న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్ టెక్నాలజీస్ లాంటివి ఈ కోవకు చెందినవే. భారత్‌లో మతపరమైన, ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన మార్కెట్ పరిమాణం 30 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. షేర్‌చాట్ లాంటి సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫాంపై 25 మంది పైగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో యోగా గురు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. షేర్‌చాట్ త్వరలో మరింత మందిని తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది.
చిన్న ఆలయాలు, స్వామీజీలతో టైఅప్..
కొత్తగా 20–25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఆధ్యాత్మిక సేవల సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులు, భక్తులను అనుసంధానం చేసే పనిలో ఉన్నాయని మైమందిర్ పోర్టల్‌లో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్ పార్ట్‌నర్స్ సంస్థ భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక గురువుల ఆధారిత కమ్యూనిటీలను తయారు చేయడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. సాధారణంగా కాస్త ఆర్థిక సామర్ధ్యం ఉన్న ఆధ్యాత్మిక గురువులు .. తమ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడే టెక్నాలజీలపై సొంతంగానే నిధులు వెచ్చించుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఆధ్యాత్మిక గురువుకు, ఆలయం, ప్రార్థనామందిరాలకు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ఓ పేజీ ఉంటోంది. దీంతో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా కాస్త పేరొందిన చిన్న స్థాయి ఆలయాలు, స్థానిక ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలపై ఆధ్యాత్మిక పోర్టల్స్ దృష్టి సారిస్తున్నాయి.
పండుగలు, జ్యోతిష్యం వివరాలు కూడా...
‘మేం కాస్త చిన్న స్థాయి గురువులు, ఆలయాలను .. వాటి కంటెంట్‌ను ఇప్పుడు మా ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి తెస్తున్నాం‘ అని ఆర్‌జ్ఞాన్ సహ వ్యవస్థాపకుడు ఉమేష్ ఖత్రి తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి గలవారికి ఈ వెబ్‌సైట్ ఒక .. ఇన్‌స్ట్రాగాంలాంటిది. ఆర్‌జ్ఞాన్, మైమందిర్‌లకు ప్రతి నెలా చెరో అయిదు లక్షల మంది దాకా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరు మతపరమైన కంటెంట్, తమ ఇష్ట దేవతలు.. గురువుల ఫొటోలు, వీడియోలు వీటిలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సైట్లు.. పండుగలు, హిందు క్యాలెండర్లు, జ్యోతిష్యం మొదలైన అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని కూడా యూజర్లకు పంపిస్తుంటాయి. తమ ప్లాట్‌ఫాంపై నాణ్యమైన కంటెంట్ అందించేందుకు కాల్పనిక్ టెక్నాలజీస్ నేరుగా ఆలయాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కాల్పనిక్ టెక్నాలజీస్ దగ్గర 230 ఆలయాలకు సంబంధించిన లైవ్, రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 50 మంది గురువులు, 500 ఆలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించుకుంది.
మారుతున్న అభిరుచులు...
మతపరమైన, ఆధ్యాత్మికమైన కంటెంట్ విషయంలో భారతీయుల ధోరణులు మారుతున్నాయి. గత మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మందికి తొలిసారిగా సోషల్ నెట్‌వర్క్ సైట్లు పరిచయమవుతున్నాయి. నగరాల్లో ఉండే వారితో పోలిస్తే ఇలాంటి చిన్న పట్టణాలు, గ్రామాల వారి కంటెంట్ వినియోగ ధోరణుల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. ‘భారతీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ధోరణులు మారుతున్నాయి. చాలా మంది గుళ్లకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం, వాటిని ఫేస్‌బుక్‌లాంటి వాటిల్లో పోస్ట్ చేయడంలాంటివి చేస్తుంటారు.
ఇలాంటి ఆధ్యాత్మిక భావాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ అవసరమన్న అభిప్రాయం నెలకొంది‘ అని మైమందిర్ వ్యవస్థాపకుడు రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ఇటు భక్తులు, అటు ఆలయం కోణంలో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో విస్తరించని మార్కెట్‌పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులకు లక్షల కొద్దీ సంఖ్యలో భక్తులు ఉంటున్నారు. పాత తరం వారితో పాటు టెక్నాలజీ విపరీతంగా వాడే కొత్త తరం యువత కూడా వీరిలో ఉంటున్నారు. వీరికి ఆశ్రమాలకు వెళ్లేంత సమయం దొరక్కపోవడంతో ఆయా గురువుల ప్రవచనాలను ఆన్‌లైన్‌లో వినడానికి మొగ్గుచూపుతున్నారని కాల్పనిక్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశ్వనీ గర్గ్ చెప్పారు.
ఆధ్యాత్మికం @ ఆన్‌లైన్!
Published Tue, Jul 2 2019 5:13 AM | Last Updated on Tue, Jul 2 2019 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment