Sakshi News home page

సిగ్గు... సిగ్గు...

Published Tue, Feb 27 2024 12:01 AM

Sakshi Editorial On West Bengal Mamata Banerjee Govt

వ్యవసాయభూముల కాపాడేందుకు ఉద్యమాలు చేసి, అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన పార్టీ చివరకు అందులోనే విఫలమైతే? సదరు పార్టీ వ్యక్తులే సారవంతమైన భూముల్ని కబ్జా చేసి, స్థానికులను జీతం బత్తెం లేని బానిస కూలీలుగా మార్చి, స్త్రీలపై యథేచ్ఛగా లైంగిక అత్యాచారాలు సాగిస్తుంటే? పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ళ దీర్ఘకాల వామపక్ష సర్కార్‌పై అలుపెరుగని పోరాటాలు చేసి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ఇప్పుడు సందేశ్‌ఖలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలు ఇవే. కోల్‌కతాకు 70 కి.మీ.ల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలో సారవంతమైన భూములతో కూడిన ఈ కుగ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికి 53 రోజులైనా, అక్కడి అకృత్యాలకు మూలమని ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత షేక్‌ షాజహాన్‌ను అరెస్ట్‌ చేయకపోవడంపై కలకత్తా హైకోర్ట్‌ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి రావడం పరాకాష్ఠ.

సందేశ్‌ఖలీలో చాలాకాలంగా అకృత్యాలు సాగుతున్నా, అది ఇప్పుడు చర్చకు వచ్చింది. రేషన్‌ కుంభకోణంలో నిందితుడైన స్థానిక రాజకీయ బాహుబలి షేక్‌ షాజహాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జనవరి 5న వెళ్ళింది. వారిపై దాదాపు 2 వేల మంది దాకా షాజహాన్‌ అనుచరులు తీవ్రమైన దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, పెద్దయెత్తున స్థానిక మహిళలు బయటకొచ్చి, ధైర్యం కూడగట్టుకొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ షాజహాన్, ఆయన అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలనూ, లైంగిక అత్యాచారాలనూ బయటపెట్టారు.

ఈ ఆరోపణలతో గ్రామంలో నిరసనలు తలెత్తాయి. గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, షాజహాన్‌ ప్రధాన అనుచరులైన ఉత్తమ్‌ సర్దార్, శివప్రసాద్‌ హజ్రాల ఆస్తులపై దాడికి దిగేలా చేసింది. షాజహాన్‌నూ, అతని అనుచరులనూ అరెస్టు చేయాలని కోరుతూ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. అధికార తృణమూల్‌ అసలు నిందితుడి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంటే, ఈ వ్యవహారాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలా అని బీజేపీ చూస్తోంది. 

అధికార పార్టీ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్న నిందితుడు షేక్‌ షాజహాన్‌ది పెద్ద కథ. ‘సుందర్‌బన్స్‌ అసలు పులి’ అంటూ స్థానిక గ్రామీణులు పిలుచుకొనే అతను 2013 నుంచి తృణ మూల్‌కూ, అంతకు ముందు సీపీఐ (ఎం)కూ ఓటింగ్‌ మిషన్‌. అతను∙ఎవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. 2023 జూలై పంచాయతీ ఎన్నికల్లో సందేశ్‌ఖాలీలోని రెండు బ్లాకుల్లో 333 సీట్లుంటే, 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్‌ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలోనూ చివరకు తృణమూల్‌ జెండాయే ఎగిరింది. అలాంటి బలవంతుణ్ణి వదులుకోవడం ఎంత మమతకైనా కష్టమే.

అందులోనూ మైనార్టీ అయిన షాజహాన్‌ను పరారీలో ఉన్నాడంటూ వదిలేసి, అతని∙హిందూ సహచరు లిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బీజేపీ – ఆరెస్సెస్‌లకు అస్త్రం అందివచ్చినట్టయింది. మమత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని నిందిస్తూ ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకోవాలని కమలదళం యత్నిస్తోంది. నాలుగేళ్ళ క్రితమే పోలీసులకు ఫిర్యాదులందినా, 42 కేసులు దాఖలైనా షాజహాన్‌ను కదిలించినవారు లేదు. అతణ్ణి అరెస్ట్‌ చేస్తే మైనార్టీలు దూరమవుతారనేది మమత భయం. ఏమైనా, మోదీ పర్యటనకు వచ్చే లోపల మమత ఆ పని చేయక తప్పకపోవచ్చు. 

గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మమత ఎలాంటి ధర్నాలు చేసిందీ తెలుసు. 2007లో నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక జోన్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అక్కడకు చేరడానికి ఆమె స్కూటర్‌ వెనుక కూర్చొని ప్రయాణించడం, సింగూర్‌లో టాటా నానో కర్మాగారం ఎదుట ధర్నాలు చేయడం అందరికీ గుర్తే. తీరా మమత పాలనలో ప్రతిపక్షాలు ఆ తరహా పోరాటాలు సాగించలేకపోతున్నాయి. బీజేపీలో సైతం నేతల మధ్య సమన్వయం కొరవడింది. దాంతో, ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు మరికొద్ది రోజులే ఉన్నందున అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మార్చి తొలివారంలో ఒకటికి మూడుసార్లు బెంగాల్‌లో పర్య టించనున్నారు. రాజకీయాలు, హింసాకాండ జంటపదాలైన బెంగాల్‌ దేశంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు కాశ్మీర్‌ కన్నా ఎక్కువగా 920 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్‌లో దింపనున్నట్టు ప్రకటించింది.

సభ్యసమాజం సిగ్గుపడేలా సాగుతున్న లైంగిక అత్యాచారాలపై పార్టీలకు అతీతంగా నేతలందరూ గళం విప్పాల్సింది. తృణమూల్‌ మొదట అసలు అలాంటిదేమీ లేనే లేదని కొట్టిపారేసింది. ఆనక ఇదంతా తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కాషాయదళ స్కెచ్‌ అనీ, ఇప్పుడేమో నిందితుల్ని శిక్షిస్తామనీ పిల్లిమొగ్గలు వేసింది. ప్రతిపక్షాలేమో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని ఎలా వాడుకోగలమనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంత సాగుతున్నా, సందేశ్‌ఖలీ ఘటనల్ని సీఎం మమత గట్టిగా ఖండించిన పాపాన పోలేదు. కనీసం పోలీసులు అసలు నిందితుణ్ణి అరెస్ట్‌ చేసిందీ లేదు.

ఇది శోచనీయం. ఓ మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో, శాంతిభద్రతల పరిరక్షించాల్సిన హోమ్‌ శాఖ ఆమె చేతిలో ఉండగా ఇదీ స్త్రీల పరిస్థితి కావడం మరింత సిగ్గుచేటు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుడిదే రాజ్యంగా మారిన పరిస్థితుల్ని మార్చి, కబ్జాకు గురైన భూముల్ని అసలు యజమానులకు అప్పగించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రభుత్వంపై, ప్రజాస్వామ్యంపై జనంలో నమ్మకం నిలుస్తుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement