వ్యాధుల గుప్పెట గిరిజనం | Half of the malaria deaths are tribals | Sakshi
Sakshi News home page

వ్యాధుల గుప్పెట గిరిజనం

Published Sun, Sep 16 2018 5:32 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Half of the malaria deaths are tribals - Sakshi

గిరిజన ప్రాంతాల్లో అంటు వ్యాధుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరోవైపు కేన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు, మానసిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.. ఇదే విషయాన్ని ఆరోగ్యంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడించింది. 2013లో గ్రామీణ వైద్య నిపుణుడు డాక్టర్‌ అభయ్‌ బంగ్‌ నేతృత్వంలో ఆరోగ్య, గిరిజన శాఖలు ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. గత ఆగస్టులో నివేదిక సమర్పించింది. స్వాతంత్య్రానంతరం గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై ఇలాంటి నివేదిక రావడం ఇదే తొలిసారి. ‘ట్రైబల్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా’శీర్షికన వెలువడిన ఈ నివేదిక ప్రకారం.. జనాభాలో 8 శాతం ఉన్న గిరిజనుల్లో 30 శాతం మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం ప్లాస్మోడియం ఫాల్సీపెరం మలేరియా బారిన పడుతున్న వారిలో గిరిజనులు 60 శాతం మంది. మొత్తం మలేరియా మృతుల్లో సగం మంది ఎస్టీలు. ఈ నేపథ్యంలో గిరిజనులు అధికంగా జీవించే 91 జిల్లాల్లో నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ కింద ట్రైబల్‌ మలేరియా యాక్షన్‌ ప్లాన్‌) అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

ప్రతి నలుగురిలో ఒకరికి..
ఊపిరితిత్తుల సంబంధిత క్షయ వ్యాధి ఇతరుల్లో (లక్ష జనాభాకు 256) కంటే గిరిజనుల్లో (703) ఎక్కువ ప్రబలుతోంది. ప్రతి నలుగురు గిరిజనుల్లో ఒకరు రక్తపోటు బారిన పడుతున్నారు. (జాతీయ సగటుతో సమానం). గనుల తవ్వకాలు, భూ సేకరణ వంటి కారణాల వల్ల ఉన్నచోటు వదిలి వలస వెళ్లాల్సిరావడం, జీవనోపాధి కోల్పోవడం, తీవ్రవాదం వల్ల చోటు చేసుకుంటున్న కల్లోల వాతావరణం, ప్రకృతి విపత్తులు గిరిజనుల్లో వ్యాధులకు, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని విశ్లేషించింది. గిరిజన సబ్‌ ప్లాన్‌ కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు తగిన నిధులు కేటాయించాలని, అన్ని రకాల ప్రభుత్వ బీమా పథకాలను ఎస్టీ లబ్ధిదారులకు వర్తింపచేయాలని సిఫారసు చేసింది.

నిధుల లేమి..?
అనేక రాష్ట్రాలు గిరిజన ఆరోగ్య సేవలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడాన్ని నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. వాస్తవిక వ్యయానికి సంబంధించి పారదర్శకత లోపించిందని పేర్కొంది. ‘తమకు వైద్యం చేసే వ్యక్తులు స్థానికులై ఉండాలని గిరిజన సమాజం కోరుకుంటోంది. ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక గిరిజనుల్ని ఆరోగ్య సేవకుల్లో భాగం చేయాల్సి ఉంది’అని నిపుణుల కమిటీ సూచించింది. దాదాపు 50 శాతం మంది గిరిజనులు సర్కారీ ఆసుపత్రుల ఓపీ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారిలో 66 శాతం మందికి పైగా గిరిజనులే. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని కమిటీ సూచించింది. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో సబ్‌సెంటర్లు (27శాతం తక్కువ), పీహెచ్‌సీలు (40 శాతం) కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (31శాతం) తగినన్ని లేకపోవడాన్ని కమిటీ ఎత్తిచూపింది.

కమిటీ సూచనలు..
- సుశిక్షితులైన గిరిజన యువ వలంటీర్లు (ఆరోగ్య మిత్రలు), దాయీలు, ఆశలతో ప్రాథమిక వైద్య సేవల్ని బలోపేతం చేయడం.. గ్రామసభల, గ్రామపెద్దల సహకారం తీసుకోవడం.. ప్రతి 50 కుటుంబాలకు ఒక ఆశ కార్యకర్తను నియమించడం.
గిరిజన ప్రాంతాల్లోని ప్రతి పీహెచ్‌సీ పరిధిలో (రెండు) వాహన ఆధారిత సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం.. వీటి ద్వారా ప్రాథమిక వైద్యం, గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, మందుల సరఫరా, అంటు వ్యాధుల నియంత్రణ తదితర సేవలు అందుబాటులోకి తీసుకురావడం.
గిరిజన ప్రాంత ఆరోగ్య ఉప కేంద్రాలను ట్రైబల్‌ హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేయడం.. తొలిదశలో ప్రతి 3వేల గిరిజనులకు ఒకæ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. ఆ తర్వాత కేంద్రాల సంఖ్య పెంచి, ప్రతి 2 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావడం సహా కమిటీ పలు విలువైన సిఫార్సులు చేసింది.

ఎస్టీల భాగస్వామ్యమే ముఖ్యం
వైద్యసేవలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో, ప్రణాళికలో, అమలులో ఎస్టీ కమ్యూనిటీల పాత్ర నామమాత్రంగా ఉండటాన్ని నివేదిక ఎత్తిచూపింది. గిరిజనుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించాల్సిన, బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement