గత కొద్దిరోజులుగా డెంగీ వ్యాధి విపరీతంగా విస్తరిస్తోంది. డెంగీ వైరస్ సోకిన కొందరిలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంటుందన్న విషయం తెలిసిందే. ఇది ప్రాణాలకు అపాయం తెచ్చే పరిస్థితి. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో రక్తదానం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ డెంగీ పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో ప్లేట్‌లెట్లు ఇవ్వడం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. డెంగీ రోగుల్లో ప్లేట్‌లెట్ల ఆవశ్యకత, వాటిని ప్రదానం చేయాల్సిన అవసరం తెలిపే కథనమిది.
ప్లేట్‌లెట్స్ తగ్గేదెప్పుడు?
అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్తపు క్యాన్సర్ల (లుకేమియా)లో, బాగా ముదిరిపోయిన లింఫోమా లాంటి క్యాన్సర్లతో పాటు దానికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లలో మూలుగ దెబ్బతినే అవకాశలున్నాయి. ఇలాంటి సమయాల్లో తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్‌లెట్స్ కౌంట్ కూడా పడిపోవచ్చు. అలాగే అనేక వైరల్ జబ్బులతో పాటు ముఖ్యంగా డెంగీలో ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు బాధితుడికి రక్తస్రావం లేదా దేహంలోనే అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం.
చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా?
ఎక్కించాల్సిందెప్పుడు?
సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుంచి 80,000 వరకు పడిపోయినా ఎలాంటి ఆపద రాదు. కానీ అవి 20,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు బాధితుడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు ఏ చిన్నపాటి గాయమైనా అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం అవసరమవుతుంది.
చూడ్డానికి రక్తమంతా ఒకే ద్రవంలా (యూనీఫామ్‌గా) కనిపిస్తుంటుందిగానీ.. అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మాతో పాటు చాలా ప్రోటీన్లు వంటి అంశాలుంటాయన్నది తెలిసిందే. అందులో ప్లేట్‌లెట్లు కూడా చాలా కీలకమైనవే. ఇవి గాయాలైనప్పుడు లేదా ఇతరత్రా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడుతుంటాయి.
ఎలా ఎక్కిస్తారు?
చదవండి: కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా?
కౌంట్ తక్కువగా ఉన్నవారికి ప్లేట్‌లెట్స్ ఎక్కించడం (ట్రాన్స్‌ఫ్యూజన్) రెండు రకాలుగా జరుగుతుంది. అవి...
1. ఆర్.డి.పి. (ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్)
2. ఎస్.డి.పి. (సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్)
బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి వేటికవి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల... రక్తహీనత (అనీమియా) మాత్రమే ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలు ఎక్కించడం, ప్లాస్మా మాత్రమే అవసరమైన రోగులకు దాన్ని ఇవ్వడం, ప్లేట్‌లెట్స్ తగ్గినవారికి అవి మాత్రమే ఇవ్వడం ద్వారా ఒకే యూనిట్ బ్లడ్‌తో ముగ్గురికి ప్రాణాపాయం తప్పించవచ్చు.
ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ : బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది అనేక మంది దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంటారు. అందువల్ల ఏ రక్తం ఎవరిదన్న విషయం తెలియదు. అందుకే ఇలా సేకరించిన ప్లేట్‌లెట్లను ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్’ (ఆర్‌డీపీ)గా చెబుతారు. ‘ఆర్‌డీపీ’ని ఎక్కించినప్పుడు పేషెంట్‌లో 5,000 వరకు మాత్రమే కౌంట్ పెరుగుతుంది. కానీ సురక్షితమైన స్థాయికి ప్లేట్‌లెట్లను పెంచాలంటే, కౌంట్ కనీసం 25,000 నుంచి 30,000 ఉండాలి. ఇందుకోసం ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్’ ప్రక్రియలో కనీసం 5 నుంచి 6 యూనిట్ల రక్తం అవసరమవుతుంది. అంటే ఒకరికి అవసరమైన ప్లేట్‌లెట్లను సేకరించాలంటే కనీసం ఐదారుగురు దాతలు కావాలి. కొందరు రోగుల్లో వారి వ్యాధిని బట్టి నాలుగైదు మార్లు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి రావచ్చు. అంటే పేషెంట్‌కు కావాల్సిన ప్లేట్‌లెట్స్ అందాలంటే కనీసం 30 మంది దాతలు కావాలి. అంతమంది దాతలు దొరకడం చాలా కష్టం.
సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ : వైద్యరంగంలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక్క దాత నుంచే అవసరమైన పరిమాణంలో ప్లేట్‌లెట్స్ సేకరించవచ్చు. ఇలా చేసేప్పుడు రక్తంలోని ఇతర అంశాలను కాకుండా కేవలం ప్లేట్‌లెట్స్ మాత్రమే సేకరిస్తారు. ఇలా సేకరించేవాటిని ‘సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్’ (ఎస్‌డీపీ) అంటారు. ఈ ప్రక్రియలో ఒకే దాత... బాధితుడికి అవసరమైనన్ని అంటే... దాదాపు 30,000 ప్లేట్‌లెట్ కౌంట్ సమకూరేలా వాటిని దానం చేస్తాడు. దానివల్ల దాతకు ఎలాంటి నష్టమూ ఉండదు. కేవలం నాలుగురోజుల్లోనే దాత రక్తంలోకి అవి తిరిగి భర్తీ అవుతాయి.
అంతేకాదు.. మళ్లీ ఎవరికైనా అవసరమైతే.. అదే దాత కేవలం 10 రోజుల తర్వాత మళ్లీ ప్లేట్‌లెట్స్ దానం చేయవచ్చు. అలాకాకుండా, మొత్తం రక్తదానం చేసినప్పుడు... ఆ రక్తమంతా భర్తీ కావడానికి కనీసం మూడు నెలల వ్యవధి అవసరం. అందుకే ప్లేట్‌లెట్స్ అవసరమైనప్పుడు దాతలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి పదిరోజులకోమారు కూడా ప్లేట్‌లెట్స్‌ను నిరభ్యంతరంగా దానం ఇవ్వవచ్చు. పైగా ఇటీవలి కాలంలో ఇది చాలామంది ప్రాణాలు కాపాడుతూ పలువురికి మేలు చేస్తుంది.
ఎక్కడ, ఎలా పుడతాయి?
ప్లేట్‌లెట్స్ ఎముక మూలుగ నుంచి పుడతాయి. వీటి జీవిత కాలం కేవలం నాలుగు రోజులు మాత్రమే. సాధారణంగా ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే మన స్వాభావిక రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.
ఎన్ని ఉండాలి?
ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉండాలి. ఇది నార్మల్ కొలత. వీటి సంఖ్యను ‘సెల్ కౌల్టర్ మెషిన్’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ప్లేట్‌లెట్ కౌంట్ కోసం 2 – 3 ఎమ్‌ఎల్ రక్తాన్ని సేకరిస్తారు. డెంగీవ్యాధిగ్రస్తుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ తెలుసుకోవడం కోసం ప్రతి 24 గంటలకోమారు రక్తపరీక్ష నిర్వహిస్తుండాలి.
ఎలా పనిచేస్తాయి?
రక్తం గడ్డకట్టే జీవక్రియల్లో ప్లేట్‌లెట్స్‌లోని అనేక ప్రోటీన్లు పాలు పంచుకుంటాయి. వీటిని ‘క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. ఇవన్నీ ఒక వలలా ఏర్పడి రక్తం ప్రవహించకుండా ఓ అడ్డుకట్ట వేస్తాయి. గాయం అయ్యాక కేవలం 2, 3 నిమిషాల్లోనే ఈ వల ఓ ఆనకట్టలా ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment