కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.
నేటి విచారణకు హాజరు కండి
బుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్‌జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు
సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.
సందీప్ ఘోష్ కస్టడీ పొడిగింపు
ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ, సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment