సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది.
సమస్యల పరిష్కారం కోసం గతనెలలో ప్రభుత్వానికి 104 ఉద్యోగులు సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే, 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేమిటీ ఎస్మా చట్టం? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు పరిశీలిస్తే..
‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.
కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు కోరుతూ.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం చేసింది.
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినా.. దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment