సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం.
5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసరమైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్‌ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్పత్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్‌లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో నిర్వహిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు.
ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు.
మూడో దశలో మరో మారు హెల్త్ క్యాంప్‌లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మహిళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment