కోల్‌కతా: కోల్‌కత ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు.
తాజాగా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది డాక్టర్లపై ఆర్టీ కర్ హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ బహిష్కరణ వేటు వేసింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు, ర్యాగింగ్, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సదరు డాక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని సమిష్టిగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్‌లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటుపడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సీబీఐ అరెస్టు చేసిన), అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు. ఈ డాక్టర్లు తమ హాస్టల్‌ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు.
మరోవైపు.. బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను సమీక్షించవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment