పీహెచ్‌సీ వైద్యుల స్పష్టీకరణ
ఇన్ సర్వీస్ కోటా కుదింపు జీవోపై వెనక్కు తగ్గని ప్రభుత్వం
అయినా సమ్మె విరమణకు నేతల అంగీకారం.. సంఘం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్‌సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్‌తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.
సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్‌లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు.
వైద్యులను అవమానించిన పోలీసులు
ధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు.
బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్‌లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు
Comments
Please login to add a commentAdd a comment