expels
-
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ
కోల్‌కతా: కోల్‌కత ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది డాక్టర్లపై ఆర్టీ కర్ హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ బహిష్కరణ వేటు వేసింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు, ర్యాగింగ్, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సదరు డాక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని సమిష్టిగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటుపడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సీబీఐ అరెస్టు చేసిన), అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు. ఈ డాక్టర్లు తమ హాస్టల్‌ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. మరోవైపు.. బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను సమీక్షించవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ -
ఇరాన్ రాయబారిని బహిష్కరించిన పాక్
ఇస్లామాబాద్: ఇరాన్ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఇరాన్ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఇరాన్ వ్యవహరించింది. మంగళవారం రాత్రి మా వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘించింది’ అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాక్‌పై వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఇరాన్ పాకిస్థాన్‌పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే స్వతంత్ర బలూచిస్థాన్‌ను డిమాండ్ చేస్తున్న జైషే అల్ అదిల్ ఉగ్రవాదులు లక్ష్యంగానే తాము డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. పాక్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు పెరగడం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇదీచదవండి.. థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి -
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ!
లఖ్‌నవూ: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాంపుర్ సదర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే నవాబ్ కాజిమ్ అలి ఖాన్‌పై వేటు వేసినట్లు యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ‘రాంపుర్ బైపోల్లో బీజేపీ అభ్యర్థికి మీరు మద్దతుగా నిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా మిమ్మల్ని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం.’అని పేర్కొన్న లేఖను మాజీ ఎమ్మెల్యే నవాజ్ కాజిమ్ అలి ఖాన్‌కు పంపించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్ కిషోర్ శుక్లా. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ శాసనసభ్యత్వం రద్దయిన క్రమంలో.. రాంపుర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప అనివార్యమైంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాంపుర్ సదర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఖాన్.. ఓడిపోయారు. 2016లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీ చదవండి: పోలీసులకు ఎదురుపడిన క్రిమినల్స్.. సినిమాను తలపించిన సీన్..! -
వీడియో వైరల్.. విద్యార్థినుల బహిష్కరణ
చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఓ కాలేజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. కాలేజ్ నుంచి వారిని బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు విద్యార్థినులు, వారి స్నేహితులతో కలిసి ఆరు వారాల కిందట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అబ్బాయిలతో పాటు వారు కూడా మద్యం సేవించారు. విద్యార్థినులు బీర్ తాగుతున్న దృశ్యాలను అందులోని ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం డిసెంబర్ 24వ తేదీన కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్ ప్రిన్సిపల్.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్‌కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు అంతకన్నా తక్కువగా ఉంది. -
పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత సోదరుడిపైనే వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తన సోదరుడు ఒ రాజాను బహిష్కరించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా స్థానిక పాల సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ ఉల్లఘించినందుకు రాజాను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించామని.. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేశామని వెల్లడించారు. ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. థేని జిల్లాలోని పెరియకులం పంచాయతీ సర్పంచ్‌గా గతంలో రాజా పనిచేశారు. పన్నీరు సెల్వంకు ఇష్టం లేకపోయినా ఇటీవల జరిగిన మధురైలోని ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరోవైపు తనను కాదని కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారని పన్నీరు సెల్వంపై రాజా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై...
అలిగర్ : యూరీ ఆర్మీ బేస్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిపై అభ్యంతరకర కామెంట్లను ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఓ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. అలిగర్ ముస్లి యూనివర్సిటీ(ఏఎంయూ)లో ఆర్గనిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్‌ను అభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థుడు ముదాస్సర్ యూసఫ్ యూరీ ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఎంయూ వైస్ ఛాన్సరల్ లెప్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, ఆ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జాతివ్యతిరేకంగా ఎలాంటి అసహన ఘటనలు తావెత్తకుండా ఉండేందుకు లిప్టినెంట్ జనరల్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సెంటిమెంట్లను దెబ్బతీసేవిధంగా ఈ కామెంట్లను పోస్టు చేసినందుకు వైస్ చాన్సలర్‌కు ముదాస్సర్ యూసఫ్ ఆదివారమే క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ ఈ విషయం చాలా సున్నితమైనది కారణంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ విద్యార్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్‌కు బీజేపీ లోక్‌సభ సభ్యులు లేఖ రాశారు. ఆదివారం వేకువ జామున కశ్మీర్‌లోని యూరీ బేస్ క్యాంపుపై జరిగిన ఈ దాడిలో 18 మంది భారత సైన్యం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్‌తో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులో వదిలేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీచేసింది. -
పిలక ఉందని ఎల్కేజీ విద్యార్ధికి ఉద్వాసన
కార్పొరేట్ పాఠశాలల్లో పెట్టే నిబంధనలకు అర్థం పర్థం లేకుండా పోతోంది. ఇంగ్లీషులో మాట్లాడలేదని పంపేయడం లాంటి ఘటనలు ఇంతకుముందు చూశాం. కానీ, పిలక ఉందన్న కారణంగా ఎల్కేజీ చదివే పిల్లాడిని స్కూలు నుంచి తొలగించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సెయింట్ విన్సెంట్ పల్లొంట్టి స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మూడున్నరేళ్ల విష్ణును ఇంటికి తీసుకెళ్లేందుకు వాళ్ల తండ్రి మంజునాథ్ స్కూలుకు వచ్చారు. ప్రిన్సిపాల్ పాల్ డిసౌజా ఆయనను పిలిపించి, పిల్లల్ని ఇలా పిలకతో పంపకూడదని.. పిలక కట్ చేస్తేనే అతన్ని పాఠశాలలో కొనసాగనిస్తామని చెప్పారు. బాబుకు ఐదేళ్లు వచ్చేవరకు తల వెంట్రుకలు తీయరాదని, ఇది తమ కుటుంబ ఆచారమని మంజునాథ్ ప్రిన్సిపల్‌కు తెలిపారు. అయితే అలాంటి మూఢనమ్మకాలను తాము అంగీకరించబోమని ప్రిన్సిపల్ మొండిగా మాట్లాడి పిల్లాడిని పాఠశాల నుంచి పంపేశారు. అడ్మిషన్ సమయంలో తాను చెల్లించిన డొనేషన్ తిరిగి ఇచ్చారని మంజునాథ్ తెలిపారు. అయితే.. ఇప్పటికే అన్ని స్కూల్లోల అడ్మిషన్లు పూర్తయిపోయాయని, ఇక తమ పిల్లాడిని వచ్చే విద్యాసంవత్సరంలోనే స్కూలుకు పంపాల్సి ఉంటుందని మంజునాథ్ తెలిపారు. ఈ విషయంపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, వస్తే పాఠశాలపై చర్య తీసుకుంటామని ప్రాథమిక విద్య డైరెక్టర్ కె.ఆనంద్ తెలిపారు. -
మూడ్రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా
హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుకు గురైన ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా బొత్స సత్యనారాయణ తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బొత్సను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ వేటు
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ పీసీసీకి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మరో వ్యూహానికి తెర తీసింది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్‌లను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతోయూపీఏ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నే సాకుగా చూపించి ఇప్పుడు ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. ఒకవేళ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు వీళ్లు తమ ఎంపీలు కారని, వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకోడానికి వీలుంటుందన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దల వ్యూహంలా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు కట్టడి చేయలేకపోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని అంటూనే వివిధ షరతులు పెడుతోంది. అయితే, సొంత పార్టీ వాళ్లనే కట్టడి చేయలేరా, అవసరమైతే వాళ్లను సస్పెండ్ చేయండి అంటూ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసు పార్టీకి ఒక పరిష్కారం దొరికినట్లయింది. మొదట్లో సభ్యులపై చర్యలు తీసుకోవద్దన్న బీజేపీయే ఇప్పుడు మార్గం చూపించిందని సంతోషిస్తూ, ముందుగా పార్టీ నుంచి సస్పెన్షన్ కాకుండా ఏకంగా బహిష్కరించేసి చేతులు దులుపుకుంది. రేపో మాపో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వస్తే, అప్పుడు సీమాంధ్ర ఎంపీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎటూ చేస్తారు కాబట్టి, అప్పుడు సభ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయించొచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.