లండన్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.
వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్‌లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యంలేదని వెల్లడైంది. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేదీ అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ వెల్లడించారు. యూకేలో పతంజలి స్వసారి–కరోనిల్ కిట్ల విక్రయానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) స్పష్టం చేసింది. అనుమతి లేని ఔషధాలు, వైద్య ఉత్పత్తులను యూకే మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాబా రాందేవ్ జూన్ 23న కరోనిల్ కిట్లను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment