ఇన్‌సర్వీస్ కోటా కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె
చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం.. డిమాండ్ల పరిష్కారానికి 24 గంటలు గడువిచ్చిన వైద్యుల సంఘం
రేపు ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని ప్రకటన
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించటానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవలను శనివారం నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. జీవో నంబర్ 85 వెంటనే రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేపట్టారు.
చర్చలకని పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్‌సీ వైద్యుల సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా మెరుగైన వైద్యం కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ కృష్ణబాబు పేరిట పీహెచ్‌సీలన్నింటిలో నోటీసులను ప్రదర్శించారు.
ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యులు అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లసంఖ్యను ప్రభుత్వం పెంచదా? అని ప్రశ్నించారు. డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడంతో వైద్య సంఘం ప్రతినిధులకు సాయంత్రం ఫోన్ చేసిన కమిషనర్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది.
పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ ప్రకటించారు. ఏపీ ఎన్‌జీవో, స్టాఫ్ నర్స్, సీహెచ్వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా నిలిచాయని వెల్లడించారు. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
పేదల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ పేర్కొంది. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను తెచ్చినట్టు గుర్తు చేశారు.
కోటాను గత సర్కారు క్లినికల్‌లో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతానికి పెంచగా, ఈ ప్రభుత్వం క్లినికల్‌లో 15, నాన్ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించటాన్ని నిరసిస్తున్నామన్నారు. స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోందని, అదే నిజమైతే 488 స్పెషలిస్ట్ పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు.
మరోసారి చర్చలకు పిలుస్తాం..
వైద్యులతో చర్చల సందర్భంగా ఇన్ సర్వీస్ కోటా కుదించటానికి కారణాలను వివరించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల సారాంశాన్ని మంత్రికి తెలియచేశామన్నారు. త్వరలో మళ్లీ చర్చలకు పిలుస్తామని, విధులు కొనసాగించాలని కోరారు.
రేపు చలో విజయవాడ..
మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 24 గంటలు సమయం ఇస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూనిస్‌మీర్ ప్రకటించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామన్నారు.
సెకండరీ హెల్త్, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్స్, వైద్య సిబ్బంది సంఘాలు ఇందులో పాల్గొంటాయన్నారు. సోమవారం సాయంత్రంలోగా చర్చలు జరిపి తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment