సాక్షి, విశాఖట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల చికిత్సకి విశాఖ జిల్లాలో ప్రైవేట్ వైద్య నిపుణుల సహకారం తీసుకోనున్నట్లు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ అన్నారు. ఐఎమ్‌ఏ అధ్వర్యంలో విశాఖలో 1400 మందికి పైగా వివిధ వైద్య నిపుణులు ఉన్నారని, ఇందులో అధికశాతం వైద్య నిపుణులతో కరోనా పేషేంట్లకి చికిత్స అందించేందుకు భవిష్యత్‌లో సహకారం తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌తో కూడా చర్చిస్తున్నామన్నారు.
జిల్లాలోని ఆసుపత్రులని ఎ, బి, సి క్యాటగిరీలుగా విభజించామని.. ఎ కేటగిరి ఆస్పత్రులను కేవలం కోవిడ్ పేషెంట్ల చికిత్స కోసమేనని.. బి కేటగిరి ఆస్పత్రులలో సగం బెడ్స్‌ని కోవిడ్ పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎ, బి కేటగిరీలలో విశాఖ సిటీలో 22 ఆసుపత్రులని గుర్తించామని ఇందులో 14 ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల కోసమే నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ ఏర్పాటవుతోందన్నారు. కాగా.. పెరుగుతున్న కేసులకి తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లకి సిద్దమవుతున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment