ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె తీవ్రతను తగ్గించే ప్రసక్తే లేదని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
అనంతపురం: ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె తీవ్రతను తగ్గించే ప్రసక్తే లేదని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం తమపై మోపిన ఎస్మా చట్టానికి భయపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు పోయినా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ట్రెజరీ ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ తాతయ్య తెలిపారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం కోరుతూ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్ష సాహసోపేత నిర్ణయమని బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాల జేఏసీ చైర్మన్ బోరంపల్లి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
సీమాంధ్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి యత్నాలు ఆరంభించింది. వారి సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా(ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది.
రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ నెల 13 నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జిఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.