attack on doctors
-
గాంధీలో వైద్యులపై దాడి
-
గాంధీలో జూనియర్ వైద్యులపై దాడి
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కరోనా రోగి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువు విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్లపై దాడికి దిగాడు. ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తి (55) కరోనా పాజిటివ్‌తో ఈనెల 6వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. కరోనాతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితున్ని ఎక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) విభాగంలో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రోగి బంధువు (30) పేషెంట్ కేర్ టేకర్‌గా అక్కడ ఉన్నాడు. ఈ క్రమంలో బాధిత రోగి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ రోగి బంధువు తీవ్ర ఆగ్రహంతో ఏఎంసీ విభాగంలోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, జూడాలు, హౌస్సర్జన్లు, నర్సింగ్ సిబ్బంది తీవ్ర భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అందుబాటులోఉన్న ఇనుప కుర్చీతో జూడాలపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్ వైద్యులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అవుట్‌పోస్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా విధులు నిర్వహిస్తున్న తమపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జూడాలు విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. అడిషనల్ సీపీ చౌహాన్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్‌లు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జూడాలతో వారు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని, అప్పటివరకు విధులకు హాజరయ్యేదిలేదని జూడాలు స్పష్టం చేశారు. -
ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్–19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు. కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. రూ. 15 వేల కోట్ల ప్యాకేజీ కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు. ‘ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ను విస్తరించాం. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. 13 లక్షల టెస్టింగ్ కిట్స్ కోసం ఆర్డర్ పెట్టాం’ అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతలో రాజీలేదు: మోదీ కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్పష్టం చేస్తుందన్నారు. ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు. -
మాపై దాడులా.. సిగ్గుచేటు
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడులకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైద్యులు స్వాగతించారు. కరోనా మహమ్మారిపై పోరులో ముందంజలో ఉండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. డాక్టర్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కాస్త ఊరట కలిగించే విషయమ’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి డాక్టర్ రవి మాలిక్ అన్నారు. అయితే దాడులకు భయపడబోమని, కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ సేవలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి విన్నవించారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ వాద్వా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘దాడులతో మేము కలత చెందాం. ఎన్ని దాడులు జరుగుతున్నా వైద్యులు తమ సేవలను మాత్రం ఆపలేదు. ఇటువంటి దాడులను నివారించేందుకు చట్టం కావాలని కోరుకున్నాం. ఎల్లప్పుడూ భయపడుతూ సేవలు అందించలేం కదా’ అని వాద్వా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. మొరదాబాద్‌లో వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన 17 మందిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టారని, మిగతా రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) కరోనా విజృంభణ నేపథ్యంలో తమ సేవలను ప్రధాని మోదీ గుర్తించడం పట్ల ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ హరీశ్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. వరుస దాడులు వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. దేశం తమ వెంటనే కరోనాపై విజయం సాధించి తీరుతామని ఆయన అన్నారు. తమకు చట్టబద్దమైన రక్షణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు హెం మంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు గురువారం తలపెట్టిన ఆందోళన విరమించారు. ఐఎంఏ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అమిత్ షా.. వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీయిచ్చారు. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం కీలక నిర్ణయం.. వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్ -
ప్రభుత్వానికి డాక్టర్ల హెచ్చరిక!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైనా ప్రాణాలను కాపాడే డాక్టర్లు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల డాక్టర్లపై , వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. దీన్ని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వైద్యలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరిస్తున్న కొందరిలో మార్పు రావడం లేదు. (గాంధీలో కరోనా మరణం.. వైద్యులపై బంధువుల దాడి) డాక్టర్లపై దాడులు చేస్తే చర్యలు తీసుకొనే చట్టాన్ని ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని భావించిన ఐయమ్ఏ ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఏప్రిల్ 23 వతేదీనీ బ్లాక్‌డే గా ప్రకటిస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులు ఇచ్చింది. ‘మాకు సురక్షితమైన పని ప్రదేశాలు కావాలి. మనపై జరుగుతున్న దాడులు, హింస వెంటనే ఆపేయాలి. ముందస్తు హెచ్చరికగా వైద్యులు అందరూ ఏప్రిల్ 22 వతేదీ రాత్రి 9 గంటలకు మా పై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా క్యాండెల్ను వెలిగిస్తారు ’ అని ఐయమ్ఏ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన, సామాజిక దూరం విషయంలో పాటించాల్సిన నియమాలు, వైద్యలపై జరుతున్న దాడుల గురించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా కేంద్రం ఆరుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. (జమాత్ సభ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి) -
జమాత్ సభ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి
సాక్షి, న్యూ ఢిల్లీ: ప్రజల ప్రాణాలు రక్షించడమే తమ కర్తవ్యంగా వైద్యులు భయంకరమైన కరోనా శత్రువుతో పోరాడుతున్నారు. ఈ పోరాటానికి వారికి చేయెత్తి నమస్కరించాల్సింది పోయి కనీస సంస్కారం లేకుండా దాడులకు దిగుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. పైగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మూల కారణంగా భావిస్తున్న తబ్లిగి జమాత్ సభ్యులే ఈ దాడులకు దిగడం శోచనీయం. వీరి ఆగడాలపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్ ) ఘజియాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రంలో మహిళా నర్సుల ఎదుటే అర్ధనగ్నంగా తిరుగుతూ, అసభ్య పదజాలాన్ని వాడుతూ అనుచితంగా ప్రవర్తించిన తబ్లిగి జమాత్ సభ్యులపై ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తబ్లిగి సభ్యులు ఉన్న కోవిడ్-19 వార్డులో మహిళా నర్సులు, మహిళా పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్యసిబ్బందిపై దాడి వంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కాగా ఓ వ్యక్తి వల్ల దేశ ప్రయోజనాలకుగానీ లేదా శాంతి భద్రతలకుగానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించినప్పుడు అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశం ఉంటుంది. (డాక్టర్లపై ఉమ్మివేసినవారి అరెస్ట్) (కదిలిస్తే కన్నీళ్లే!) -
వైద్యుల పై దాడి చేస్తే కఠిన చర్యలు
-
గాంధీలో కరోనా మరణం.. వైద్యులపై బంధువుల దాడి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల కరోనా బాధితుడు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. అయితే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కరోనా వార్డులోకి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. అయితే సీపీ అంజనీకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితని చక్కదిద్దారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, నిర్మల్ పట్టణానికి చెందిన అన్నదమ్ముళ్లు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరు కూడా ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే చికిత్స పొందుతూ ఓ వ్యక్తి నేడు మరణించాడు. సోదరుడి మృతితో ఆగ్రహానికి లోనైన మరో వ్యక్తి వైద్యులపై దాడికి దిగాడు. ఈ ఘటనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో వైద్యులపై దాడి సరికాదని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన మంత్రిని కోరారు. వైద్యులపై దాడిని ఖండించిన ఈటల గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులో క్షమించబోమని స్పష్టం చేశారు. దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే వారిని కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ కష్ట కాలంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి డాక్టర్‌కు రక్షణ కల్పిస్తామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. చదవండి : సిద్దిపేటలో తొలి కరోనా కేసు -
హైదరాబాద్ నిమ్స్‌లో అర్ధరాత్రి అలజడి
-
‘గాంధీ’ వైద్యులపై దాడి
► చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి.. ► వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జూడాలపై కుటుంబసభ్యుల దాడి ► జూడాల ధర్నాతో 2 గంటలు నిలిచిన వైద్యసేవలు.. హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులపై మళ్లీ దాడి జరిగింది. దీంతో ముగ్గురు జూనియర్ డాక్టర్ల(జూడా)కు గాయాలయ్యాయి. దాడులకు నిరసనగా జూడాలు విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. ముషీరాబాద్ పార్శిగుట్ట బాపూజీనగర్‌కు చెందిన మహ్మద్ చున్నుమియా(70)కి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికి వైద్యసేవలు వద్దంటూ రోగిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యానికి రూ.5 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో మళ్లీ అతడిని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈసీజీ కోసం తరలిస్తుండగా చున్నుమియా మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ చున్ను మియా కుమారులు గౌస్, అజ్జు, మరికొందరు కలసి జూడాలపై చెప్పులతో దాడి చేశారు. ఓ వైద్యుడి ముక్కు నుంచి రక్తం రాగా, మరో వైద్యు నికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆర్ఎంవో సాల్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూడాల ఆందోళన.. తమపై కొన్నేళ్లుగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు, ఆస్పత్రుల యాజమాన్యాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని 600 మంది జూడాలు ధర్నా చేశారు. రాష్ట్ర వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌కుమార్, గాంధీ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు సిద్దిపేట రమేశ్, భూమేశ్‌కుమార్ జూడాలకు మద్దతు ప్రకటించారు. పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. వైద్యుల తప్పిదం లేదని మృతుడి కుమార్తె షాహిన్‌బేగం లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అనంతరం చున్నుమియా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అర్ధంతరంగా ముగిసిన చర్చలు.. జూడాలు, టీజీజీడీఏ సంఘం నాయకులతో డీఎంఈ రమేశ్‌రెడ్డి సాగించిన చర్చలు అర్ధంతరం గా ముగిశాయి. డిమాండ్ల పరిష్కారానికి లిఖితపూర్వకంగా హామీ కావాలని జూడాలు పట్టుబట్టారు. బుధవారం సాయంత్రం 5 వరకు సాగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. గురువారం ఉదయం మరోమారు చర్చలు కొనసాగుతాయని, రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. జూడాలపై దాడి ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టు అయినవారిలో మృతుడి కుమారులు గౌస్, అజ్జు, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు.