దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కరోనా రోగి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువు విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్లపై దాడికి దిగాడు. ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తి (55) కరోనా పాజిటివ్‌తో ఈనెల 6వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. కరోనాతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితున్ని ఎక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) విభాగంలో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రోగి బంధువు (30) పేషెంట్ కేర్ టేకర్‌గా అక్కడ ఉన్నాడు. ఈ క్రమంలో బాధిత రోగి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందాడు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ రోగి బంధువు తీవ్ర ఆగ్రహంతో ఏఎంసీ విభాగంలోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశాడు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, జూడాలు, హౌస్‌సర్జన్లు, నర్సింగ్ సిబ్బంది తీవ్ర భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అందుబాటులోఉన్న ఇనుప కుర్చీతో జూడాలపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్ వైద్యులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అవుట్‌పోస్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా విధులు నిర్వహిస్తున్న తమపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జూడాలు విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. అడిషనల్ సీపీ చౌహాన్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్‌లు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జూడాలతో వారు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు స్పందించి తమకు న్యాయం చేయాలని, అప్పటివరకు విధులకు హాజరయ్యేదిలేదని జూడాలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment