న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడులకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైద్యులు స్వాగతించారు. కరోనా మహమ్మారిపై పోరులో ముందంజలో ఉండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
‘ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. డాక్టర్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కాస్త ఊరట కలిగించే విషయమ’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి డాక్టర్ రవి మాలిక్ అన్నారు. అయితే దాడులకు భయపడబోమని, కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ సేవలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి విన్నవించారు.
ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ వాద్వా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘దాడులతో మేము కలత చెందాం. ఎన్ని దాడులు జరుగుతున్నా వైద్యులు తమ సేవలను మాత్రం ఆపలేదు. ఇటువంటి దాడులను నివారించేందుకు చట్టం కావాలని కోరుకున్నాం. ఎల్లప్పుడూ భయపడుతూ సేవలు అందించలేం కదా’ అని వాద్వా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. మొరదాబాద్‌లో వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన 17 మందిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టారని, మిగతా రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది)
కరోనా విజృంభణ నేపథ్యంలో తమ సేవలను ప్రధాని మోదీ గుర్తించడం పట్ల ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ హరీశ్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. వరుస దాడులు వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. దేశం తమ వెంటనే కరోనాపై విజయం సాధించి తీరుతామని ఆయన అన్నారు. తమకు చట్టబద్దమైన రక్షణ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు హెం మంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు గురువారం తలపెట్టిన ఆందోళన విరమించారు. ఐఎంఏ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అమిత్ షా.. వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీయిచ్చారు. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment