న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్(AAP) ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.
‘ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. తమ కార్యకర్తల చేత కుర్చీలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాల్ నగర్ లో నిన్న(ఆదివారం) కుర్చీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఆప్ నేతలే పని. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు ఆప్ నేతలు. ఇది కేజ్రీవాల్.. ఆప్ కార్యకర్తల చేత చాలా తెలివిగా చేయిస్తున్నారు. ఒక ట్రాలీలో కుర్చీలను తీసుకెళ్తున్న వ్యక్తి వాటిని పంపిణీ చేస్తున్నాడు. ఆ కార్యకర్త కేజ్రీవాల్ పంపిన కార్యకర్తే’ అని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సైతం జత చేశారు. వెంటనే కేజ్రీవాల్‌పైఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వారికి భూములివ్వండి.. నగరానికి వారే బ్యాక్‌బోన్
కాగా, వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.
ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్‌డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్‌బోన్
వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment