న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగంగా 2019లో వేలానికి వచ్చిన రుచి సోయాను బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ రూ. 4,350 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రుచి సోయా బ్రాండ్‌పై పతంజలి తనదైన ముద్రను వేయగలిగింది. తాజాగా రుచి సోయా బ్రాండ్ విస్తరణలో భాగంగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది రుచి సోయా.
ఫుల్ డిమాండ్
దాదాపు రూ. 4,300 కోట్లు సమీకరించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ తలపెట్టిన ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) మార్చి 24న ప్రారంభమైంది. ఈ ఎఫ్‌పీవో రికార్డు స్థాయింలో 3.60 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1,290 కోట్లు సమీకరించింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం 4.89 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 17.60 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) కోటా 2.20 రెట్లు, సంస్థగతయేతర ఇన్వెస్టర్ల కోటా 11.75 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 90 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీవో కింద షేరు ధర శ్రేణి రూ. 615–650గా ఉంది.
ఏమార్చే ప్రయత్నం
పతంజలి బ్రాండ్‌కు ఉన్న విలువ, బాబారాందేవ్ మీద నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రుచి సోయా షేర్లను మార్కెట్ ధరకే తక్కువగా దాదాపు 30 శాతం డిస్కౌంట్‌తో అందిస్తామంటూ పర్సనల్ నంబర్లకు, సోషల్ మీడియాలో మెసేజ్‌లు భారీ ఎత్తున తిరుగుతున్నాయి. ఈ షేర్లు సొంతం చేసుకోవాలంటే మీ యూపీఐ, బ్యాంక్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, బ్రోకర్ ద్వారా దరఖాస్తు చేసుకోండంటూ ఆయా మెసేజ్‌లలో కోరుతున్నారు.
హరిద్వార్‌లో ఫిర్యాదు
డిస్కౌంట్ ధరకే రుచి సోయా షేర్లు అందిస్తామంటూ చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లపై పతంజలి గ్రూపు స్పందించింది. డిస్కౌంట్ ధరలో రుచి సోయా షేర్ల పేరుతో వస్తున్న మెసేజ్‌కి పతంజలి గ్రూపు డైరెక్టర్లు, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌కి సంబంధం లేదని.. ఈ ఫేక్ మెసేజ్‌లపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని కోరింది పతంజలి గ్రూపు. ఈ మేరకు 2022 మార్చి 27న హరిద్వార్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు 0188 నంబరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అప్రమత్తమైన సెబీ
రుచి సోయా పేరుతో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్
బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తమైంది. ఫేక్ మెసేజ్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పత్రికా ప్రకటనలు ఇవ్వాలంటూ రుచి సోయా ప్రమోటర్లకు సెబీ సూచించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ఎఫ్‌పీవోలో ఈ షేర్ల కొనుగోలు విషయంలో పునరాలోచన చేసుకునే అవకాశాన్నివ ఇన్వెస్టర్లకు కల్పించింది.
బంపర్ హిట్
మంగళవారం మార్కెట్‌లో రుచి సోయా షేరు ధర దూసుకుపోయింది. ఉదయం 11 గంటల సమయంలో 102 పాయింట్లు లాభపడి 915 దగ్గర ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment