సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న 370 మంది స్టాప్ నర్సులు శాలరీ పేరుతో తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం విధులను బహిష్కరించారు. రెండు రోజుల క్రితం నిమ్స్‌కు వచ్చిన మంత్రి ఈటలను కలిసిన వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారికి సూచించారు. దీంతో ఆమె నర్సులతో సమావేశమైనా వేతనాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పెంచుతున్న వేతనం ఎంతో చెప్పాలని నర్సులు పట్టుబట్టడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీనికితోడు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కూడా అర్దాతంగా ముగియడంతో సమస్య యధాతధంగా కొనసాగుతోంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో వైద్య సౌకర్యం కల్పించాలని, స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని, శాలరీగా మార్పు చేయాలని నర్సులు కోరుతున్నారు.
ఎటూ తేల్చని యాజమాన్యం...
కాంట్రాక్ట్ స్టాప్ నర్సులకు నిమ్స్ ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.25,000 వేలు, ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్నవారికి రూ.30,000 వరకు వేతనాలు పెంచుతూ నిమ్స్ నిర్ణయం తీసుకుంది. అయితే వేతనాన్ని స్టైఫండ్‌గా పేరుతో కాకుండా శాలరీగా పేరు మార్చి ఇవ్వాలని కాంట్రాక్ట్ నర్సులు కోరుతున్నారు. స్టైఫండ్ పేరుతో వేతనాలు ఇవ్వడంతో తమకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగ్ విద్యార్థులతో సేవలు..
నిమ్స్ ఆసుపత్రిలో అసలే నర్సింగ్ సిబ్బంది తక్కువ. పర్మనెంట్ సిబ్బందితో సమానంగా కాంట్రాక్ట్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు ఆందోళన బాట పట్టడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో యాజమాన్యం నర్సింగ్ విద్యార్థులను రంగంలోకి దించింది.
విధుల్లో చేరకపోతే చర్యలు
కాంట్రాక్ట్ నర్సులు తక్షణం విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని ఆసుపత్రి మెడికల్ సూరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ అన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం వారికి వేతనాలు పెంచామన్నారు. అయితే వారు కోరుకున్నట్లు శాలరీ పేరు పర్మనెంటు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు . స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని కన్సాలిడేటెడ్ పేరుతో ఇస్తామన్నారు. ఇప్పటికైనా విధుల్లో చేరకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. –సత్యనారాయణ, నిమ్స్ సూపరింటెండెంట్
శాలరీ పేరుతో ఇవ్వాలి
ఎయిమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహించిన వారికి శాలరీ పేరుతో వేతనాలు ఇస్తున్నారు. ఇది సాధ్యపడే అంశమే. అయితే నిమ్స్ యాజమాన్యం కావాలనే దాట వేస్తోంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాకు రుణాలు ఇవ్వడం లేదు. శాలరీ పేరుతో బ్యాంకు అకౌంటులో వేస్తే మమ్ములను అన్ని విధాలుగా ఆదుకున్నవారవుతారు. –ప్రదీప్, నర్సుల ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment