ESMA
-
ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. సమస్యల పరిష్కారం కోసం గతనెలలో ప్రభుత్వానికి 104 ఉద్యోగులు సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే, 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమిటీ ఎస్మా చట్టం? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు పరిశీలిస్తే..‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు కోరుతూ.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం చేసింది.ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినా.. దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. -
AP: ఎస్మా పరిధిలోకి అంగన్వాడీ సర్వీసులు
సాక్షి, విజయవాడ: అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాష్ట్రంలోని అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. ఆరు నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలు నిషేధించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదీచదవండి.. సంక్రాంతికి స్పెషల్ రైళ్లు -
వైద్యులను హెచ్చరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఇండోర్: మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క ఇండోర్‌లోనే నమోదవుతుండటం అక్కడి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా విజృంభిస్తున్న ఈ నగరంలో మరింతమంది వైద్యుల అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలో 32 మంది సీనియర్ డాక్టర్లతో పాటు మరో 70 మంది వైద్యులను ఇండోర్‌కు వెళ్లాల్సిందిగా ఏప్రిల్ 11న ఆదేశాలు జారీ చేసింది. అయితే బుధవారం నాటికి కొంతమంది వైద్యులు మాత్రమే ఇండోర్‌కు చేరుకున్నారు. మిగతావారు అక్కడి కోవిడ్-19 ఆసుపత్రుల్లో సేవలందించేందుకు నిరాకరించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెంటనే ఇండోర్‌కు వెళ్లాల్సిన వైద్యుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న వైద్యులందరూ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు అక్కడికి చేరుకోవాలని డెడ్‌లైన్ విధించింది. (లాక్డౌన్: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!) అయినప్పటికీ విధులకు వెళ్లడానికి నిరాకరిస్తే సదరు డాక్టర్లపై ఎస్మా నిబంధనల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏప్రిల్ 8న అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) విధించిన సంగతి తెలిసిందే. ఇందులో వైద్యం, అంబులెన్స్ సేవలు, ఔషధాల కొనుగోలు- సరఫరా, నీటి సరఫరా, విద్యుత్, ఆహారం, తాగు నీరు, రక్షణకు సంబంధించిన పది సేవలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో 987 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క ఇండోర్‌లోనే కేసుల సంఖ్య 544కు చేరింది. (హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ..) -
సమ్మెకు దిగితే వేటు!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల క్రమబద్ధీకరణతో సహా మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ ట్రాన్స్‌కో తీవ్రంగా స్పందించింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల (ఆర్టిజన్లు)కు వర్తించదని, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణమే సమ్మె పిలుపును వెనక్కి తీసుకోవాలని కోరింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగితే నోటీసులు, వేతనాలు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉందని హెచ్చరించింది. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన సమ్మె నోటీసుకు బదులిస్తూ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు గురువారం యూనియన్ ప్రధాన కార్యదర్శికు లేఖ రాశారు. సమ్మెకు దిగడం, ఇతరులు సమ్మెకు దిగేలా రెచ్చగొడితే సంస్థ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అన్ని రకాల సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగులను విలీనం చేస్తూ గతంలో యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిందని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరడం న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని తప్పుపట్టారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి రారని, వారిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు లేదని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. గ్రేడ్–4 ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు.. విద్యుత్ సంస్థల్లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్న గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వరుసగా గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4 ఆర్టిజన్లుగా విద్యుత్ సంస్థలు విలీనం చేసుకున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులుగా నైపుణ్యంతో కూడిన పనులు చేసినా సరైన విద్యార్హతలు లేకపోవడంతో విలీన ప్రక్రియలో కొందరు విద్యుత్ ఉద్యోగులను ఆర్టిజన్ గ్రేడ్–4గా నియమించారు. దీంతో వారు కాంట్రాక్టు ఉద్యోగిగా పొందిన వేతనం కంటే విలీనం తర్వాత వారికి వచ్చే వేతనం తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయారు. గత వేతనానికి సమానంగా ప్రస్తుత వేతనం పెంచేందుకు గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లు సైతం వర్తింపజేయనున్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
దుర్గగుడి ఉద్యోగులపై ఉక్కుపాదం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన దుర్గగుడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. రాబోయే ఆరునెలల్లో సిబ్బంది సమ్మెలు, ధర్నాలు చేయకుండా ఈచట్టం అడ్డుకుంటుంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెలపై ఉపయోగించాల్సిన ఈ చట్టాన్ని దుర్గగుడి సిబ్బందిపై ప్రయోగించడం చర్చనీయాశంగా మారింది. దేవాలయంలోని కేశఖండనశాల, విద్యుత్, మంచినీటి సరఫరా, వైద్యం, అన్నదానం, ట్రాన్స్‌పోర్టు, పారిశుధ్యం, ఆలయ నిర్వహణ విభాగాల్లో సిబ్బంది నమ్మెలో పాల్గొనడాన్ని నిషేధిస్తూ తొలిసారిగా ఈ చట్టం ప్రభుత్వం ప్రయోగించింది. కమిషన్ కాకుండా కనీస వేతనం ఇవ్వమంటూ నాయీ బ్రాహ్మణులు ఇటీవల రోడ్డెక్కిన విషయం విధితమే. అయితే అప్పటికప్పుడు వారు రోడ్డెక్కలేదు. నిబంధనల మేరకు ముందుగా నోటీసు ఇచ్చిన తరువాతనే సమ్మె చేశారు. కనీస వేతనాలు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కోరి ఆయన ఆగ్రహాన్ని నాయి బ్రాహ్మణులు చవిచూశారు. అది చాలదన్నట్లు వారికి ఇప్పుడు ప్రభుత్వం బహుమతిగా ఎస్మా చట్టాన్ని ఇచ్చింది. ఇక నుంచి తమ ఆవేదనను చెప్పుకోకుండా గొంతు నొక్కేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.... దేవస్థానంలో సుమారు 250 మంది రెండు దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 19 మంది న్యాయస్థానానికి వెళ్లగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వీరిని పర్మినెంట్ చేసే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. చివరికి తమ నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేయడం సరికాదంటున్నారు. ఇటు సిబ్బందికీ, భక్తులకు అటు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాల్సిన దేవస్థానం పాలకమండలి పూర్తిగా విఫలమైంది. పాలకమండలిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎస్మాచట్టం ప్రయోగించింది. ఆరునెలలు ముగిసే ముందు మరో ఆరునెలలు వరకు ఈ చట్టాన్ని పొడిగించి ఎన్నికల్లో వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. -
సమ్మె చేస్తున్న వైద్యులపై 'ఎస్మా'స్త్రం
న్యూఢిల్లీ: సమ్మె చేస్తున్న రెసిడెంట్ వైద్యులపై ఢిల్లీ ప్రభుత్వం 'ఎస్మా' ప్రయోగించింది. ఈ ఉదయం 11 గంటలలోపు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్లు తమ ఆదేశాలను బేఖతారు చేయడంతో కేజ్రీవాల్ సర్కారు ఎస్మా ప్రయోగించింది. దేశ రాజధానిలోని 20 ఆస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2 వేల మంది డాక్టర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక ఆందోళనకు దిగారు. అవసరమైన ఔషధాలు సరిపడా సరఫరా చేయాలని, ఆస్పత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని, జీతాలు సకాలంలో ఇవ్వాలని వైద్యులు డిమాండ్ చేశారు. అయితే వైద్యుల 19 డిమాండ్లను తాము ప్రభుత్వం ఆమోదించిందని ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేంద్రం, ఎంసీడీ ఆమోదం కూడా కావాలని వైద్యులు పట్టుబడుతున్నారని వెల్లడించారు. -
సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా
కృష్ణా: రెండు రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. విధులకు హాజరు కాని కృష్ణా జిల్లా తిరువూరు డిపోకు చెందిన 33 మందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించినట్లు ఉన్నతాధికారులు గురువారం తెలిపారు. హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన తమపై ఇలాంటి చర్యలు సరికాదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (తిరువూరు) -
'ఆరు నెలల పాటు డిబార్ చేస్తాం'
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించబోమని జూనియర్ వైద్యులను తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఎస్మా ప్రయోగించేందుకు వెనుకాడబోమని తెలంగాణ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. సమ్మెలో పాల్గొన్న జూనియర్ డాక్టర్లను ఆరు నెలల పాటు డిబార్ చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సమ్మెను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. జీవో 107 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల పరిధిలోని 1,700 మంది జూనియర్ వైద్యులు అత్యవసర విధులు సైతం బహిష్కరించి గత 22 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూడాలు స్పష్టం చేశారు. -
సీమాంధ్ర సమ్మెపై సర్కారు ఎస్మాస్త్రం
సీమాంధ్ర జిల్లాల్లో రెండు ప్రధాన ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అస్త్రం ప్రయోగించింది. దాదాపు 60 రోజుల నుంచి ఉధృతంగా సమ్మె సాగుతుండటం, ఒక్క కార్యాలయం కూడా తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా ట్రెజరీ, అకౌంట్స్ శాఖల సిబ్బంది కూడా ఉధృతంగా సమ్మె చేయడం వల్ల ప్రభుత్వానికి కాళ్లు, చేతులు ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎస్మా అస్త్రాన్ని ప్రభుత్వం బయటకు తీసింది. సీమాంధ్ర జిల్లాల్లో ట్రెజరీ, అకౌంట్స్ విభాగాల సిబ్బంది ఎవరూ సమ్మెలు చేయడానికి వీల్లేదని, అలాగే బంద్ చేయడాన్ని కూడా నిషేధిస్తున్నామని ఈ ఉత్తర్వులలో పేర్కొంది. అత్యవసర విభాగాలు మినహా సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న మొత్తం అన్ని విభాగాల సిబ్బంది సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. మునిసిపాలిటీలలో కూడా పారిశుధ్య సిబ్బంది తప్ప అంతా సమ్మెలోనే ఉంటున్నారు. -
హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు: అశోక్ బాబు
హైదరాబాద్ : ఎస్మాకు భయపడేది లేదని....అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశాడు. హైదరాబాద్ ఎవరి సొంతం కాదని, సభ జరిపి తీరుతామని ఆయన ప్రకటించారు. సీమాంధ్ర జిల్లాలోని ఉద్యోగులపై ఎస్మా(ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భయపడేది లేదని ఉద్యోగులు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెలో వెళ్లారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో పరిపాలన స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నో-వర్క్... నో-పే’ అంటూ జీవో నెంబర్ 177 అమలు చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తొలుత ఖజానా, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ శాఖలు వాటి అనుబంధ విభాగాలపై సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రధాన శాఖలకు చెందిన ఆఫీసు సబార్డినేట్ నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు. -
‘ఎస్మా’కు భయపడం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాలోని ఉద్యోగులపై ఎస్మా(ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భయపడేది లేదని ఉద్యోగులు అంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెలో వెళ్లారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో పరిపాలన స్తంభించి పోయింది. శనివారం జిల్లా అధికారుల సంఘం సైతం సమైక్యాంధ్ర దీక్షలో పాల్గొన్న ఎన్జీవోలకు సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నో-వర్క్... నో-పే’ అంటూ జీవో నెంబర్ 177 అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తొలుత ఖజానా, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ శాఖలు వాటి అనుబంధ విభాగాలపై సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రధాన శాఖలకు చెందిన ఆఫీసు సబార్డినేట్ నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ స్థాయి అధికారిపై ఎస్మా ప్రయోగించాలో తెలియలేదని సంబంధిత శాఖల అధికారులు అంటున్నారు. దీనికి తోడు ‘ఎస్మా’కు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఉత్తర్వులు అందలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. వంద కోట్ల నష్టం జిల్లాలోని 64 శాఖల్లోని దాదాపు 40 వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. ప్రధానంగా మూడు శాఖలకు సంబంధించి 600 మంది 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో ఐదు రోజులకు గాను జిల్లా ఖజానాకు దాదాపు వంద కోట్ల రూపాయల గండి పడింది. మరో వైపు రవాణా శాఖ ఉద్యోగులు సైతం సమ్మె చేయడమే కాకుండా చెక్‌పోస్టులు సైతం మూసివేయడంతో ప్రభుత్వానికి ఆదాయం మరింతగా తగ్గుతోంది. శాఖల్లోని ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా సమ్మెను వీడి విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఎస్మా ఎవరిపై ప్రయోగిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎస్మా ప్రయోగానికి భయపడేది లేదు ఎస్మాకు భయపడి విధులకు హాజరువుతామని ప్రభుత్వం అనుకుంటే పొరబాటు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. భావితరాల భవిష్యత్, ఉద్యోగుల ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర కోసం పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలోని ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ప్రజలకు భద్రత కరువయింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు గణనీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వీరి కోసం మా పోరాటాలు కొనసాగిస్తాం. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. - ఎస్.సుబ్రమణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమ సంఘం -
అరెస్టులతో ఆగదు..
* సమైక్య సమ్మెపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు స్పష్టీకరణ * ఉద్యమానికి నాయకుల కొరత లేదు * అన్ని శాఖల్లో ఎస్మా పెట్టినా భయపడం * సీమాంధ్ర ఎంపీల రాజీనామాల కోసమే సమ్మె * ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ * నేటి నుంచి సమ్మెలోకి పశుసంవర్థక శాఖ అధికారులు * 21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా... * న్యాయశాఖ ఉద్యోగుల మద్దతు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేయడం లేదని, సీమాంధ్ర ఎంపీల రాజీనామాలే లక్ష్యంగా చేస్తున్నామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పునరుద్ఘాటించారు. 177 జీవో(నో వర్క్ నో పే), ఎస్మా వల్ల సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత ఒక్క డిగ్రీ కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఎస్మా ప్రయోగించి సమ్మెకు నేతృత్వం వహిస్తున్న నేతలను అరెస్టు చేసినా ఉద్యమం ఆగిపోదన్నారు. ఉద్యమానికి నాయకుల కొరత లేదని చెప్పారు. భయపెట్టి ఉద్యోగుల సమ్మెను ఆపడం సాధ్యం కాదన్నారు. సమ్మె కాలానికి తాము జీతాలు అడిగే ప్రసక్తే లేదన్నారు. అన్ని శాఖల్లో ఎస్మా ప్రయోగించినా భయపడబోమన్నారు. దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, అందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టినా ఉద్యమం ఆగదన్నారు. అంతమందిని పెట్టే జైళ్లు ఉంటే అరెస్టులు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశం అనంతరం ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, న్యాయవాది జంద్యాల రవిశంకర్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు సమ్మె కొనసాగించి తీరుతామన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సీమాంధ్ర విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికే కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం మీద రుద్దారంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 2 నెలల జాప్యం జరగడానికి ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా.. ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని టీచర్లు నిర్ణయించారని అశోక్‌బాబు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులూ సమ్మెకు మద్దతు ప్రకటించారన్నారు. వేదిక సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచామన్నారు. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, వైఎస్సార్సీపీ నుంచి చల్లా మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి హైదరాబాద్‌లో సభ ఎప్పుడు, ఎక్కడ పెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించడం హైదరాబాద్ సభ లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీమాంధ్ర ప్రతినిధే అయినా సమైక్యవాదానికి ఎందుకు మద్దతు ప్రకటించడం లేదు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈనెలాఖరులో హైదరాబాద్‌లో సభ నిర్వహించే అవకాశం ఉందని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి చెప్పారు. ఈనెల 27న పాలకొల్లులో కళాకారులు, రచయితలకు ‘సమైక్య’ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయనున్నామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు కూడా విధులకు గైర్హాజరయ్యే దిశగా ఆలోచిస్తున్నారని బార్‌కౌన్సిల్ సభ్యుడు చిదంబరం తెలిపారు. ఈనెల 31 వరకు సీమాంధ్రలోని కోర్టుల్లో విధులకు హాజరుకాకూడదని న్యాయవాదులు ఇప్పటికే నిర్ణయించారన్నారు. మరోవైపు పశుసంవర్థకశాఖలో సీమాంధ్ర అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. బెదిరేది లేదు... ఏలూరు: తమ శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించినా బెదిరేది లేదని, సమైక్యాంధ్ర కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొంటామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.హరనాథ్ ఏలూరులో ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. అత్యవసర సేవలందించే శాఖ కూడా కాని పే అండ్ అకౌంట్స్‌పై సమైక్యవాది అయిన ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం బాధాకరమన్నారు. ఎస్మాకు భయపడం: సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఉద్ఘాటన విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోందని, అయితే వాటికి భయపడేదే లేదని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం 3 లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని, ఎవరిపై చట్టం ప్రయోగిస్తారో ప్రభుత్వం నిర్ణయించుకోవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 21 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేస్తామని కన్వీనర్ ఎం. కమలాకరరావు ప్రకటించారు. సమ్మెకు వెళ్లడానికి ముందు రిలే దీక్షలు చేపట్టాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు సూచించారు. ఒకటి రెండు సంఘాలు సమ్మెలోకి రాలేదని, వారిని కూడా ఒప్పించి సమ్మెలో పాల్గొనేలా చేస్తామన్నారు. తిరుపతిలో ఎంపీ వీహెచ్‌పై దాడి ఘటనను సమావేశం ఖండించింది. సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల పుల్లయ్య, సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వి.అప్పారావు, డి. ఈశ్వరరావు, డి. గోపీనాథ్, ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరరావు, మణి, జి.వి నారాయణరెడ్డి, గిరిప్రసాద్‌రెడ్డి, 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సకలం సమైక్యం
రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయడాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్జీవోలతోపాటు పలు ఉద్యోగ సంఘాల జేఏసీలు సమైక్యాంధ్ర పరిరక్షణకు మద్దతు ప్రకటిస్తూ సమ్మె చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో పాలుపంచుకుంటూ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రభుత్వం ప్రకటించిన ‘ఎస్మా’ను కూడా లెక్కచేయ బోమని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర కోసం ఇరవై రోజుల నుంచి ఉధృతంగా జరుగుతున్న ఆందోళనలు సెలవురోజైన ఆదివారం కూడా అదే రీతిలో కొనసాగాయి. రోజుకో రకంగా వినూత్నరీతిలో నిరసన తెలుపుతూ.. సమైక్యతే మా నినాదం అంటున్నారు. జగ్గయ్యపేటలో ఎన్జీవో జేఏసీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన యోచనను కాంగ్రెస్ సర్కార్ మానుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉధయభాను సతీమణి విమలభాను ఆధ్వర్యంలో మహిళలు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ ఆవరణలో వంటావార్పు నిర్వహించి ఆటలాడారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఆళ్లూరుపాడు, వత్సవాయి గ్రామస్తులు ర్యాలీలు నిర్వహించారు. నందిగామలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలు గాంధీ సెంటర్లో రోడ్లను శుభ్రంచేసి నిరసన తెలిపారు. లాండ్రీ యూనియన్, రజక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపారు. చల్లపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లు, వైద్య సిబ్బంది, మెడికల్‌షాపుల యజమానులు, సిబ్బంది రామానగరం నుంచి చల్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మద్దతు తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. విస్సన్నపేటలో ఆర్యవైశ్య కల్యాణమండపం వద్ద వాసవీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గంపలగూడెంలో టీడీపీ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించింది. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. మండవల్లిలో ఎనిమిదో రోజు దీక్షలో బోయిన అర్చన అనే రెండేళ్ల చిన్నారి కూర్చుంది. గుడివాడ-భీమవరం జాతీయ రహదారిపై వంటలు వండి రోడ్లపైనే భోజనం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సెంటర్లో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. పామర్రులో వీరాంజ నేయ తాపీ వర్కర్స్ యూనియన్, విశ్వకర్మ కార్పెంటర్స్, ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు, ఫొటోగ్రఫీ, విడియోగ్రఫీ వర్కర్స్, పెయింటర్స్, రిక్షా వర్కర్స్ యూనియన్, జేఏసీ సభ్యులు , ఏపీఎన్జీవో అసోసియేషన్ సభ్యులు, పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయిస్ మినిస్టీరియల్ అసోసియేషన్ సభ్యులు, పామర్రు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. పెడనలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, వివిధ సంఘాల నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ సంఘీభావం ప్రకటించారు. పెడన టైలరింగ్ అసోసియేషన్ నాయకులు 216 జాతీయ రహదారిపై బంటుమిల్లి చౌరస్తాలో దుస్తులు కుడుతూ వినూత్న నిరసన తెలిపారు. బెజవాడలో.. విజయవాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన బీఆర్టీఎస్ రోడ్డులో మోకాళ్లపై నిలబడి క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఐఎంఏ వైద్యులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. కృష్ణలంక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కేసర్ ఇమ్రాన్ మస్జిద్ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు నిరాహారదీక్షలు చేశారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. వంటలు వండి రోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద నుంచి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కంకిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజూ కొనసాగాయి. తెలుగు యువత ఆధ్వర్యంలో యువత కోలవెన్ను గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు ఆధ్వర్యాన ఈడుపుగల్లు సెంటరులో వసతిగృహ విద్యార్థులు జాతీయ రహదారిపై భోజనం చేసి నిరసన తెలియచేశారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీక్షలను కొనసాగించారు. పోరంకిలో నిర్వహించిన దీక్షల్లో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావులు సమైక్యాంధ్రపై చర్చ నిర్వహించారు. -
ఎస్మాను ప్రయోగించిన భయపడేది లేదు: అశోక్ బాబు
-
‘ఎస్మా చట్టానికి భయపడం’
అనంతపురం: ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె తీవ్రతను తగ్గించే ప్రసక్తే లేదని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం తమపై మోపిన ఎస్మా చట్టానికి భయపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు పోయినా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ట్రెజరీ ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ తాతయ్య తెలిపారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం కోరుతూ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్ష సాహసోపేత నిర్ణయమని బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాల జేఏసీ చైర్మన్ బోరంపల్లి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి యత్నాలు ఆరంభించింది. వారి సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా(ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ నెల 13 నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జిఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ట్రెజరీ, ఫైనాన్స్ శాఖల ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. వారి సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా(ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ నెల 13 నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జిఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.