నగదు కొరతపై ప్రత్యేక సమీక్ష
జిల్లాకు నోడల్ అధికారిగా ముఖేష్ కుమార్ మీనా
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరతపై సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. నగదు కొరత తీవ్రంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంతో ప్రభుత్వం ఈయనను జిల్లాకు నోడల్ అధికారిగా నియమించింది. ఈమేరకు ఆయన శుక్రవారం కర్నూలుకు వచ్చి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చాంబరులో సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఎంత, నగదు లభ్యత ఎంత ఉంది.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రస్తుతం జిల్లాలో నగదు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి, డిసెంబరు మొదటి వారం అయినందున ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తున్నారు తదితర వాటిని సమీక్షించారు. పట్టణ, గ్రామీణ ప్రజలందరినీ ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం దిశగా మళ్లించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఎల్‌డీఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.