రోగుల విలవిల
‘గాంధీ’లో కొనసాగుతున్నజూడాల సమ్మె
వెద్యం అందక 32 మంది మృతి
నిలిచిపోయిన 400 శస్త్ర చికిత్సలు
చికిత్స అందించాలని రోగుల ధర్నా
హైదరాబాద్: వైద్యుల సమ్మెతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించే వారే కరువయ్యారు. రెండు రోజులుగా వైద్య సదుపాయాలు నిలిచిపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. రెండురోజులుగా వైద్యులు సమ్మెబాట పట్టడంతో 400 శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు గాంధీ ఆస్పత్రిలో సుమారు 32 మంది మృతిచెందినట్లు తెలిసింది. మృతుల్లో మూడురోజుల పసికందు కూడా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్యవసర శస్త్రచికిత్సల కోసం వచ్చిన వారు ఇక్కడి పరిస్థితి చూసి బోరుమంటున్నారు. వైద్యం అందక రోగులు నిస్సహాయస్థితిలో దిక్కులు చూస్తున్నారు. వైద్యం అందించాలని రోగులు, తమ డిమాండ్లు పరిష్కరించాలని వైద్యులు మంగళవారం వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. కాగా ఆదివారం దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
తిరగబడ్డ రోగులు...
మంగళవారం ఉదయం వైద్య చికిత్సల కోసం వివిధ ప్రాంతాల నుంచి గాంధీ ఓపీ విభాగానికి పెద్దసంఖ్యలో రోగులు వచ్చారు. ఓపీ చిట్టీలు ఇచ్చినా, వైద్యసేవలు అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణం వైద్యసేవలందించాలంటూ ఓపీ విభాగం ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైద్యులు ధర్నా చేస్తున్న ప్రదేశానికి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రోగుల మధ్య వాగ్వాదం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
వైద్యం అందక చిన్నారి మృతి...
అడ్డగుట్టకు చెందిన రాజు, రేణుకలకు మూడు రోజుల క్రితం పాప పుట్టింది. మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం గాంధీకి వచ్చారు. మంగళవారం ఉదయం పాప మృతిచెందినట్లు చెప్పారని, సరైన వైద్యం అందకే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో బావురుమన్నారు.
ఎస్మాలకు భయపడం...
తమకు రక్షణ కల్పించేంతవరకు విధులకు హాజరయ్యేదిలేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ వైద్యులతో జరిపిన చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలని భావిస్తోందని చెప్పగా, తాము ఎస్మాలకు భయపడేదిలేదని, డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగుతుందని వైద్యులు స్పష్టం చేశారు.