మాతృత్వం ఓ వరం. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో గర్భిణులకు ఎదురయ్యే సవాళ్లు.. ఇబ్బందులు వర్ణనాతీతం. గర్భిణులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ.. శిశువును నవ మాసాలు మోస్తూ కాన్పు
సమీపిస్తున్న కొద్దీ మరింత అప్రమత్తంగా ఉంటారు. రక్తహీనత, పోషకాహార లేమితో సతమతమయ్యే గర్భిణులు.. రెండేళ్లుగా కోవిడ్ విసురుతున్న సవాళ్లకు ఎదురీదుతున్నారు. కరోనా వేళ.. కాబోయే అమ్మకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా వైద్య శాఖ వీరి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి.. తద్వారా వారికి అవసరమైన సేవలందిస్తోంది.
– సాక్షి, విశాఖపట్నం
కరోనా మహమ్మారి భయపెడుతోంది. నిన్న మొన్నటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు నేడు వందలు దాటి వేలకు చేరుకుంటున్నాయి. ఒక పక్క ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. మరో పక్క సెకండ్‌వేవ్‌లో చుట్టేసిన డెల్టా వేరియంట్, సీజనల్ జ్వరాలు విస్తరిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా రెండో దశతో పోల్చితే థర్డ్ వేవ్‌ను ఎందుర్కొనేందుకు ముందస్తుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 7,531 ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్‌లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు నోడల్ అధికారులను నియమించింది. జిల్లాలో 15 ఏళ్లు దాటిన వారికి దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తయింది.
మొదటి, రెండో దశల్లో 4,012 మంది గర్భిణులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో పాటు వారికి రక్షణగా నిలుస్తోంది. గర్భిణుల్లో బీపీ, మధుమేహం, ఇతర రుగ్మతలున్న వారిని ముందుగానే గుర్తించి.. వారికి వ్యాక్సినేషన్ పూర్తయిందా.. లేదా అని ఆరా తీసుకున్నారు. ఒక వేళ టీకా వేసుకోకపోతే నేరుగా వారి ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ వేసే బాధ్యతను స్థానిక ఏఎన్‌ఎంలకు అప్పగించారు. కరోనా మూడో దశలో భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా.. జిల్లా ఉన్నతాధికారులు తరచూ వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తం చేస్తున్నారు. మూడు నెలలు నిండిన గర్భిణి నుంచి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, ప్రసవం అయిన తర్వాత శిశువుకు మెరుగైన వైద్యం అందించడం, అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు నిర్వర్తిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పీహెచ్‌సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నారు.
‘తల్లీబిడ్డ’సంరక్షణకు ప్రాధాన్యం
కరోనా వేళ తల్లీబిడ్డ జాగ్రత్తగా ఉండాలంటే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళితే ఎలాంటి వైరస్‌లు దరిచేరవు. ఇంటిలో ఉన్నా.. ఆస్పత్రిలో ఉన్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక బాలింతలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. గర్భిణులు కూడా కడుపులో ఉన్న బిడ్డను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు అనుసరించాలి. పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే కరోనా కష్టకాలాన్ని సులభంగా అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
కరోనా విజృంభిస్తున్న వేళ బాలింతలు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా ఉధృతి తగ్గేవరకు ఇంటికే పరిమితం కావాలి. ఇతరులతో పలకరింపులు కూడా తగ్గించుకోవాలి. జలుబు, జ్వరం, ఇతర వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడం..భౌతిక దూరాన్ని పాటించడం మరిచిపోవద్దు. ఈ కొద్ది కాలం గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాల్సిందే..
– డాక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో
బర్త్ వెయిటింగ్ హాళ్లు
ప్రసవ సమయంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో ‘బర్త్ వెయింటిక్ హాళ్లు–ప్రెగ్నెంట్ వుమెన్ హాస్టల్’ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పరిధిలోని మొత్తం 15 బర్త్ వెయింటింగ్ హాళ్లలో కరోనా నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రసవం తేదీకి 10 రోజుల ముందు నుంచే వారి పర్యవేక్షణ బాధ్యతలు, కరోనా జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఆచరించేలా చూసే బాధ్యతలను ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఓ డాక్టర్‌కు అప్పగించారు.
అనుక్షణం అప్రమత్తం
► కరోనా వేళ గర్భిణులు, బాలింతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
► రెండు గంటలకు ఒకసారి 20–40 సెకన్ల పాటు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో పూర్తిగా శుభ్రపరుచుకోవాలి.
► బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌ను ధరించాలి.
► కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
► ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే ఏఎన్‌ఎంలను సంప్రదించి.. టీకా తీసుకోవాలి.
► బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
► ఇంటిలో కుటుంబ సభ్యులతో మెలిగే సమయంలో మీటరు దూరం ఉండేలా చూసుకోవడంతో పాటు వీలైనంత మేర మాస్క్ ధరించడం మంచిది.
► ఎక్కువగా జనం ఉన్న రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు.
► ఇరుగు పొరుగు వారితో కూడా గతంలో లాగా గుంపులుగా కూర్చొని చర్చలు నిర్వహించకుండా ఇంటికే పరిమితం కావడం మంచిది.
17 అంబులెన్స్‌ల ద్వారా సేవలు
జిల్లా వ్యాప్తంగా యాంటినాటల్ మెటర్నటీ చెకప్‌కు 17కు పైగా 108 అంబులెన్స్‌లను కేటాయించారు. ఐటీడీఏ పరిధిలో 8, మిగతా నియోజవర్గాల్లో 9 అంబులెన్స్‌ల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు, తర్వాత అంబులెన్స్ మొత్తం శానిటైజేషన్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment