nodel officer
-
ఈవీఎంల వినియోగంలో సందేహాలను నివృత్తి పర్చిన ఈసీఐఎల్ బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ (EVM Management System-EMS 2.0) వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ నేతృత్వంలో జరిగి ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను ,అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తి పర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంల నిర్వహణలో సాదారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరొసారి ఈ శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారుల బృందం వివరించింది. అదే విధంగా జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య సమగ్రమైన వివరణను ఇచ్చారు. అసిస్టెంట్ సీఈవో పి.తాతబ్బాయ్ తో పాటు అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా?
ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలను పాటిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో గ్రీవియన్స్ & నోడల్ అధికారిగా న్యాయవాది పరేష్ బి లాల్‌ను వాట్సాప్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రీవియన్స్ & నోడల్ అధికారి న్యాయవాది పరేష్ బి లాల్ తన పదివికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన పదవి నుంచి తప్పుకోవడంతో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు బిజినెస్ ఇన్ సైడర్ కథనం తెలిపింది. ప్రస్తుతం, అతని స్థానంలో వరుణ్ లాంబాను వాట్సప్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొత్త ఐటి నియమాల ప్రకారం.. భారతదేశానికి చెందిన ముగ్గురిని చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ వ్యక్తి, గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించాల్సి ఉంటుంది. పరేష్ బి లాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను మే నుంచి అక్టోబర్ 2021 మధ్య 'అటార్నీ-గ్రీవియెన్స్ ఆఫీసర్ & నోడల్ ఆఫీసర్'గా వాట్సప్‌లో పనిచేశారు. అయితే, అతని నిష్క్రమణకు కారణం ఇంకా తెలియదు. ఇంతకు ముందు చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌గా మే 2021లో ఒకరిని నియమించినట్లు సమాచారం. అయితే, దీని గురుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు షాక్.. జనవరి 1 నుంచి?) -
కరోనా చికిత్సకి ప్రైవేట్ వైద్యనిపుణుల సహకారం
-
కరోనా చికిత్సకి ప్రైవేట్ వైద్యనిపుణుల సహకారం
సాక్షి, విశాఖట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల చికిత్సకి విశాఖ జిల్లాలో ప్రైవేట్ వైద్య నిపుణుల సహకారం తీసుకోనున్నట్లు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ అన్నారు. ఐఎమ్ఏ అధ్వర్యంలో విశాఖలో 1400 మందికి పైగా వివిధ వైద్య నిపుణులు ఉన్నారని, ఇందులో అధికశాతం వైద్య నిపుణులతో కరోనా పేషేంట్లకి చికిత్స అందించేందుకు భవిష్యత్‌లో సహకారం తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌తో కూడా చర్చిస్తున్నామన్నారు. జిల్లాలోని ఆసుపత్రులని ఎ, బి, సి క్యాటగిరీలుగా విభజించామని.. ఎ కేటగిరి ఆస్పత్రులను కేవలం కోవిడ్ పేషెంట్ల చికిత్స కోసమేనని.. బి కేటగిరి ఆస్పత్రులలో సగం బెడ్స్ని కోవిడ్ పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎ, బి కేటగిరీలలో విశాఖ సిటీలో 22 ఆసుపత్రులని గుర్తించామని ఇందులో 14 ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల కోసమే నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ ఏర్పాటవుతోందన్నారు. కాగా.. పెరుగుతున్న కేసులకి తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లకి సిద్దమవుతున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. (అక్టోబర్‌లో 5 స్కిల్ కాలేజీల ప్రారంభం: మంత్రి) -
వైద్యుల సమ్మె సమాప్తం
కోల్‌కతా: బెంగాల్లో గత ఏడు రోజులుగా వైద్యులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా తామంతా విధుల్లో చేరుతామని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగారు. సమావేశంపై ‘హైడ్రామా’.. సీఎం మమత, వైద్యుల మధ్య భేటీ విషయమై హైడ్రామా నడిచింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా లేకుండానే వైద్యులతో సమావేశం కావాలని మమత నిర్ణయించారు. అయితే ఇందుకు వైద్యులు, జూనియర్ డాక్టర్ల గవర్నింగ్ బాడీ నిరాకరించింది. మీడియా ఉంటే తప్ప చర్చలకు రాబోమని, ప్రభుత్వం చెబుతున్న వీడియో రికార్డింగ్ తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ భేటీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ సర్కారు రెండు ప్రాంతీయ వార్తాచానళ్లను అనుమతించింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో భద్రత, మౌలిక వసతులు సహా వైద్యులు లేవనెత్తిన అనేక సమస్యలను మమత సావధానంగా విన్నారు. ఆగిపోయిన వైద్య సేవలు బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో వైద్యులు నలుపురంగు బ్యాడ్జీలు ధరించి, మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలియజేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని 40,000 మందికిపైగా వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గోవాలో డాక్టర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో నల్లటి బ్యాడ్జీలు, హెల్మెట్లు ధరించిన వైద్యులు మానవహారాలుగా ఏర్పడి నిరసనను తెలియజేశారు. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో వైద్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ వైద్యుల సమ్మె గురించి తెలియని ప్రజలు ఆసుపత్రుల వద్ద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రికో నోడల్ అధికారి ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ఓ నోడల్ అధికారిని నియమించాలని సీఎం మమత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్లపై దాడులు జరిగితే సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పోలీస్ అధికారులపైనే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేసే నోడల్ అధికారులను ఎంపిక చేయాలన్నారు. వీరు స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళతారని మమత తెలిపారు. ఆసుపత్రిలో అందరికీ కనిపించేలా ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వైద్యులపై దాడి చేయకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు. -
బెంగాల్లో నోడల్ అధికారి అదృశ్యం
కృష్ణానగర్ (పశ్చిమబెంగాల్): సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను పర్యవేక్షించే నోడల్ అధికారి అదృశ్యమయ్యారు. దీంతో జిల్లా యంత్రాంగంతో పాటు బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాణాఘాట్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ ప్రాంతానికి అర్నబ్ రాయ్(30)ను ఈసీ నోడల్ అధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో గత గురువారం ఇక్కడి బిప్రదాయ్ చౌదరీ పాలిటెక్నిక్ కాలేజీలో విధుల నిర్వహణకు కారులో బయలుదేరారు. అయితే ఎన్నికల విధులకు హాజరైన రాయ్, తిరిగి ఇంటికి రాలేదు. ఆయన కారు మాత్రం పాలిటెక్నిక్ కళాశాల ముందు లభ్యమైంది.అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఈసీ జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. -
నగదు కొరతపై ప్రత్యేక సమీక్ష
జిల్లాకు నోడల్ అధికారిగా ముఖేష్ కుమార్ మీనా కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరతపై సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. నగదు కొరత తీవ్రంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంతో ప్రభుత్వం ఈయనను జిల్లాకు నోడల్ అధికారిగా నియమించింది. ఈమేరకు ఆయన శుక్రవారం కర్నూలుకు వచ్చి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చాంబరులో సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఎంత, నగదు లభ్యత ఎంత ఉంది.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రస్తుతం జిల్లాలో నగదు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి, డిసెంబరు మొదటి వారం అయినందున ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తున్నారు తదితర వాటిని సమీక్షించారు. పట్టణ, గ్రామీణ ప్రజలందరినీ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించడం దిశగా మళ్లించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఎల్డీఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ
విశాఖట్నం: విశాఖలో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ ఎల్బీహెచ్ దేవి తెలిపారు. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళల్లో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం నగరంలోని రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ మహిళల గొంతునుంచి స్రావాలను సేకరించి పరీక్షలకు పంపగా వారికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ అయినట్లు శనివారం సాయంత్రం నివేదిక అందింది. అదే విధంగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. అతన్ని నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ నగరంలో 37 మందికి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణ కాగా అందులో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో బాధితుల సంఖ్య 40కి చేరుకుంది.