Baba Ramdev Baba
-
చిక్కుల్లో బాబా రామ్‌దేవ్
తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్ దేవ్ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, రామ్ దేవ్ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
వివాదంలో యోగ గురువు రాందేవ్ బాబా
-
బాబా రాందేవ్ పై సీపీఐ నారాయణ ఫైర్
-
‘అద్భుతం మహా అద్భుతం’ ,హిమాలయాల్లో అరుదైన మూలికలు
హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు. ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్‌తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. -
ఎఫ్‌పీవోలో రాందేవ్‌బాబా ప్రభంజనం!.. రంగంలోకి దిగిన మోసగాళ్లు?
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగంగా 2019లో వేలానికి వచ్చిన రుచి సోయాను బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ రూ. 4,350 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రుచి సోయా బ్రాండ్‌పై పతంజలి తనదైన ముద్రను వేయగలిగింది. తాజాగా రుచి సోయా బ్రాండ్ విస్తరణలో భాగంగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది రుచి సోయా. ఫుల్ డిమాండ్ దాదాపు రూ. 4,300 కోట్లు సమీకరించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ తలపెట్టిన ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) మార్చి 24న ప్రారంభమైంది. ఈ ఎఫ్‌పీవో రికార్డు స్థాయింలో 3.60 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1,290 కోట్లు సమీకరించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం 4.89 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 17.60 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) కోటా 2.20 రెట్లు, సంస్థగతయేతర ఇన్వెస్టర్ల కోటా 11.75 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 90 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీవో కింద షేరు ధర శ్రేణి రూ. 615–650గా ఉంది. ఏమార్చే ప్రయత్నం పతంజలి బ్రాండ్‌కు ఉన్న విలువ, బాబారాందేవ్ మీద నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రుచి సోయా షేర్లను మార్కెట్ ధరకే తక్కువగా దాదాపు 30 శాతం డిస్కౌంట్‌తో అందిస్తామంటూ పర్సనల్ నంబర్లకు, సోషల్ మీడియాలో మెసేజ్‌లు భారీ ఎత్తున తిరుగుతున్నాయి. ఈ షేర్లు సొంతం చేసుకోవాలంటే మీ యూపీఐ, బ్యాంక్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, బ్రోకర్ ద్వారా దరఖాస్తు చేసుకోండంటూ ఆయా మెసేజ్‌లలో కోరుతున్నారు. హరిద్వార్‌లో ఫిర్యాదు డిస్కౌంట్ ధరకే రుచి సోయా షేర్లు అందిస్తామంటూ చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లపై పతంజలి గ్రూపు స్పందించింది. డిస్కౌంట్ ధరలో రుచి సోయా షేర్ల పేరుతో వస్తున్న మెసేజ్‌కి పతంజలి గ్రూపు డైరెక్టర్లు, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌కి సంబంధం లేదని.. ఈ ఫేక్ మెసేజ్‌లపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని కోరింది పతంజలి గ్రూపు. ఈ మేరకు 2022 మార్చి 27న హరిద్వార్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 0188 నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్రమత్తమైన సెబీ రుచి సోయా పేరుతో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తమైంది. ఫేక్ మెసేజ్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పత్రికా ప్రకటనలు ఇవ్వాలంటూ రుచి సోయా ప్రమోటర్లకు సెబీ సూచించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ఎఫ్‌పీవోలో ఈ షేర్ల కొనుగోలు విషయంలో పునరాలోచన చేసుకునే అవకాశాన్నివ ఇన్వెస్టర్లకు కల్పించింది. బంపర్ హిట్ మంగళవారం మార్కెట్లో రుచి సోయా షేరు ధర దూసుకుపోయింది. ఉదయం 11 గంటల సమయంలో 102 పాయింట్లు లాభపడి 915 దగ్గర ట్రేడవుతోంది. -
కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్
యోగా గురువు రామ్‌దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. ఈ షేర్లు కొనండి కరోడ్‌పతి కండి ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్‌దేవ్ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. సెబీ సీరియస్ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్‌కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్‌పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్‌దేవ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్ అయ్యింది. దీనిపై రామ్‌దేవ్ బాబాను వివరణ కోరింది. సోయా రుచికి నోటీసులు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్‌గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్‌పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్‌పీవోకి మర్చంట్‌బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. లభించని వీడియో కరోడ్‌పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! -
పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్
లండన్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్‌లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యంలేదని వెల్లడైంది. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేదీ అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ వెల్లడించారు. యూకేలో పతంజలి స్వసారి–కరోనిల్ కిట్ల విక్రయానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) స్పష్టం చేసింది. అనుమతి లేని ఔషధాలు, వైద్య ఉత్పత్తులను యూకే మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాబా రాందేవ్ జూన్ 23న కరోనిల్ కిట్లను విడుదల చేశారు. -
శ్రీరాముడు ముస్లింలకూ ఆరాధ్యుడే
న్యూఢిల్లీ/బెంగళూరు: మన దేశంలోని ముస్లింలలో 99 శాతం మంది ఆ మతం స్వీకరించిన వారేనని, అందుకే ముస్లింలలో కూడా శ్రీరాముడిని ఆరాధించే వారు ఉన్నారని యోగా గురు రాందేవ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ మాట్లాడారు. ‘శ్రీరాముడు హిందువులకు మాత్రమే కాదు, ముస్లింలకూ ఆరాధ్యుడే. భారత్‌లోని ముస్లింలలో 99 శాతం మంది ఆ మతంలోకి మారిన వారే’అని అన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సానుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జాతి ఐక్యత కోణంలో చూడాల్సి ఉంది. శ్రీరాముని గుడి ప్రపంచంలోనే అత్యంత సుందరమైందిగా ఉండాలనేది ప్రతి హిందువు కల. కేథలిక్కులకు వాటికన్, ముస్లింలకు మక్కా, సిక్కులకు స్వర్ణ దేవాలయం మాదిరిగా హిందువులకు అయోధ్య తీర్థయాత్రాస్థలి కావాలి. అయోధ్య తీర్పు అనంతరం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతాయని కొందరు అపోహలు సృష్టించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. తీర్పు తర్వాత ఎలాంటి గొడవలు తలెత్తలేదు. భారత్ ఎంతో పరిణతి సాధించింది’ అని అన్నారు. -
ఆధ్యాత్మికం @ ఆన్లైన్!
న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్ టెక్నాలజీస్ లాంటివి ఈ కోవకు చెందినవే. భారత్‌లో మతపరమైన, ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన మార్కెట్ పరిమాణం 30 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. షేర్‌చాట్ లాంటి సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫాంపై 25 మంది పైగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో యోగా గురు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. షేర్‌చాట్ త్వరలో మరింత మందిని తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చిన్న ఆలయాలు, స్వామీజీలతో టైఅప్.. కొత్తగా 20–25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఆధ్యాత్మిక సేవల సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులు, భక్తులను అనుసంధానం చేసే పనిలో ఉన్నాయని మైమందిర్ పోర్టల్‌లో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థ భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ తెలిపారు. ఆన్లైన్లో ఆధ్యాత్మిక గురువుల ఆధారిత కమ్యూనిటీలను తయారు చేయడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. సాధారణంగా కాస్త ఆర్థిక సామర్ధ్యం ఉన్న ఆధ్యాత్మిక గురువులు .. తమ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడే టెక్నాలజీలపై సొంతంగానే నిధులు వెచ్చించుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఆధ్యాత్మిక