తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది.
గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్ దేవ్ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా, రామ్ దేవ్ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment