‘గాంధీ’ వైద్యులపై దాడి | Patient Relatives Attack On Junior Doctors in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

‘గాంధీ’ వైద్యులపై దాడి

Published Thu, Sep 21 2017 3:32 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

‘గాంధీ’  వైద్యులపై దాడి

‘గాంధీ’ వైద్యులపై దాడి

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి..  
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జూడాలపై కుటుంబసభ్యుల దాడి
జూడాల ధర్నాతో 2 గంటలు నిలిచిన వైద్యసేవలు..


హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులపై మళ్లీ దాడి జరిగింది. దీంతో ముగ్గురు జూనియర్‌ డాక్టర్ల(జూడా)కు గాయాలయ్యాయి. దాడులకు నిరసనగా జూడాలు విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. ముషీరాబాద్‌ పార్శిగుట్ట బాపూజీనగర్‌కు చెందిన మహ్మద్‌ చున్నుమియా(70)కి గుండెనొప్పి రావడంతో  కుటుంబసభ్యులు మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికి వైద్యసేవలు వద్దంటూ రోగిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

వైద్యానికి రూ.5 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో మళ్లీ అతడిని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈసీజీ కోసం తరలిస్తుండగా చున్నుమియా మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ చున్ను మియా కుమారులు గౌస్, అజ్జు, మరికొందరు కలసి జూడాలపై చెప్పులతో దాడి చేశారు. ఓ వైద్యుడి ముక్కు నుంచి రక్తం రాగా, మరో వైద్యు నికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆర్‌ఎంవో సాల్మన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జూడాల ఆందోళన..
తమపై కొన్నేళ్లుగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు, ఆస్పత్రుల యాజమాన్యాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని 600 మంది జూడాలు ధర్నా చేశారు. రాష్ట్ర వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌కుమార్, గాంధీ యూనిట్‌ అధ్యక్షకార్యదర్శులు సిద్దిపేట రమేశ్, భూమేశ్‌కుమార్‌ జూడాలకు మద్దతు ప్రకటించారు. పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. వైద్యుల తప్పిదం లేదని మృతుడి కుమార్తె షాహిన్‌బేగం లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అనంతరం చున్నుమియా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

అర్ధంతరంగా ముగిసిన చర్చలు..
జూడాలు, టీజీజీడీఏ సంఘం నాయకులతో డీఎంఈ రమేశ్‌రెడ్డి సాగించిన చర్చలు అర్ధంతరం గా ముగిశాయి. డిమాండ్ల పరిష్కారానికి లిఖితపూర్వకంగా హామీ కావాలని జూడాలు పట్టుబట్టారు. బుధవారం సాయంత్రం 5 వరకు సాగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. గురువారం ఉదయం మరోమారు చర్చలు కొనసాగుతాయని, రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. జూడాలపై దాడి ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశామని గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టు అయినవారిలో మృతుడి కుమారులు గౌస్, అజ్జు, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement