లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారీయెత్తున హింస చెలరేగిన పశ్చిమబెంగాల్ ఇప్పుడిప్పుడే దాన్నుంచి తేరుకుంటోంది. ఇంతలోనే మరో వివాదం ఆ రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. గత సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో వైద్యులపై రోగి బంధువులు, ఇతరులు దాడి చేసి పలువురిని గాయపర్చడం తాజా వివాదానికి కారణం. వైద్యులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి కారకులపై కఠిన చర్య తీసుకోవాలంటున్నారు. ఉన్న సమస్యను జటిలం చేసుకోవడంలో, అది మరింత తీవ్రరూపం దాల్చే పరిస్థితి తెచ్చుకోవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధహస్తులు. వైద్యుల సమ్మె విషయంలోనూ ఆమె వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా లేదు. పర్యవసానంగా వైద్యుల సమ్మె రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఉన్నతశ్రేణి ఆసుపత్రి ఎయిమ్స్ మొదలుకొని పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే లక్షలాదిమంది వైద్యులు బెంగాల్‌లో తమ సహచరులకు సంఘీభావంగా శుక్రవారం ప్రదర్శనలు నిర్వహించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనట్టయితే వచ్చే సోమవారం దేశవ్యాప్త సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రిని సందర్శించి దాడుల్లో గాయపడిన వైద్యులను పరామర్శించారు. ఇంతా జరిగాక శనివారం తాను వైద్యులతో చర్చలు జరుపుతానని మమత ముందుకొచ్చారు.
దేశంలో దాదాపు 90 శాతంమంది ప్రజానీకానికి సర్కారీ దవఖానాలే దిక్కు. రోగమొచ్చినా, అనుకోని ప్రమాదం వచ్చిపడినా ప్రైవేటు ఆసుపత్రులకు పోయే స్థోమత వారికుండదు. కనుక ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే నిరుపేదలు ఇబ్బంది పడతారు. అర్ధరాత్రీ అపరాత్రీ వైద్య సేవలందించేవారిపై దాడులు జరగడం ఆందోళనకరమే. పైగా కోల్‌కతా ఉదంతంలో అక్కడే ఉన్న పోలీస్ ఔట్‌పోస్టుకు సమాచారం ఇచ్చినా సరిగా స్పందన లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగి కన్నుమూశాక అతని బంధువులు ఇద్దరు మహిళా జూనియర్ డాక్టర్లపై చేయి చేసుకోవడం, అడ్డొచ్చినవారిపై కూడా దౌర్జన్యం చేయడం జరిగాక పోలీసులు సర్దిచెప్పి పంపేశారని, కానీ ఆ తర్వాత 200మంది ఆసుపత్రిలోకి ప్రవేశించి రాళ్లు, కర్రలతో దాడులు చేశారని, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారని వైద్యుల ఆరోపణ. సక్రమంగా వైద్యం చేయకపోవడమేకాక, నిలదీసినందుకు తమపై దాడి చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. సమ్మె మొదలయ్యాక మమతా బెనర్జీ వివిధ ఆసుపత్రులు సందర్శించి, రోగులతో మాట్లాడారు. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, విధులు నిర్వర్తించే వైద్యులకు తగిన భద్రత కల్పిస్తామని ఆమె చెప్పి ఉంటే అక్కడితో సమస్య సమసి పోయేది. కానీ రోగుల అవస్థలు ప్రత్యక్షంగా చూడటం వల్లనో, సరైన సమాచారం లేకనో ఆమె తీవ్రంగా స్పందించారు. జూనియర్ డాక్టర్లతో వాదులాటకు దిగారు. సమ్మెలో ‘బయటి శక్తులు’ ఉన్నాయని, నాలుగు గంటల్లో వైద్యులు విధులకు హాజరు కాకపోతే హాస్టళ్లనుంచి గెంటేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ప్రాణాపాయంలో ఉన్నవారెవరైనా చికిత్స అందక కన్నుమూస్తే వైద్యులనే బాధ్యుల్ని చేస్తామన్నారు. ఆమె ఒక ఆసుపత్రి దగ్గర ఇలా హెచ్చరించిన కొద్దిసేపటికే వివిధ ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు 43మంది రాజీనామాలు సమర్పించారు. మరికొందరు రాజీనామాలకు సిద్ధపడ్డారు.
మన ఆసుపత్రుల్లో వైద్యులపై దాడులు జరగడం కొత్తగాదు. మారుమూల ఆసుపత్రి మొదలుకొని ఢిల్లీలో ఎయిమ్స్ వరకూ తరచు ఇలా జరుగుతున్నాయి. విధినిర్వహణలో ఉంటున్న వైద్యుల్లో 75 శాతంమంది ఏదో రకమైన హింసకు గురవుతున్నారని రెండేళ్లక్రితం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. చావుబతుకుల్లో ఉన్న రోగులను ఆసుపత్రులకు తీసుకొచ్చినప్పుడు వారి బంధువుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. జరగరానిది జరిగితే సరైన వైద్యం లభించలేదని ఆ భావోద్వేగ పరిస్థితుల్లో అనుకుంటారు కూడా. అటువంటప్పుడే పోలీసుల అవసరం పడుతుంది. దౌర్జన్యానికి దిగేవారిని సకాలంలో అదుపు చేయడం, సర్ది చెప్పడం వారు చేయాల్సిన పనులు. పేరుకు ఆస్పత్రుల్లో ఔట్ పోస్టులుంటున్నా వైద్యులపై తరచు దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారికి తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
కోల్‌కతా ఉదంతంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఆ విషయంలో తమవైపుగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతామని, ఇకపై ఇటువంటివి జరగకుండా చూస్తామని మమతా బెనర్జీ చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ఆమె అందుకు భిన్నంగా ఆమె ఒకరకమైన నిస్సహాయతలోకి జారుకున్నారు. స్వరం పెంచి వైద్యులను బెది రించడం, ఆగ్రహావేశాలు ప్రదర్శించడం సమస్య పరిష్కారానికి ఏ మాత్రం ఉపకరించకపోగా అది మరింత ఉగ్రరూపం దాలుస్తుందని మమత గ్రహించలేకపోయారు. గవర్నర్ చొరవ తీసుకుని సమ్మె చేస్తున్న వైద్యులతో మాట్లాడటం, తాను ఈ సమస్య విషయమై ఫోన్ చేస్తే మమత అందుబాటులోకి రాలేదని చెప్పడం రాజకీయంగా ఆమెకు నష్టం చేకూర్చే పరిణామాలే. బహుశా ఇది గ్రహించబట్టే ఆమె వైద్యులతో శనివారం సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ పని ముందే చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అటు వైద్యులు కూడా తమ సమ్మె కారణంగా సమస్యతో అసలు సంబంధం లేని నిరుపేద రోగులు నానా అగచాట్లూ పడుతున్నారని గుర్తించాలి. ఏ నిరసన రూపం ఉద్దేశమైనా అంతిమంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడమే. అది నెరవేరినట్టే గనుక వైద్యులు ఆందోళన విరమించాలి.
Comments
Please login to add a commentAdd a comment