గురువుకు, ఆలయం, ప్రార్థనామందిరాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో ఓ పేజీ ఉంటోంది. దీంతో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా కాస్త పేరొందిన చిన్న స్థాయి ఆలయాలు, స్థానిక ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలపై ఆధ్యాత్మిక పోర్టల్స్ దృష్టి సారిస్తున్నాయి. పండుగలు, జ్యోతిష్యం వివరాలు కూడా... ‘మేం కాస్త చిన్న స్థాయి గురువులు, ఆలయాలను .. వాటి కంటెంట్‌ను ఇప్పుడు మా ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి తెస్తున్నాం‘ అని ఆర్‌జ్ఞాన్ సహ వ్యవస్థాపకుడు ఉమేష్ ఖత్రి తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి గలవారికి ఈ వెబ్సైట్ ఒక .. ఇన్స్ట్రాగాంలాంటిది. ఆర్‌జ్ఞాన్, మైమందిర్లకు ప్రతి నెలా చెరో అయిదు లక్షల మంది దాకా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరు మతపరమైన కంటెంట్, తమ ఇష్ట దేవతలు.. గురువుల ఫొటోలు, వీడియోలు వీటిలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సైట్లు.. పండుగలు, హిందు క్యాలెండర్లు, జ్యోతిష్యం మొదలైన అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని కూడా యూజర్లకు పంపిస్తుంటాయి. తమ ప్లాట్‌ఫాంపై నాణ్యమైన కంటెంట్ అందించేందుకు కాల్పనిక్ టెక్నాలజీస్ నేరుగా ఆలయాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కాల్పనిక్ టెక్నాలజీస్ దగ్గర 230 ఆలయాలకు సంబంధించిన లైవ్, రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 50 మంది గురువులు, 500 ఆలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించుకుంది. మారుతున్న అభిరుచులు... మతపరమైన, ఆధ్యాత్మికమైన కంటెంట్ విషయంలో భారతీయుల ధోరణులు మారుతున్నాయి. గత మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మందికి తొలిసారిగా సోషల్ నెట్వర్క్ సైట్లు పరిచయమవుతున్నాయి. నగరాల్లో ఉండే వారితో పోలిస్తే ఇలాంటి చిన్న పట్టణాలు, గ్రామాల వారి కంటెంట్ వినియోగ ధోరణుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ‘భారతీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ధోరణులు మారుతున్నాయి. చాలా మంది గుళ్లకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం, వాటిని ఫేస్‌బుక్‌లాంటి వాటిల్లో పోస్ట్ చేయడంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ అవసరమన్న అభిప్రాయం నెలకొంది‘ అని మైమందిర్ వ్యవస్థాపకుడు రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ఇటు భక్తులు, అటు ఆలయం కోణంలో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో విస్తరించని మార్కెట్‌పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులకు లక్షల కొద్దీ సంఖ్యలో భక్తులు ఉంటున్నారు. పాత తరం వారితో పాటు టెక్నాలజీ విపరీతంగా వాడే కొత్త తరం యువత కూడా వీరిలో ఉంటున్నారు. వీరికి ఆశ్రమాలకు వెళ్లేంత సమయం దొరక్కపోవడంతో ఆయా గురువుల ప్రవచనాలను ఆన్లైన్లో వినడానికి మొగ్గుచూపుతున్నారని కాల్పనిక్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశ్వనీ గర్గ్ చెప్పారు. -
మూడో బిడ్డ పుడితే పథకాలు వద్దు
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు. హరిద్వార్‌లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు. -
ముస్లింలు రాముని వారసులే: రాందేవ్
అహ్మదాబాద్: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు ముస్లింలకు కూడా పూర్వీకుడేనని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. శుక్రవారం ఖేడా జిల్లా నడియడ్‌లోని యోగ శిబిరంలో రాందేవ్ మాట్లాడారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నిర్మించాలని గట్టిగా కోరుతున్నా. అయోధ్యలో కాకుంటే మరెక్కడ నిర్మించాలి? దానిని మక్కా, మదీనా లేదా వాటికన్ సిటీలో నిర్మించలేము’ అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘హిందువులకు మాత్రమే కాదు, శ్రీరాముడు ముస్లింలకూ పూర్వీకుడే. రామాలయ నిర్మాణం జాతికి గర్వ కారణమైన విషయం’ అని పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
తర్వాతి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమే!
మదురై: ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తర్వాతి ప్రధాన మంత్రి ఎవరనేది చెప్పడం కొంచెం కష్టమే అని యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. రామేశ్వరంలో జరుగుతున్న భారత్ స్వాభిమాన్ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మంగళవారం మదురై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారని చెప్పడం కష్టమన్నారు. ‘మాకు ఎలాంటి రాజకీయ లేదా మతతత్వ ఎజెండా లేదు. మేము ఆధ్యాత్మిక భారతాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకుంటున్నాం. భారతదేశాన్ని హిందూ దేశంగా లేదా మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు’ అని అన్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకపోతే బీజేపీ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోతుందని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడిపై మాట్లాడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, భారత్‌ను మతపరమైన అసహ న దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని బాబా మండిపడ్డారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుల హత్యల కంటే గో హత్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నసీరుద్దీన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
ధరలను తగ్గించకుంటే మోదీకి కష్టమే
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆదివారం హెచ్చరించారు. 2014లో మాదిరి వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా, బీజీపీ తరఫున తాను ప్రచారం చేయననీ స్పష్టం చేశారు. అయితే అన్ని పార్టీలూ తనకు సమానమేననీ, రాజకీయాల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ‘మోదీ ప్రభుత్వ విధానాలను ఎందరో పొగుడుతున్నారు. కానీ వాటిలో కొన్నింటికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదల ప్రధాన సమస్య. నియంత్రణ చర్యలకు ఉపక్రమించకపోతే మోదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని రామ్‌దేవ్ అన్నారు. -
రాందేవ్ పుస్తకంపై నిషేధం ఎత్తివేతకు నో
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ జీవితంపై వచ్చిన ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకం అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రచురణ సంస్థ జగనాట్ పబ్లికేషన్స్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు సెప్టెంబర్‌కల్లా తుది నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జర్నలిస్ట్ ప్రియాంక పాఠక్ రాసిన ఈ పుస్తకంలో రాందేవ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన లాయర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను విచారించిన కోర్టు పుస్తకం అమ్మకాలపై ఏప్రిల్ 28న నిషేధం విధించింది. కానీ జగనాట్ సంస్థ మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఏఎస్‌సీజే) ఒకరు ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేశారు. దీంతో రాందేవ్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పుస్తకం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మే 10న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై జగనాట్ లాయర్లు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. -
కోటలో లక్ష మందితో...
కోట/జైపూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు రామ్‌దేవ్ సారథ్యంలో గురువారం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒకేసారి 1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్, కోట జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పాయి’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను సీఎం రాజే, రామ్‌దేవ్‌లకు అందజేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 6.30 నుంచి 7 గంటల వరకు 15 రకాల యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు కోటలోని ఆర్ఏసీ గ్రౌండ్‌కు తరలివచ్చారు. 2017లో మైసూర్లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించగా తాజాగా ఆ రికార్డును కోట అధిగమించింది. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ‘ఆచార్య’ పేరుతో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్లో రవిశంకర్ బెంగళూరు: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు. బెల్జియంలో భారత రాయబార కార్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, యూరోపియన్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఎంబసీ అధికారులు, 250 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ..నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలైన విద్వేషం, కుంగుబాటును యోగా మాదిరిగా మరే మార్గం పరిష్కరించలేదని అన్నారు. -
రాహుల్ గాంధీతో స్నేహం ఉంది: రాందేవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ ఉన్నతస్థాయి నేతలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఏబీపీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా ఈ వివరాలు వెల్లడించారు. యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ‘సోనియా, రాహుల్‌లు రోజూ యోగా చేస్తారు. రాహుల్‌తో నాకు స్నేహపూర్వక సం బంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్‌ను రాందేవ్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. అయితే, యూపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందున గ్రేటర్ నోయిడా నుంచి పతంజలి ఫుడ్, హెర్బల్ పార్క్‌ను తరలిస్తానంటూ హెచ్చరించిన కొద్ది రోజులకే రాహుల్‌ను ప్రశంసించారు. కాగా, 2011లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాందేవ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
‘డిస్కవరీ జీత్’లో బాబా రామ్‌దేవ్ చరిత్ర
న్యూఢిల్లీ: యోగా గురువుగా ప్రఖ్యాతిగాంచిన బాబా రామ్‌దేవ్ జీవిత చరిత్రపై డిస్కవరీ జీత్ చానెల్ రూపొందించిన ‘ స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్ ప్రసారాలు అదే చానెల్లో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 10న ఢిల్లీలో జరిగిన డిస్కవరీ జీత్ ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ఆచార్య బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌పై రూపొందించిన 60 నిమిషాల ప్రత్యేక వీడియోను ఆవిష్కరించారు. నిరుపేద రైతు రాంనివాస్ యాదవ్ కొడు కైన రామ్‌కిషన్(బాబా రామ్‌దేవ్ అసలు పేరు) 1965లో సొంతూరులో పడిన బాధల గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. చిన్ననాటి కష్టాలతోపాటు ఆరోగ్య సమస్యతో ఆచార్య బల్దేవ్ దగ్గర యోగా నేర్చుకుని అంచెలంచెలుగా బాబా రామ్దేవ్గా ఎదిగిన క్రమాన్ని ‘స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్‌లో చూపించనున్నారు. -
పతంజలి.. మరింత ‘క్లిక్’!!
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్ వంటి 8 ఈ–కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్ మంగళవారం చెప్పారు. ఆన్లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ’దివ్య జల్’ పేరిట బాటిల్డ్ వాటర్, ’పరిధాన్’ బ్రాండ్ కింద దుస్తులు, పాదరక్షలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు రాందేవ్ తెలిపారు. ‘సంప్రదాయ రిటైల్ మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించేందుకు ఆన్లైన్ ఉపయోగపడుతుంది. ఈ ఏడాది రూ.1,000 కోట్ల అమ్మకాల లక్ష్యం పెట్టుకున్నాం. సాధ్యపడితే అంతకు మించి కూడా చేయాలనుకుంటున్నాం‘ అని తెలియజేశారు. 2016–17లో పతంజలి ఆయుర్వేద్ టర్నోవరు రూ. 10,500 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు రెట్ల వృద్ధిని లకి‡్ష్యంచుకుంది. సొంత పోర్టల్‌తో డిసెంబర్లో రూ.10 కోట్లు .. ప్రయోగాత్మకంగా తమ సొంత పోర్టల్ ‘పతంజలిఆయుర్వేద్.నెట్’ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల శ్రేణిని ఆన్లైన్లో విక్రయిస్తున్నామని, డిసెంబర్ నెలలో ఏకంగా రూ.10 కోట్ల విక్రయాలు జరిగాయని, మిగతా ఏ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ కూడా ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు సాధించలేదని రామ్‌దేవ్ తెలియజేశారు. రిటైల్ స్టోర్స్ సంఖ్యను కూడా పెంచుకోనున్నట్లు చెప్పారాయన. గ్రామాల్లోని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అందుబాటు ధరల్లో మరిన్ని ఉత్పత్తులను చిన్న ప్యాక్‌లలో అందించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలియజేశారు. ‘ప్రస్తుతం 5,000 పైచిలుకు ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉండగా.. వీటిని ఇంకా పెంచుతాం. జనవరి 26న స్వదేశ్ సమృద్ధి పేరిట కొత్తగా లాయల్టీ కార్డును ప్రవేశపెడుతున్నాం‘ అని వెల్లడించారు. బీమా ప్రయోజనం కూడా (మరణం, అంగవైకల్యం) కల్పించే ఈ లాయల్టీ కార్డు ద్వారా అయిదు కోట్ల మందికి చేరువ కావాలని నిర్దేశించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులు 15–20 లక్షల కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయంటూ ఈ ఏడాది వీటిని 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 20వేల మంది నియామకం.. కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో 20,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నామని .. సేల్స్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ స్థాయి దాకా వివిధ హోదాల్లో ఈ పోస్టులుంటాయని రామ్‌దేవ్ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకుంటున్నట్లు చెప్పారు. ‘వార్షికంగా రూ. 50,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం మాకు ఉంది. ఎఫ్ఎంసీజీలో ఇదే అత్యధికం. హరిద్వార్, తేజ్‌పూర్, అసోమ్‌లలో ప్లాంట్లున్నాయి. అటు నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్లలో కూడా ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది‘ అని వివరించారు. ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే పతంజలి ఔషధాలు మాత్రమే నెట్‌మెడ్స్, 1ఎంజీ పోర్టల్స్‌లో లభ్యమవుతాయి. పతంజలి ఉత్పత్తులు ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ.. ప్రత్యేక డిస్కౌంట్లేమీ ఉండవు. రిటైల్ అవుట్‌లెట్స్‌కి ధరలపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎగుమతులు.. నాగ్‌పూర్‌లోని మిహా దగ్గర నిర్మిస్తున్న ఎగుమతి ఆధారిత ప్లాంటు అందుబాటులోకి వచ్చాక.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించనున్నట్లు రామ్‌దేవ్ తెలిపారు. యూఏఈ, అమెరికా, కెనడా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో పాటు పలు ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. పతంజలి ఇటీవలే పిల్లలు .. పెద్దల డైపర్స్, చౌక శానిటరీ నాప్కిన్స్ను కూడా ప్రవేశపెట్టింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. -
ఉగ్రవాది సయీద్‌తో రాందేవ్ అనుచరుడి భేటీ
* పార్లమెంటులో దుమారం * సోషల్ సైట్లలో కథనాలతో భగ్గుమన్న విపక్షం న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి, పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను బీజేపీ మద్దతుదారుడై బాబా రామ్‌దేవ్ సన్నిహితుడు, జర్నలిస్టు, వేద్‌ప్రతాప్ జైన్ వైదిక్ కలిశాడన్న విషయం సోమవారం దుమారం రేపింది. కరడుగట్టిన ఉగ్రవాదితో బీజేపీ రాయబారం నడిపిందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. వైదిక్ పాక్ పర్యటనలో భాగంగా ఈ నెల 2న లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను కలిసిన కథనాలు, ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని వైదిక్ కలవడంపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. సయీద్‌ను కలవడానికి సదరు జర్నలిస్టు ప్రభుత్వ అనుమతి తీసుకున్నదీ, లేనిది చెప్పాలని కాంగ్రెస్ కోరింది. బీజేపీ అనుబంధ సంస్థల్లో వైదిక్ కీలక సభ్యుడిగా ఉన్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై రాజ్యసభలో అధికారపక్ష నేత, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంతో ప్రభుత్వానికి సంబంధం లేదని, సయీద్‌ను కలవడానికి ప్రభుత్వం తరఫున ఎవరికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ ఉగ్రవాది విషయంలో కేంద్రం వైఖరి ఏ మాత్రం మారలేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలూ చూడటం లేదని తెలిపారు. వివరణ సంతృప్తికరంగా లేదంటూ సభ్యులు శాంతించకపోవడంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఇక లోక్‌సభలోనూ కాంగ్రెస్, ఇతర పక్షాలు ఈ అంశంపై ఆందోళన చేశాయి. వైదిక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అధికారులకు సమాచారం లేకుండా హఫీజ్.. వైదిక్ కలుసుకోవడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ అన్నారు. ఎవరి తరఫునా కలవలేదు.. వైదిక్: ఈ వివాదంపై వైదిక్ స్పందిస్తూ.. తాను ఎవరి తరఫునా సయీద్‌ని కలవలేదని పేర్కొన్నారు. జర్నలిస్టుగా చాలా మందిని కలుస్తుంటానన్నారు. పాక్ జర్నలిస్టుల సూచనమేరకే సయీద్‌ను కలిశానని చెప్పారు. తన వర కైతే ఇది సాధారణ భేటీ అని అన్నారు. గతంలో తాను మావోయిస్టులను, తాలిబన్లను కూడా కలిశానన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ కూడా వైదిక్‌కు మద్దతుగా నిలిచారు. ఓ జర్నలిస్టుగా.. సయీద్ మనసును మార్చడానికే వైదిక్ అతన్ని కలిసి ఉంటాడని అభిప్రాయపడ్డారు.