University of Birmingham
-
యాంటీబయాటిక్స్ అతి వాడకంతో.. ముప్పే
బర్మింగ్‌హామ్: కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్ వాడుతూ పోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిస్తునే ఉన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కాండిడా అనే ఫంగస్ కారణం. ఈ ఫంగస్ సోకేందుకు యాంటీ బయాటిక్స్ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్ అందిస్తే కేథటర్ నుంచి కూడా ఈ ఫంగస్ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. ప్రయోగ వివరాలు యాంటీబయాటిక్స్ వాడకంతో ఫంగల్ వ్యాధులు సోకే అవకాశాలు పెరగడంపై పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలకు యాంటీబయాటిక్ మిశ్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఈ ఎలుకలకు కాండిడా ఫంగస్ సోకేలా చేశారు. మరో సమూహం ఎలుకలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కేవలం ఫంగస్‌ను సోకేలా చేశారు. అనూహ్యంగా యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించినట్లు కనుగొన్నారు. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకిన జీవుల్లో మూత్రపిండాలు బలహీనపడతాయి, దీంతో ఆ జీవులు అనారోగ్యం పాలవుతుంటాయి. ఈ ప్రయోగంలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీబయాటిక్స్ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు గుర్తించారు. ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు. రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించే సైటోకైన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్ తగ్గించాయి. దీంతో ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే రోగనిరోధకత ఈ ఎలుకల్లో తగ్గిపోయిందని తెలిసింది. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ వల్ల ఫంగల్ వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు తెలిపారు. వాంకోమైసిన్ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం అధికమని గుర్తించారు. -
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్
లండన్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్‌లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యంలేదని వెల్లడైంది. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేదీ అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ వెల్లడించారు. యూకేలో పతంజలి స్వసారి–కరోనిల్ కిట్ల విక్రయానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) స్పష్టం చేసింది. అనుమతి లేని ఔషధాలు, వైద్య ఉత్పత్తులను యూకే మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాబా రాందేవ్ జూన్ 23న కరోనిల్ కిట్లను విడుదల చేశారు. -
రెండు గ్లాసుల నీళ్లతో బరువు తగ్గొచ్చు!
లండన్: భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఈ మేరకు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రాథమిక ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు మూడు నెలల్లోనే 4 కిలోల బరువు తగ్గుతారని ఈ అధ్యయనంలో తేలినట్లు లండన్‌కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం 5–17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది. అయితే 2014లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారిలో 1.9 బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులున్నారని వెల్లడించింది. -
అమ్మా లేమ్మా .. నాన్న వచ్చాను
ఎస్వీయూలో విద్యార్థిని ఆత్మహత్య అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిన తండ్రి రెండు నెలల్లో ఎస్వీయూలో ఇద్దరి ఆత్మహత్య తిరుపతి క్రైం: అమ్మా లేవమ్మా .. మీ నాన్నను వచ్చాను. ఒక్కసారి లే చి చూడు తల్లీ, రాత్రి కూడా బాగానే మాట్లాడావు కదమ్మా, ఇంతలో ఏమైంది తల్లీ, ఏదైనా ఉంటే నాన్న కు చెప్పు కన్నా.. అంటూ ఆ తండ్రి తరుక్కుపోయేలా బిడ్డ మృతదేహంపై పడి ఏడుస్తుంటే చూపరుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎస్వీయూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బుధవారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన రాపూరు మండలం మెనుపూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, సుజాత రెండో కుమార్తె వైష్ణవి (22) ఎంకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎస్వీ యూనివర్సిటీలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపి ఆదివారం రాత్రి హాస్టల్‌కు చేరుకుంది. ఈమెతో పా టు మరో ఐదుగురు ఉండేవారు. బుధవారం రాత్రి స్నేహితులు ఎవరూ ఊరి నుంచి రాకపోవడంతో స్నేహితులు తమకు రూంకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. పక్క రూంలో ఉన్న బీపీఈడీ విద్యార్థులు గురువారం తెల్లవారుజామున గ్రౌండ్‌కు వెళ్లేందుకు లేవగా వైష్ణవి రూంలో లైట్ వెలుగుతుంది. విద్యార్థినులు గది తలుపులు తట్టగా ఎంత సేపటికి తెరవలేదు. దీంతో వారు కాళ్లతో తన్ని డోర్ తెరుచుకునేలా చేశారు. లోపల వైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. భ యాందోళనకు గురైన విద్యార్థిను లు స్టీవార్డెన్స్కు ఫిర్యాదు చేశారు. వారు చూసి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వైష్టవి కొంత కాలంగా లోబీపీ, కడుపునొప్పితో బాధపడుతోందని తెలిసింది. అందుకే ఉరి వేసుకుని ఉంటుం దని, నిజానిజాలు పోస్టుమార్టంలో తేలుతాయని పోలీసులు తెలిపారు. అమ్మాయి ఉరి వేసుకున్న సమయంలో చెవుల్లో ఇయిర్‌ఫోన్స్ అలాగే ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ సీఐ రామకృష్ణ తెలిపారు. తండ్రి మాత్రం రాత్రే ఫోన్ చేసి తమతో మాట్లాడిందని, అక్కతో కూడా మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అంటే నిద్రపోతోందని ఉదయాన్నే ఫోన్ చేయిస్త్తానని చెప్పానని బోరున విలపించాడు. తన కూతురుకు ప్రేమ వ్యవహరాలు ఏమీలేవని, ఉంటే నిర్మొహమ్మాటంగా తనకు చెబుతుందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు ఎస్వీ యూనివర్సిటీలో రెండు నెలల కిందట ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్వీయూలో ఆత్మహత్యల నివారణపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు. ఒకటి మరిచిపోయే లోపు మరో ఘటన చోటుచేసుకుంటున్నాయి. -
అంధకారంలో ఆశాదీపం
మన కోసం మనం బతకడం స్వార్థం. మనవాళ్ల కోసం మనం బతకడం ప్రేమ. సమాజం కోసం బతకడం గొప్పదనం. ఈ మూడోదే చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన తాడిగడప నటరాజ్. కొన్ని దశాబ్దాలుగా ఆయన సమాజం కోసమే జీవిస్తున్నారు! అనంతపురంలోని ఎస్వీ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన, నటరాజ్‌లో సామాజిక స్పృహను తట్టి లేపింది. ఆయన సోదరి కోటీశ్వరి రక్తదాన శిబిరంలో రక్తదానం చేసింది. అప్పట్లో ఆ విశ్వ విద్యాలయంలో రక్తదానం చేసిన ఏకైక విద్యార్థిని ఆమే. అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి చేతుల మీదుగా ఓ సర్టిఫికేట్ కూడా పొందారామె. ఇదంతా దగ్గరుండి చూశారు నటరాజ్. అయితే సోదరికి వచ్చిన గుర్తింపు కంటే, ఆమె చేసిన రక్తదాన ం చుట్టూనే ఆయన ఆలోచనలు తిరిగాయి. ఆమె ఇచ్చిన రక్తం మరొకరిని కాపాడుతుందన్న ఆలోచన ఆయనలో స్ఫూర్తిని నింపింది. తాను కూడా రక్తదానం చేసి కొందరి ప్రాణాలను నిలబెట్టాలన్న నిర్ణయాన్ని ఆ క్షణమే తీసుకున్నారాయన. 1989లో తమిళనాడులోని వేలూరు వెళ్లినప్పుడు, బంగ్లాదేశ్‌కు చెందిన బేదార్ హుస్సేన్ అనే వ్యక్తికి తొలిసారి రక్తదానం చేశారు నటరాజ్. ఆ ఆస్పత్రిలో ‘రక్తం తయారుచేసే పరిశ్రమలు భూమిమీద లేవు. మానవ దేహం మాత్రమే తయారుచేయగలదు’ అని రాసివున్న బోర్డును చూశారు. ఇప్పటికీ ఆ మాటలు తన మనసులో మెదులుతూనే ఉన్నాయంటారాయన. ఇప్పటిదాకా మొత్తం 42 పర్యాయాలు రక్తదానం చేశారు. ఇతరులను కూడా రక్తదానం చేయమని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ల ఊరికి చెందిన మరో 120 మందిని రక్తదాతలుగా మారేలా చేశారు. దీంతో వారి గ్రామానికి రక్తదాతల గ్రామంగా గుర్తింపు వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 50 కి పైనే రక్తదాన శిబిరాలను నిర్వహించారు నటరాజ్. ఈ సేవకుగాను 2010లో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం, 2011లో ఆంధ్రరత్న అవార్డు అందుకున్నారు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతులమీదుగా సన్మానం జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి ఐదుసార్లు పురస్కారం అందుకున్నారు. ఒకవైపు రక్తదానంపై సమాజానికి శాయశక్తులా అవగాహన కల్పిస్తూనే, మరోవైపు నేత్రదానం పైనా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నటరాజ్. చీకటిని తిట్టుకుంటూ కాలం గడిపే కంటే ఓ చిరుదివిటీని వెలిగిద్దామనే వివేకానందుని హితోక్తి నటరాజ్‌ని నేత్రదానం దిశగా కూడా నడిచేలా చేసిందంటారాయన. నేత్రదానమనగానే కళ్లను తీసేస్తారు అన్న భ్రమ చాలామందిలో ఉండటం గమనించిన నటరాజ్, కళ్లు తీసుకోవడమంటే కార్నియా మాత్రమే తీసుకుంటున్నారన్న వాస్తవాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు. నేత్రదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 36 నేత్రాలతో 72 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఓ రోజు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య ఫోన్ చేసి... రక్త, నేత్రదానాలతో పాటు మానవ శరీర దానాలను కూడా చేపడితే బాగుంటుందని హితవు పలకడంతో, ఆ దిశగా కూడా ప్రచారం ప్రారంభించారు. నటరాజ్‌తో పాటు ఆయన భార్య కూడా అవయవదాన పత్రంపై సంతకం చేయడంతో మరో 20 మంది వారితో చేతులు కలిపారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు నటరాజ్. వారి గ్రామంలోని ప్రధాన వీధిలో మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై, స్థానికులకు నీడనిస్తున్నాయి. సీఎఫ్ఎల్ బల్బుల వినియోగం, విద్యుత్ పొదుపు ఆవశ్యకతపైనా ప్రచారం చేపట్టారు. ఇలా సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలపై దృష్టి పెడుతూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నటరాజ్‌ని ఎంత అభినందించినా తక్కువే! - కొల్లూరి సత్యనారాయణ హైదరాబాద్