నేటి నుంచి వైద్యుల సమ్మె
- ఈ నెల 30 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
- మే 16 నుంచి ఓపీ సేవల బహిష్కరణ
- జూన్ రెండు నుంచి అన్ని సేవలు నిలుపుదల
- అయినా చర్చలకు పిలవని వైద్య, ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయల కల్పన, వైద్యులకు భద్రత తదితర అనేక డిమాండ్లను ఆమోదించాలని సోమవారం(నేడు) నుంచి తెలంగాణ ప్రభుత్వ వైద్యులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు గత నెల 23న తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేశ్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి.నరహరి తదితరులు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
నోటీసు ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఉపాధ్యక్షుడు డాక్టర్ నరహరి ‘సాక్షి’కి తెలిపారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించామని, కానీ ప్రభుత్వం సమ్మెను చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. మే ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజుకో గంట నిరసన, అదే నెల 16 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఔట్‌పేషెంట్ సేవ(ఓపీ)ల బహిష్కరణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నుంచి అన్ని రకాల వైద్య సేవల బహిష్కరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆస్పత్రులు, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు సహా బోధన, బోధనేతర ఆస్పత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని నరహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికిపైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లు ఇవే...
► డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి
► గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు, జిల్లా తదితర ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి
► యూనివర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి. నిర్ణీత సమయంలోగా వైద్యులకు పదోన్నతులు కల్పించాలి
► ట్రెజరీ ద్వారానే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. వారందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి
► అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి
► తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కి పంపాలి. తప్పుడు ధ్రువీకరణపత్రాలు, డాక్యుమెంట్లు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
► ఆర్టీవో, ఏసీపీలతో సమానంగా మెడికల్ ఆఫీసర్లకు రవాణా వసతి కల్పించాలి. ప్రొటోకాల్‌ను అమలు చేయాలి
► పదో పీఆర్సీని అమలు చేయాలి. ఎరియర్స్ ఇవ్వాలి
► వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి.