
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్‌కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది.
ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్‌గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.
మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు.
సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు.
కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు.
మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం.