
కోల్‌కతా: టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పోటీ చేయనున్న బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది.
ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 6న జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. సెప్టెంబరు 30న పోలింగ్, అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్థన, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. బెంగాల్‌లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్‌లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా అదే తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది.
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా వేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నటు వెల్లడించింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్-మే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 294 సీట్లలో 213 స్థానాలను కైవం చేసుకొని మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందీగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2వేల ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయినా, బెంగాల్ సీఎంగా మమత ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోరుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment