వైద్యుల సమ్మె సమాప్తం | Bengal Doctors End Strike After Meeting With Mamata benerjee | Sakshi
Sakshi News home page

వైద్యుల సమ్మె సమాప్తం

Published Tue, Jun 18 2019 3:54 AM | Last Updated on Tue, Jun 18 2019 3:54 AM

Bengal Doctors End Strike After Meeting With Mamata benerjee - Sakshi

భేటీ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడుతున్న బెంగాల్‌ సీఎం మమత

కోల్‌కతా: బెంగాల్‌లో గత ఏడు రోజులుగా వైద్యులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రుల్లో నోడల్‌ అధికారిని నియమించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.  వీలైనంత త్వరగా తామంతా విధుల్లో చేరుతామని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగారు.

సమావేశంపై ‘హైడ్రామా’..
సీఎం మమత, వైద్యుల మధ్య భేటీ విషయమై హైడ్రామా నడిచింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా లేకుండానే వైద్యులతో సమావేశం కావాలని మమత నిర్ణయించారు. అయితే ఇందుకు వైద్యులు, జూనియర్‌ డాక్టర్ల గవర్నింగ్‌ బాడీ నిరాకరించింది. మీడియా ఉంటే తప్ప చర్చలకు రాబోమని, ప్రభుత్వం చెబుతున్న వీడియో రికార్డింగ్‌ తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ భేటీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ సర్కారు రెండు ప్రాంతీయ వార్తాచానళ్లను అనుమతించింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో భద్రత, మౌలిక వసతులు సహా వైద్యులు లేవనెత్తిన అనేక సమస్యలను మమత సావధానంగా విన్నారు.

ఆగిపోయిన వైద్య సేవలు
బెంగాల్‌లో వైద్యులపై దాడికి నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో వైద్యులు నలుపురంగు బ్యాడ్జీలు ధరించి, మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలియజేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని 40,000 మందికిపైగా వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గోవాలో డాక్టర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో నల్లటి బ్యాడ్జీలు, హెల్మెట్లు ధరించిన వైద్యులు మానవహారాలుగా ఏర్పడి నిరసనను తెలియజేశారు. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో వైద్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ వైద్యుల సమ్మె గురించి తెలియని ప్రజలు ఆసుపత్రుల వద్ద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఆసుపత్రికో నోడల్‌ అధికారి
ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ఓ నోడల్‌ అధికారిని నియమించాలని సీఎం మమత పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్లపై  దాడులు జరిగితే సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పోలీస్‌ అధికారులపైనే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేసే నోడల్‌ అధికారులను ఎంపిక చేయాలన్నారు. వీరు స్థానిక పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళతారని మమత తెలిపారు. ఆసుపత్రిలో అందరికీ కనిపించేలా ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  దీనివల్ల వైద్యులపై దాడి చేయకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement