ఎస్మా ప్రయోగించరా?
► వైద్యశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
► వైద్యులతో మంత్రి చర్చలు విఫలం
► 17వ రోజుకు చేరిన సమ్మె
సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యుల సమ్మెతో చికిత్స అందక రోగులు అల్లాడుతున్నారు, వైద్యులపై ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహించింది. కోర్టుకు రప్పించి మరీ పలు ప్రశ్నలతో నిలదీసింది. పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయరాదనే కోర్కెపై వైద్యులు గత నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుపుతున్నారు. శుక్రవారం నాటికి ఈ సమ్మె 17వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ వైద్యులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్దులు సైతం సమ్మెకు దిగి వివిధ రీతుల్లో తమ నిరసనలు ప్రకటిస్తున్నారు. వైద్య మంత్రి విజయభాస్కర్ సమ్మె ప్రారంభంలో జరిపిన చర్చలు విఫలమైనాయి. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం సేవలు స్థంభించిపోయాయి.
ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సైనికుడు సుబ్రమణి చికిత్స అందక గురువారం ప్రాణాలు విడవడం మరి విషాదంగా మారింది. కాగా రోగులు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో కడలూరుకు చెందిన న్యాయవాది ఏకే వేలన్ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. వైద్యుల సమ్మె వల్ల ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సేవలపైనే ఆధారపడి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సైతం పడకేయడంతో గ్రామీణుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితి ప్రజలకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి వైద్యులు సమ్మెను విరమించుకునేలా వెంటనే ఆదేశించాలని పిటిషన్‌లో ఆయన కోరారు.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, పార్దిబన్‌లతో కూడిన బెంచ్‌కు శుక్రవారం విచారణకు వచ్చింది. వైద్యల సమ్మె వల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే, రోగులు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన చికిత కోసం ప్రభుత్వం ఏమీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, వైద్యుల చేత సమ్మెను విరమింపజేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో సవివరమైన నివేదికతో శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టుకు హాజరుకావాలని డాక్టర్ రాధాకృష్ణన్‌ను న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్ హడావిడిగా వైద్యుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు.
ఇదిలా ఉండగా, మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కార్యదర్శి రాధాకృష్ణన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ, వైద్యుల సమ్మెను ముగించేందుకు ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించారు. అత్యవసర సేవల ఉండేవారు విధులను బహిష్కరించిన పక్షంలో ఎస్మా చట్టం కింద అరెస్ట్ చేసి ఆరు నెలలపాటూ జైలుకు పంపవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి వైద్యులను రెచ్చగొట్టే ధైర్యం చేయలేక పోయింది. కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైద్యుల సమ్మె వల్ల రోగులు ఇబ్బంది పడకుండా తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించానని చెప్పారు. చర్చల ద్వారా వైద్యుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని న్యాయమూర్తులు సూచించినట్లు తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వానికి వైద్యుల నుండి రెండువారాల గడువును కోరనున్నట్లు ఆయన చెప్పారు.