మాజీ మంత్రి అరెస్టుకు స్పీకర్ పచ్చజెండా
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ అరెస్టుకు అక్కడి అసెంబ్లీ స్పీకర్ ముబారక్ గుల్ తన ఆమోదం తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన అనుమతి మంజూరు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు కావడంతో పాటు, మాజీ మంత్రిని ఆదివారంలోగా అరెస్టు చేయని పక్షంలో అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని కూడా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఖాన్ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్టు చేయాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అందుకోసమే వారు జమ్ము కాశ్మీర్ స్పీకర్ను సంప్రదించగా, ఆయన వెంటనే అరెస్టుకు ఆమోదం తెలిపారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి గత శుక్రవారమే రాజీనామా చేశారు.