కోట/జైపూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు రామ్‌దేవ్ సారథ్యంలో గురువారం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒకేసారి 1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్, కోట జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పాయి’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది.
గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను సీఎం రాజే, రామ్‌దేవ్‌లకు అందజేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 6.30 నుంచి 7 గంటల వరకు 15 రకాల యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు కోటలోని ఆర్‌ఏసీ గ్రౌండ్‌కు తరలివచ్చారు. 2017లో మైసూర్‌లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించగా తాజాగా ఆ రికార్డును కోట అధిగమించింది. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ‘ఆచార్య’ పేరుతో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు.
యూరోపియన్ పార్లమెంట్‌లో రవిశంకర్
బెంగళూరు: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు. బెల్జియంలో భారత రాయబార కార్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, యూరోపియన్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఎంబసీ అధికారులు, 250 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ..నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలైన విద్వేషం, కుంగుబాటును యోగా మాదిరిగా మరే మార్గం పరిష్కరించలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment