరాబాద్: వైద్యుల సమ్మెతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించే వారే కరువయ్యారు. రెండు రోజులుగా వైద్య సదుపాయాలు నిలిచిపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. రెండురోజులుగా వైద్యులు సమ్మెబాట పట్టడంతో 400 శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు గాంధీ ఆస్పత్రిలో సుమారు 32 మంది మృతిచెందినట్లు తెలిసింది. మృతుల్లో మూడురోజుల పసికందు కూడా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్యవసర శస్త్రచికిత్సల కోసం వచ్చిన వారు ఇక్కడి పరిస్థితి చూసి బోరుమంటున్నారు. వైద్యం అందక రోగులు నిస్సహాయస్థితిలో దిక్కులు చూస్తున్నారు. వైద్యం అందించాలని రోగులు, తమ డిమాండ్లు పరిష్కరించాలని వైద్యులు మంగళవారం వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. కాగా ఆదివారం దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తిరగబడ్డ రోగులు... మంగళవారం ఉదయం వైద్య చికిత్సల కోసం వివిధ ప్రాంతాల నుంచి గాంధీ ఓపీ విభాగానికి పెద్దసంఖ్యలో రోగులు వచ్చారు. ఓపీ చిట్టీలు ఇచ్చినా, వైద్యసేవలు అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణం వైద్యసేవలందించాలంటూ ఓపీ విభాగం ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైద్యులు ధర్నా చేస్తున్న ప్రదేశానికి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రోగుల మధ్య వాగ్వాదం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. వైద్యం అందక చిన్నారి మృతి... అడ్డగుట్టకు చెందిన రాజు, రేణుకలకు మూడు రోజుల క్రితం పాప పుట్టింది. మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం గాంధీకి వచ్చారు. మంగళవారం ఉదయం పాప మృతిచెందినట్లు చెప్పారని, సరైన వైద్యం అందకే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో బావురుమన్నారు. ఎస్మాలకు భయపడం... తమకు రక్షణ కల్పించేంతవరకు విధులకు హాజరయ్యేదిలేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ వైద్యులతో జరిపిన చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలని భావిస్తోందని చెప్పగా, తాము ఎస్మాలకు భయపడేదిలేదని, డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగుతుందని వైద్యులు స్పష్టం చేశారు. -
వైద్యం షురూ
- ఆందోళన విరమించిన ప్రైవేటు వైద్యులు - జోక్యం చేసుకున్న ఐఎంఏ రాష్ట్రం సంఘం - వైద్యుల సమ్మెపై కలెక్టర్ అసహనం - మృతుల కుటుంబాలను ఎవరు ఓదారుస్తారని ప్రశ్న - వైద్య సహాయం అందక జిల్లాలో మొత్తం ముగ్గురు మృతి నిజామాబాద్ అర్బన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు జిల్లాలో ప్రైవేటు వైద్యులు బుధవారం ఆందోళన విరమించారు. ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నాలుగు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందక జిల్లాలో ముగ్గురు మరణించారు. మరోవైపు వైద్యుల తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమయ్యింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైద్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరిణామాలు తీవ్ర మవుతుండడంతో ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ రాష్ట్ర సంఘం జోక్యం చేసుకుంది. ఆస్పత్రులను మూసివేసి వెద్య సేవలు బంద్ చేయడం సమంజసం కాదని ఐఎంఏ జిల్లా నేతలకు హితవు పలికింది. తర్జనభర్జన అనంతరం వైద్యులు తమ ఆందోళనను విరమించి వైద్యసేవలను ప్రారంభించారు. అంతకు ముందు వైద్యులు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కలిసి ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెద్యులు ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను నిలిపివేసిన తీరుపై తీవ్రంగా నిరసించారు. ‘‘మీ ఆందోళన వల్ల వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఎవరిది బాధ్యత. వారి కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చుతారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఆ తర్వాతే మాట్లాడండి’’ అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ‘‘మీ వల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాలు. ఆందోళన విరమించి ఆస్పత్రులు తెరవండి’’ అని సూచించారు. ఐఎంఏ జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు అప్పారావు, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి. వీఎస్.రావు, బాపురెడ్డి, అశోక్‌రెడ్డి కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఆస్పత్రులపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించారు. దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పినా వైద్యులు వినకుండా ఆస్పత్రులను బంద్ చేసి ఆందోళనకు దిగారన్నారు. ప్రైవేట్ వైద్యుల చర్య వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమ్మెకు వెళ్లేముందు మానవతా దృక్పథంతో ఆలోచించి ఉండాల్సిందని పేర్కొన్నారు. వైద్యుల మధ్య విభేదాలుకలెక్టర్ను కలిసి వెళ్లిన అనంతరం వైద్యులు ఐఎంఏ హాల్లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ర్ట, జిల్లా నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆస్పత్రులు మూసివేసి నిరసన తెలపడం సమంజసం కాదని, వెంటనే నిరసన విరమించాలని రాష్ట్ర నాయకుడు నీలి రాంచందర్ ఇతర వైద్యులను కోరారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను సమర్థించింది. దీనిని కొందరు వైద్యులు వ్యతిరేకించారు. దీంతో రాంచందర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. నిరసన వల్ల జిల్లా యంత్రాంగం, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుందని గమనించాలని కోరినా కొందరు వైద్యులు వినిపించుకోలేదు. అయితే ఎట్టకేలకు నిరసనను విరమించడానికి వైద్యులు అంగీకరించారు. ఇటు జిల్లా యంత్రాంగం, అటు పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చేసేదేమీలేక వైద్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వివాదం ఇలా మొదలైంది బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో మంగళవారం పూజ (20) అనే యువతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు మైరుగైన వైద్య సేవలు అందించలేదని ఆరోపిస్తూ ఆస్పత్రిపై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి జనరేటర్‌కు నిప్పు పెట్టారు. మరుసటి రోజే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొంబాయి నర్సింగ్ హోమ్‌లో అర్షమొలలకు చికిత్స పొందిన సుమలత అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఆమె బంధువులు ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటిచారు. దీంతో సంఘటితమైన వైద్యులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను బంద్ చేశారు. వీరికి మద్దతుగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సైతం ఒకరోజు వైద్య సేవలను నిలిపి వేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. జిల్లాలో సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ఓ బాలికతో పాటు ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
మాజీ మంత్రి అరెస్టుకు స్పీకర్ పచ్చజెండా
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ అరెస్టుకు అక్కడి అసెంబ్లీ స్పీకర్ ముబారక్ గుల్ తన ఆమోదం తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన అనుమతి మంజూరు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు కావడంతో పాటు, మాజీ మంత్రిని ఆదివారంలోగా అరెస్టు చేయని పక్షంలో అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఖాన్ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్టు చేయాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అందుకోసమే వారు జమ్ము కాశ్మీర్ స్పీకర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే అరెస్టుకు ఆమోదం తెలిపారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి గత శుక్రవారమే రాజీనామా చేశారు. -
'ఆ' మంత్రిని అరెస్టు చేయండి: వైద్యులు
మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ అక్కడి వైద్యులు భారీగా నిరసన ప్రదర్శన చేశారు. శ్రీనగర్ నగరంలోని అన్ని ఆస్పత్రులలోనూ తమ రోజువారీ విధులకు గైర్హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ వైద్యులు నినాదాలు చేస్తూ తమ తమ ఆస్పత్రుల వద్దే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించేవరకు తమ నిరసనలు ఆగేది లేదని కాశ్మీర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నిస్సారుల్ హసన్ తెలిపారు. తాము ఆస్పత్రులలో ఎమర్జెన్సీ వార్డులు, కాజువాలిటీ సర్వీసులను మాత్రమే కొనసాగిస్తున్నామని, ఆదివారంలోగా మంత్రిని అరెస్టు చేయకపోతే అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని హెచ్చరించారు.