ఉగ్రవాది సయీద్‌తో రాందేవ్ అనుచరుడి భేటీ | Ruckus in Parliament over Baba Ramdev’s aide meeting Hafiz Saeed | Sakshi
Sakshi News home page

ఉగ్రవాది సయీద్‌తో రాందేవ్ అనుచరుడి భేటీ

Published Tue, Jul 15 2014 2:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

ఉగ్రవాది సయీద్‌తో రాందేవ్ అనుచరుడి భేటీ - Sakshi

ఉగ్రవాది సయీద్‌తో రాందేవ్ అనుచరుడి భేటీ

* పార్లమెంటులో దుమారం
* సోషల్ సైట్లలో కథనాలతో భగ్గుమన్న విపక్షం

 
న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి, పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను బీజేపీ మద్దతుదారుడై బాబా రామ్‌దేవ్ సన్నిహితుడు, జర్నలిస్టు, వేద్‌ప్రతాప్ జైన్ వైదిక్ కలిశాడన్న విషయం సోమవారం దుమారం రేపింది.  కరడుగట్టిన ఉగ్రవాదితో బీజేపీ రాయబారం నడిపిందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. వైదిక్ పాక్ పర్యటనలో భాగంగా ఈ నెల 2న లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను కలిసిన కథనాలు, ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని వైదిక్ కలవడంపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. సయీద్‌ను కలవడానికి సదరు జర్నలిస్టు ప్రభుత్వ అనుమతి తీసుకున్నదీ, లేనిది చెప్పాలని కాంగ్రెస్ కోరింది. బీజేపీ అనుబంధ సంస్థల్లో వైదిక్ కీలక సభ్యుడిగా ఉన్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.
 
 దీనిపై రాజ్యసభలో అధికారపక్ష నేత, ఆర్థిక  మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంతో ప్రభుత్వానికి  సంబంధం లేదని, సయీద్‌ను కలవడానికి ప్రభుత్వం తరఫున ఎవరికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ ఉగ్రవాది విషయంలో కేంద్రం వైఖరి ఏ మాత్రం మారలేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలూ చూడటం లేదని తెలిపారు.  వివరణ సంతృప్తికరంగా లేదంటూ సభ్యులు శాంతించకపోవడంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఇక లోక్‌సభలోనూ కాంగ్రెస్, ఇతర పక్షాలు ఈ అంశంపై ఆందోళన చేశాయి. వైదిక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అధికారులకు సమాచారం లేకుండా హఫీజ్.. వైదిక్ కలుసుకోవడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ అన్నారు.    
 
 ఎవరి తరఫునా కలవలేదు.. వైదిక్: ఈ వివాదంపై వైదిక్ స్పందిస్తూ.. తాను ఎవరి తరఫునా సయీద్‌ని కలవలేదని పేర్కొన్నారు. జర్నలిస్టుగా  చాలా మందిని కలుస్తుంటానన్నారు. పాక్ జర్నలిస్టుల సూచనమేరకే సయీద్‌ను కలిశానని చెప్పారు. తన వర కైతే ఇది సాధారణ భేటీ అని అన్నారు. గతంలో తాను మావోయిస్టులను, తాలిబన్లను కూడా కలిశానన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ కూడా వైదిక్‌కు మద్దతుగా నిలిచారు. ఓ జర్నలిస్టుగా.. సయీద్ మనసును మార్చడానికే వైదిక్ అతన్ని కలిసి ఉంటాడని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement