అంధకారంలో ఆశాదీపం
మన కోసం మనం బతకడం స్వార్థం. మనవాళ్ల కోసం మనం బతకడం ప్రేమ. సమాజం కోసం బతకడం గొప్పదనం. ఈ మూడోదే చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన తాడిగడప నటరాజ్. కొన్ని దశాబ్దాలుగా ఆయన సమాజం కోసమే జీవిస్తున్నారు!
అనంతపురంలోని ఎస్‌వీ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన, నటరాజ్‌లో సామాజిక స్పృహను తట్టి లేపింది. ఆయన సోదరి కోటీశ్వరి రక్తదాన శిబిరంలో రక్తదానం చేసింది. అప్పట్లో ఆ విశ్వ విద్యాలయంలో రక్తదానం చేసిన ఏకైక విద్యార్థిని ఆమే. అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి చేతుల మీదుగా ఓ సర్టిఫికేట్ కూడా పొందారామె. ఇదంతా దగ్గరుండి చూశారు నటరాజ్. అయితే సోదరికి వచ్చిన గుర్తింపు కంటే, ఆమె చేసిన రక్తదాన ం చుట్టూనే ఆయన ఆలోచనలు తిరిగాయి. ఆమె ఇచ్చిన రక్తం మరొకరిని కాపాడుతుందన్న ఆలోచన ఆయనలో స్ఫూర్తిని నింపింది. తాను కూడా రక్తదానం చేసి కొందరి ప్రాణాలను నిలబెట్టాలన్న నిర్ణయాన్ని ఆ క్షణమే తీసుకున్నారాయన.
1989లో తమిళనాడులోని వేలూరు వెళ్లినప్పుడు, బంగ్లాదేశ్‌కు చెందిన బేదార్ హుస్సేన్ అనే వ్యక్తికి తొలిసారి రక్తదానం చేశారు నటరాజ్. ఆ ఆస్పత్రిలో ‘రక్తం తయారుచేసే పరిశ్రమలు భూమిమీద లేవు. మానవ దేహం మాత్రమే తయారుచేయగలదు’ అని రాసివున్న బోర్డును చూశారు. ఇప్పటికీ ఆ మాటలు తన మనసులో మెదులుతూనే ఉన్నాయంటారాయన. ఇప్పటిదాకా మొత్తం 42 పర్యాయాలు రక్తదానం చేశారు. ఇతరులను కూడా రక్తదానం చేయమని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ల ఊరికి చెందిన మరో 120 మందిని రక్తదాతలుగా మారేలా చేశారు. దీంతో వారి గ్రామానికి రక్తదాతల గ్రామంగా గుర్తింపు వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 50 కి పైనే రక్తదాన శిబిరాలను నిర్వహించారు నటరాజ్. ఈ సేవకుగాను 2010లో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం, 2011లో ఆంధ్రరత్న అవార్డు అందుకున్నారు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతులమీదుగా సన్మానం జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి ఐదుసార్లు పురస్కారం అందుకున్నారు.
ఒకవైపు రక్తదానంపై సమాజానికి శాయశక్తులా అవగాహన కల్పిస్తూనే, మరోవైపు నేత్రదానం పైనా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నటరాజ్. చీకటిని తిట్టుకుంటూ కాలం గడిపే కంటే ఓ చిరుదివిటీని వెలిగిద్దామనే వివేకానందుని హితోక్తి నటరాజ్‌ని నేత్రదానం దిశగా కూడా నడిచేలా చేసిందంటారాయన. నేత్రదానమనగానే కళ్లను తీసేస్తారు అన్న భ్రమ చాలామందిలో ఉండటం గమనించిన నటరాజ్, కళ్లు తీసుకోవడమంటే కార్నియా మాత్రమే తీసుకుంటున్నారన్న వాస్తవాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు.
నేత్రదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 36 నేత్రాలతో 72 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఓ రోజు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య ఫోన్ చేసి... రక్త, నేత్రదానాలతో పాటు మానవ శరీర దానాలను కూడా చేపడితే బాగుంటుందని హితవు పలకడంతో, ఆ దిశగా కూడా ప్రచారం ప్రారంభించారు. నటరాజ్‌తో పాటు ఆయన భార్య కూడా అవయవదాన పత్రంపై సంతకం చేయడంతో మరో 20 మంది వారితో చేతులు కలిపారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు నటరాజ్. వారి గ్రామంలోని ప్రధాన వీధిలో మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై, స్థానికులకు నీడనిస్తున్నాయి. సీఎఫ్‌ఎల్ బల్బుల వినియోగం, విద్యుత్ పొదుపు ఆవశ్యకతపైనా ప్రచారం చేపట్టారు. ఇలా సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలపై దృష్టి పెడుతూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నటరాజ్‌ని ఎంత అభినందించినా తక్కువే!
- కొల్లూరి సత్యనారాయణ
హైదరాబాద్