
ఒక వ్యక్తి కడుపులో నుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 639 మేకులను వైద్యులు రాబట్టారు.. తీరా ఇంతటి ఘనకార్యానికి ఎందుకు ఒడిగట్టాడో అని ఆరా తీస్తే సదరు వ్యక్తి ఒక మానసిక రోగి అని తేలింది. మానసిక సమస్యతో బాధపడుతూ తాను ఎందుకు తింటున్నానో అనే విషయం కూడా తెలీకుండా వాటిని కడుపులో వేసుకున్నాడని వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గోబర్డంగా గ్రామానికి చెందిన 48 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. కడుపు నొప్పి కారణాలను కనుగొనేందుకు వైద్యులు అతనికి అన్ని రకాల పరీక్షలు జరిపారు. వైద్య పరీక్షల రిపోర్టులు చూసిన వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో మట్టి, మేకుల్లాంటివి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు.
వెంటనే అతనికి శస్త్రచికిత్స చేసి ఏకంగా 639 మేకులు బయటకు తీశారు. వాటి బరువు దాదాపు కిలో కంటే ఎక్కువే ఉందట. ఇందుకోసం దాదాపు రెండు గంటలపాటు వైద్యులు కష్టపడాల్సి వచ్చింది. కడుపు దగ్గర 10 సెంటీమీటర్ల పొడవుతో చిన్న గాటు పెట్టి అయస్కాంతం సాయంతో వాటిని బయటకు తీశామని కోల్‌కతా మెడికల్ కళాశాల వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగికి ప్రాణహాని లేదని చెప్పారు. అయితే షిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో సదరు వ్యక్తి బాధపడుతున్నాడని, దాని కారణంగానే మేకులు, మట్టి తిన్నాడని అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు తెలిపారు. బాధితుడు పూర్తిగా కోలుకున్న తర్వాత మానసిక వ్యాధికి కూడా చికిత్స అవసరముంటుందని చెప్పారు.