కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధిని కోవిడ్–19 అంటారన్నది తెలిసిందే. ఈ ఇంగ్లిష్ పదంలో తొలి రెండు అక్షరాలు ‘సీఓ’ అన్నవి కరోనాను, ‘విఐ’ అన్నవి వైరస్‌నూ ‘డి’ అన్నది డిసీజ్ అంటే వ్యాధిని సూచిస్తాయి. ఇటీవల మూడోవేవ్‌లో కోవిడ్–19 వ్యాధి పిల్లలపై తీవ్రప్రభావాన్ని చూపబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... కరోనా గురించి అనేక అంశాలను తెలుసుకుందాం.
►మనదేశంలో మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా?
జవాబు : అవును. వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అయితే తీవ్రత అంచనా వేయలేం. ఏ మహమ్మారి (ప్యాండమిక్) అయినా దశలవారీగా వస్తుంటుంది. అది ఏళ్ల తరబడి ఉత్పరివర్తనాలు చెందుతూ... దాని ప్రభావం నామమాత్రం అయ్యేవరకూ లేదా ఓ ప్రాంత ప్రజలందరిలోనూ దానిపట్ల వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) పెంపొందేవరకు అది తన ప్రభావం చూపుతూనే ఉంటుంది.
►మూడో వేవ్ ముప్పు పిల్లల్లో ఎక్కువా?
జవాబు : ఇటీవల ఢిల్లీలోని ఏఐఐఎమ్‌ఎస్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌లో జరిగిన పరిశోధనల ప్రకారం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో సీరో–పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇప్పుడున్న కోవిడ్–1 వేరియెంట్... రెండేళ్లు అంతకు పైబడి వయసున్న పిల్లలపై ప్రభావం ఖచ్చితంగా చూపుతుందని తెలియరాలేదు.
►పెద్దలతో పోల్చినప్పుడు అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందా?
జవాబు : ఈ విషయమై అనేక అధ్యయనాలూ, పరిశీలనలూ జరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి ‘ఏసీఈ రిసెప్టార్’ల గురించి జరుగుతున్న అధ్యయనం. అవి పిల్లల్లో తక్కువగా ఉన్నందున... ఆ ప్రకారం చూస్తే 90 – 94 శాతం మంది పిల్లల్లో కోవిడ్–19 వ్యాధి తీవ్రత చాలా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. హాస్పిటల్‌లో చేరాల్సిరావడం చిన్నారుల్లో చాలా చాలా తక్కువే.
►హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చే పిల్లల శాతం ఎంత ఉండవచ్చు?
జవాబు: కేవలం 6 – 10 % వరకు ఉండవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు, ఇతరత్రా సౌకర్యాలతో మరణాల రేటు కూడా తక్కువగానే ఉండవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ మరణాల రేటు ఇప్పటికే చాలా తక్కువగానే ఉంటోంది.
►కోవిడ్–19 వచ్చి కోలుకున్న పిల్లల్లో అనంతర దుష్ప్రభావాలు ఏవైనా ఉండవచ్చా?
జవాబు : కోవిడ్–19 నుంచి కోలుకున్న 2 – 6 వారాల తర్వాత వ్యాధి నిరోధక సమస్య కారణంగా వాళ్లలో ‘ఎమ్‌ఐఎస్–సి’ (మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ ఛైల్డ్) అనే రుగ్మత కనిపించవచ్చు. పాజిటివ్ వచ్చిన పిల్లల్లో కేవలం 1 – 2 శాతం లోపు పిల్లల్లోనే ఈ ‘ఎమ్‌ఐఎస్–సి’ కనిపించే అవకాశం ఉంది.
►ఎమ్‌ఐఎస్–సి అంటే ఏమిటి? దాన్ని గుర్తించడం ఎలా?
జవాబు : కోవిడ్–19 వచ్చి తగ్గాక 2–6 వారాల్లో పిల్లల్లో కనిపించేందుకు అవకాశం ఉన్న కోవిడ్ అనంతర రుగ్మతే మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ ఛైల్డ్ – ‘ఎమ్‌ఐఎస్–సి’. నాలుగు రోజులకు పైగా తగ్గని జ్వరం, కళ్లు ఎర్రబారడం, ఒంటి నిండా ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), అదేపనిగా వాంతులు, అరచేతులు, అరికాళ్ల చర్మంలో మార్పులు, నోరు ఎర్రబారడం, నోటిలో పగుళ్లు వంటి లక్షణాలతో ఇది వ్యక్తమవుతుంది. వైద్యపరీక్షల్లో ఇతరత్రా ఏ సమస్యా కనిపించప్పుడు... లక్షణాలను బట్టి ఎమ్‌ఐఎస్–సి ఉన్నట్లుగా కచ్చితంగా నిర్ధారణ చేసి, తగిన మందులు వాడాలి.
►ఎమ్‌ఐఎస్–సి నుంచి కోలుకునే అవకాశాలు ఎంత?
జవాబు : చాలా త్వరగా కనుగొని, తక్షణం చికిత్స అందిస్తే పిల్లలు చాలా బాగా కోలుకుంటారు. ఎంత త్వరగా కనుక్కుని, ఎంత వేగంగా చికిత్స అందించామన్న అంశంపైన పిల్లల మరణాల నివారణ ఆధారపడి ఉంటుంది.
►తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నివారణ చర్యలేమిటి?
జవాబు : పిల్లలను ఇంట్లోనే ఉండేలా జాగ్రత్త పడాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి. రెండేళ్లు పైబడిన పిల్లలకు మాస్క్ వాడాలి. కోవిడ్ నివారణకు అనుసరించే అన్ని జాగ్రత్తలూ వారూ పాటించేలా చూడాలి.
► మనదేశంలో పిల్లల కోసం వ్యాక్సిన్ ఏదైనా అందుబాటులో ఉందా?
జవాబు : ఇప్పటికి ఉన్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేదు. అయితే ఈ విషయంలో ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయి. కొన్ని నెలల్లోనే వాటి ఫలితాలు వెల్లడికానున్నాయి. దాంతో రెండేళ్లు పైబడిన పిల్లలకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
►పిల్లలకు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ (ఫ్లూ షాట్) ఇప్పించడం అన్నది కోవిడ్–19ను నివారిస్తుందా?
జవాబు : ఇన్‌ఫ్లుయెంజా అన్నది తీవ్రమైన సీజనల్ రుగ్మత. దీని నివారణ కోసం ప్రతీ వర్షాకాలంలో (జూన్‌లో) ఐదేళ్ల వయసు వచ్చే వరకు ప్రతీ ఏడాదీ దాన్ని తీసుకోవాలనేది ఓ సిఫార్సు. అయితే ఇప్పటికి ఉన్న పరిశోధన ఫలితాల ప్రకారం... ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్–19 కూడా నివారితమవుతుందన్న దాఖలా ఏదీ లేదు. అయితే పిల్లలకు హాని చేసే సీజనల్ అంశాల్లో ఇన్‌ఫ్లుయెంజా కూడా ఒకటైనందున వర్షాకాలం వచ్చే ముందర ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
– డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా,
ఎండీ (గోల్డ్ మెడల్), ఎఫ్‌ఐపీఎమ్, పీజీపీఎన్.,
కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ అండ్ నియోనేటాలజిస్ట్,
రెనోవా నీలిమా హాస్పిటల్స్,
సనత్‌నగర్ హైదరాబాద్.
040–21111100
9121012265
Comments
Please login to add a commentAdd a comment