హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు: అశోక్ బాబు
హైదరాబాద్ : ఎస్మాకు భయపడేది లేదని....అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశాడు. హైదరాబాద్ ఎవరి సొంతం కాదని, సభ జరిపి తీరుతామని ఆయన ప్రకటించారు. సీమాంధ్ర జిల్లాలోని ఉద్యోగులపై ఎస్మా(ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భయపడేది లేదని ఉద్యోగులు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెలో వెళ్లారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో పరిపాలన స్తంభించి పోయింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నో-వర్క్... నో-పే’ అంటూ జీవో నెంబర్ 177 అమలు చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తొలుత ఖజానా, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ శాఖలు వాటి అనుబంధ విభాగాలపై సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రధాన శాఖలకు చెందిన ఆఫీసు సబార్డినేట్ నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు.