కలెక్టర్‌తో సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఐఎంఏ ప్రతినిధులు
- ఆందోళన విరమించిన ప్రైవేటు వైద్యులు
- జోక్యం చేసుకున్న ఐఎంఏ రాష్ట్రం సంఘం
- వైద్యుల సమ్మెపై కలెక్టర్ అసహనం
- మృతుల కుటుంబాలను ఎవరు ఓదారుస్తారని ప్రశ్న
- వైద్య సహాయం అందక జిల్లాలో మొత్తం ముగ్గురు మృతి
నిజామాబాద్ అర్బన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు జిల్లాలో ప్రైవేటు వైద్యులు బుధవారం ఆందోళన విరమించారు. ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నాలుగు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందక జిల్లాలో ముగ్గురు మరణించారు.
మరోవైపు వైద్యుల తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమయ్యింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైద్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరిణామాలు తీవ్ర మవుతుండడంతో ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ రాష్ట్ర సంఘం జోక్యం చేసుకుంది. ఆస్పత్రులను మూసివేసి వెద్య సేవలు బంద్ చేయడం సమంజసం కాదని ఐఎంఏ జిల్లా నేతలకు హితవు పలికింది.
తర్జనభర్జన అనంతరం వైద్యులు తమ ఆందోళనను విరమించి వైద్యసేవలను ప్రారంభించారు. అంతకు ముందు వైద్యులు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కలిసి ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెద్యులు ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను నిలిపివేసిన తీరుపై తీవ్రంగా నిరసించారు. ‘‘మీ ఆందోళన వల్ల వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఎవరిది బాధ్యత. వారి కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చుతారు.
ముందు దీనికి సమాధానం చెప్పండి. ఆ తర్వాతే మాట్లాడండి’’ అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ‘‘మీ వల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాలు. ఆందోళన విరమించి ఆస్పత్రులు తెరవండి’’ అని సూచించారు. ఐఎంఏ జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు అప్పారావు, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి. వీఎస్.రావు, బాపురెడ్డి, అశోక్‌రెడ్డి కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. ఆస్పత్రులపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించారు.
దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పినా వైద్యులు వినకుండా ఆస్పత్రులను బంద్ చేసి ఆందోళనకు దిగారన్నారు. ప్రైవేట్ వైద్యుల చర్య వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమ్మెకు వెళ్లేముందు మానవతా దృక్పథంతో ఆలోచించి ఉండాల్సిందని పేర్కొన్నారు.
వైద్యుల మధ్య విభేదాలుకలెక్టర్‌ను కలిసి వెళ్లిన అనంతరం వైద్యులు ఐఎంఏ హాల్‌లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ర్ట, జిల్లా నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఆస్పత్రులు మూసివేసి నిరసన తెలపడం సమంజసం కాదని, వెంటనే నిరసన విరమించాలని రాష్ట్ర నాయకుడు నీలి రాంచందర్ ఇతర వైద్యులను కోరారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను సమర్థించింది. దీనిని కొందరు వైద్యులు వ్యతిరేకించారు. దీంతో రాంచందర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. నిరసన వల్ల జిల్లా యంత్రాంగం, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుందని గమనించాలని కోరినా కొందరు వైద్యులు వినిపించుకోలేదు. అయితే ఎట్టకేలకు నిరసనను విరమించడానికి వైద్యులు అంగీకరించారు. ఇటు జిల్లా యంత్రాంగం, అటు పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చేసేదేమీలేక వైద్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
వివాదం ఇలా మొదలైంది
బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో మంగళవారం పూజ (20) అనే యువతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు మైరుగైన వైద్య సేవలు అందించలేదని ఆరోపిస్తూ ఆస్పత్రిపై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి జనరేటర్‌కు నిప్పు పెట్టారు. మరుసటి రోజే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొంబాయి నర్సింగ్ హోమ్‌లో అర్షమొలలకు చికిత్స పొందిన సుమలత అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది.
ఆమె బంధువులు ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటిచారు. దీంతో సంఘటితమైన వైద్యులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను బంద్ చేశారు. వీరికి మద్దతుగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సైతం ఒకరోజు వైద్య సేవలను నిలిపి వేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. జిల్లాలో సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ఓ బాలికతో పాటు ఇద్దరు మృత్యువాత పడ్డారు.