మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ను వెంటనే అరెస్టు చేయాలంటూ అక్కడి వైద్యులు భారీగా నిరసన ప్రదర్శన చేశారు.
మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ను వెంటనే అరెస్టు చేయాలంటూ అక్కడి వైద్యులు భారీగా నిరసన ప్రదర్శన చేశారు. శ్రీనగర్ నగరంలోని అన్ని ఆస్పత్రులలోనూ తమ రోజువారీ విధులకు గైర్హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ వైద్యులు నినాదాలు చేస్తూ తమ తమ ఆస్పత్రుల వద్దే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించేవరకు తమ నిరసనలు ఆగేది లేదని కాశ్మీర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నిస్సారుల్ హసన్ తెలిపారు. తాము ఆస్పత్రులలో ఎమర్జెన్సీ వార్డులు, కాజువాలిటీ సర్వీసులను మాత్రమే కొనసాగిస్తున్నామని, ఆదివారంలోగా మంత్రిని అరెస్టు చేయకపోతే అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని హెచ్చరించారు.